అది ప్రజలను ముంచే పార్టీ
ధరలు పెంచి భారం మోపుతున్నది
ఇంకా నమ్మి మోసపోదమా?
ఈటల గెలిస్తే ఎవరికి మేలు
ప్రజల కోసం రాజీనామా చేసిండా?
ఆయన స్వార్థం వల్లే ఉప ఎన్నిక
ఓటుతో బుద్ధి చెప్పండి
ఉద్యమబిడ్డ గెల్లు సీనును ఆశీర్వదించండి
రోడ్‌షోలో మంత్రి హరీశ్‌రావు
కరీంనగర్, అక్టోబర్ 7 (నమస్తే తెలంగాణ)/ హుజూరాబాద్/హుజూరాబాద్‌రూరల్ : ప్రచార పర్వంలో టీఆర్ఎస్ దూసుకుపోతున్నది. పార్టీ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ గెలుపు కోసం పల్లెలన్నీ ఏకమవుతున్నాయి. ఎటు చూసినా గులాబీ గుబాలింపులే కనబడుతున్నాయి. ఏ నోట విన్నా కారు గుర్తుకే ఓటేస్తామన్న నినాదం వినబడుతోంది. గురువారం హుజూరాబాద్ మండలం ధర్మరాజ్పల్లిలో మొదలైన ప్రచారం కందుగుల, పెద్దపాపయ్యపల్లి, చిన్నపాపయ్యపల్లి, కాట్రపల్లి, పోతిరెడ్డిపల్లి, వెంకట్రావుపల్లి, సిర్సపల్లి గ్రామాల్లో జరిగింది. ఎక్కడ చూసినా మంత్రి హరీశ్‌రావు, అభ్యర్థి గెల్లు శ్రీనివాస్‌కు జనం నీరాజనం పట్టారు. ప్రతి డప్పు వాయిద్యాలు, ఒగ్గు డోలు కళాకారులతో స్వాగతం పలికారు. దారి పొడవునా మహిళలు మంగళ హారతులు పట్టారు. పూల వర్షం కురిపించారు. కుర్మలు గొంగళ్లు, రైతులు నాగళ్లు బహుకరించారు. ధర్మరాజుపల్లిలో రాజన్న, ముదిరాజ్ కులస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కందుగుల రోడ్‌షోలో జనాలు బారులు తీరి నిల్చున్నారు. గెల్లు శ్రీనివాస్ అత్తగారి ఊరైన పెద్దపాపయ్యపల్లిలో జనం తండోపతండాలుగా వచ్చారు. ఇండ్లకు తాళాలు వేసి రోడ్‌షోలో పాల్గొన్నారు. సమ్మక్క గద్దెల నుంచి శివాలయం వరకు రోడ్ షో జరిగింది. చిన్నపాపయ్యపల్లెలో ఊరు మొత్తం కదిలి ‘గెల్లు’కు మద్దతు పలికింది. పేద కుటుంబానికి చెందిన గెల్లు శ్రీనివాస్‌కు ఎన్నికల ఖర్చు కింద ప్రజలు స్వచ్ఛందంగా విరాళాలు అందించారు. పెద్దపాపయ్యపల్లిలో గురువారం పుట్టిన రోజు జరుపుకున్న షాలిని అనే పాప రూ.500 అందించింది. రాము, తిరుపతి అనే మరో ఇద్దరు యువకులు తలా రూ.5 వేల చొప్పున రూ.10 వేలు ఇచ్చారు. చిన్నపాపయ్యపల్లిలో స్థానిక యువజన సంఘం నుంచి రూ.2,016, యాదవ సంఘం వారు రూ.10 వేలు, గొర్రపిల్లను అందజేశారు. వీరితో పాటు సిర్సపల్లికి చెందిన తూముల చొక్కారావు, మధురావు, గొర్ల మురళి, రామారావు, పోతిరెడ్డిపేటకు చెందిన చొల్లేటి కిషన్‌రెడ్డి, మంథన శ్రీనివాస్ విరాళాలు అందించారు. పోతిరెడ్డిపేటలో ‘మోడీ బతుకమ్మ’ అని సిలిండర్‌కు ఫ్లెక్సీ కట్టి ప్రచారంలో ప్రజలకు మంత్రి చూపించారు. ప్రచారంలో ఎమ్మెల్యేలు వొడితల సతీశ్ కుమార్, గువ్వల బాలరాజు, మాజీ మంత్రి ఇనుగాల పెద్దిరెడ్డి, జడ్పీటీసీ సభ్యుడు పడితం బక్కారెడ్డి, ఎంపీపీ రాణి, సింగిల్ విండో చైర్మన్ ఎడవెల్లి కొండాల్‌రెడ్డి, సర్పంచ్‌లు పాకాల లక్ష్మారెడ్డి, పడిదం భారతిరెడ్డి, పోరెడ్డి రజితరెడ్డి, గీసిడి దేవేంద్ర, నిరోష, సువర్ణల సునయన, కన్నెబోయిన తిరుమల, తాటికొండ పుల్లాచారి, ఎంపీటీసీలు కాసం పద్మరఘుపతిరెడ్డి, వైద్యుల శిరీషముకుందరెడ్డి, మన్యాల రాధమ్మ, రావుల అనిత, గద్దల లలిత, మంథని శ్రీనివాస్, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు సంగెం ఐలయ్య, నాయకులు ఇరుమల్ల సురేందర్‌రెడ్డి, మూగల లక్ష్మారెడ్డి, చిలుముల సత్యం, పింగిళి రాజేందర్‌రెడ్డి, రాజేశ్వర్‌రావు పాల్గొన్నారు.
బీజేపీ ధరల మంటపెడుతున్నది. పెట్రోల్, డీజిల్ ధరలు వారం వారం పెంచుతున్నది. సామాన్యుడు ఎట్ల బతుకుతడు? అలాంటి పార్టీకి ఓటెందుకు వేయాలి? ఓట్లేసే రోజు మహిళలంతా ఓసారి గ్యాస్ సిలిండర్‌కు దండం పెట్టి బయల్దేరున్రి. ధరలు పెంచే ఆపార్టీ వైపా..? భరోసానిచ్చే టీఆర్ఎస్ వైపా..? మీకే ఆలోచన తడుతది. ఇగ ఈటల రాజేందర్ స్వలాభం కోసం కాకపోతే.. హుజూరాబాద్ జిల్లా కావాల్ననో.. నియోజకవర్గానికి మెడికల్ కాలేజీ రావాల్ననో రాజీనామా చేసిండా..? ఆయన స్వార్థం కోసమే కదా ఈ ఉప ఎన్నిక తెచ్చిండు. నేను అబద్ధాలు మాట్లాడుతున్నానని అంటుండు. నేను చెప్పేదాంట్లో ఏదైనా అబద్ధమున్నదా..? పెద్దపాపయ్యపల్లి శివాలయం వద్ద వేప చెట్టుకిందికి రా.. జనం మధ్య బహిరంగ చర్చ పెట్టుకుందాం.
హుజూరాబాద్ ఉప ఎన్నికలో ఝూటా మాటలు చెబుతున్న బీజేపీకి ఓటుతోనే బుద్ది చెప్పాలని, ధర్మాన్ని, న్యాయాన్ని గెలిపించాలని ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు పిలుపునిచ్చారు. ధరలు పెంచే బీజేపీ వైపా.. భరోసానిచ్చే టీఆర్ఎస్ వైపు నిలబడతారో ప్రజలే ఆలోచించుకోవాలని సూచించారు. హుజూరాబాద్ మండలంలోని పలు గ్రామాల్లో టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ తదితరులతో కలిసి గురువారం ఆయన విస్తృత ప్రచారం, రోడ్ షోలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈటల రాజేందర్ తన స్వలాభం కోసం తప్ప, ప్రజల కోసం రాజీనామా చేశాడా..? అని ప్రశ్నించారు. హుజూరాబాద్ జిల్లా కావాలనో, నియోజకవర్గానికి మెడికల్ కాలేజీ కావాలనో, మరో ప్రజా సమస్యపైనో రాజీనామా చేయలేదని ఎద్దేవా చేశారు. ఆయన స్వార్థం వల్లే ఉప ఎన్నిక వచ్చిందని మండిపడ్డారు. పండుగ పూట గ్యాస్ సిలిండర్ ధర పెంచి కానుక ఇచ్చినందుకు ఆ పార్టీకి ఓటేయాలా..? అని ప్రశ్నించారు. గ్యాస్ ధరల పెంచి, పేదలపై గుదిబండ పెట్టారని, దీనిపై నిన్నే మా హుజూరాబాద్ ఆడబిడ్డలు మండిపడ్డారని గుర్తు చేశారు. వారానికోసారి పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు పెంచుతున్నారని, సామాన్యుడి కడుపు కొడుతున్నారని మండిపడ్డారు. తనను చూసే పనులు జరుగుతున్నాయని ఈటల రాజేందర్ చెప్పుకుంటున్నారని, కేసీఆర్ కిట్, రైతుబంధు, రైతు బీమా, 24 గంటల కరెంట్ ఎవరిని చూసి కేసీఆర్ ఇచ్చారని అడిగారు.
రైతుబంధు అందుకున్న తొలిరైతు ధర్మారాజ్పల్లికి చెందిన సంజీవ రెడ్డేనని గుర్తు చేశారు. దేశంలో బీజేపీ అధికారంలో ఉన్న 18 రాష్ర్టాల్లో ఎక్కడైనా ఇలాంటి పథకాలు అమలు చేస్తున్నారా? అని ప్రశ్నించారు. రాజేందర్ తనను చూసి పనులు చేస్తున్నారని చెప్పుకుంటున్నాడని, నిజానికి ఆయన చేయలేని, చేయని పనులు తాము ఇపుడు చేస్తున్నామని అన్నారు. ఆరుసార్లు ఈటల రాజేందర్‌ను గెలిపించినా ఒక్క ఇల్లు కూడా కట్టించ లేదని, ఒక్కసారి గెల్లు శ్రీనివాస్‌ను గెలిపిస్తే మరో 5 వేల డబుల్ బెడ్రూం ఇండ్లు కట్టించే బాధ్యత తనదని మంత్రి హరీశ్‌రావు స్పష్టం చేశారు. రైతులను చంపించిన బీజేపీకి ఓట్లు వేయమని ఏ విధంగా అడుగుతావని ఈటల రాజేందర్‌ను ప్రశ్నించారు. తాను అబద్ధాలు ప్రచారం చేస్తున్నానని ఈటల రాజేందర్ అంటున్నారని, నేను చెప్పేదాంట్లో ఏది అబద్ధం ఉందో చెప్పేందుకు పెద్దపాపయ్యపల్లి శివాలయం వద్ద వేప చెట్టుకిందికి వస్తే జనం మధ్య మాట్లాడుదామని అన్నారు. రైతులకు ఇప్పటికే రూ.25 వేలు, రూ.50 వేల వరకు తీసుకున్న పంట రుణాలు మాఫీ చేశామని, వచ్చే ఫిబ్రవరి, మార్చిలోగా మిగతా మొత్తాన్ని వడ్డీతో సహా రద్దు చేస్తామని హామీ ఇచ్చారు. మహిళలు ఓటు వేసే ముందు గ్యాస్ సిలిండర్‌కు దండం పెట్టి వెళ్లాలని విజ్ఞప్తి చేశారు. దళితబంధుపై విష ప్రచారాన్ని నమ్మొద్దని, కచ్చితంగా అర్హులందరికీ లబ్ధి చేకూరుతుందన్నారు. వెంకట్రావుపల్లిలో 250 మంది గొర్రెల కాపరులున్నట్లు తెలిసిందని, గెల్లును గెలిపిస్తే సిద్దిపేట మాదిరిగా ఇక్కడ కూడా తానే స్వయంగా గొర్రెల హాస్టల్ కట్టిస్తానని హామీ ఇచ్చారు.
మీ కాట్రపల్లి ఊరోళ్లు అభివృద్ధి గురించి అడిగితే ఈటల ఏమన్నడు గుర్తున్నదా.. మీ ఓట్లు వద్దు, మీదో తాగుబోతుల ఊరన్నడు.. యాదికచ్చిందా.. మిమ్మల్ని కించపరిచిన వ్యక్తి మీ దగ్గరికి ఓట్ల కోసం మళ్లీ వస్తడా? ఏం ముఖం పెట్టుకుని అడుగుతడు?. ఆయన మిమ్మల్నే కాదు.. హుజూరాబాద్ ప్రజలందరినీ వంచిస్తున్నడు. తండ్రిలాంటి వ్యక్తికి గోరి కడుతం అన్నడు.. కేసీఆర్ దయవల్ల ఎదిగి ఇప్పుడు ఆయనపైనే మాట్లాడుతున్నడు. ఆయనేం మనిషి. రైతుబంధు దండుగ అన్నడు.. మళ్లీ రైతుబంధు డబ్బులు తీసుకుంటున్నడు. గిట్లోంటి మనిషుంటడా? ఇంకా నమ్మి మోసపోదమా?. ఆయన కల్లబొల్లి మాటలను నమ్మి మోసపోవద్దు.