లాభసాటిగా ఉండే యూనిట్లను ఎంపిక చేసుకునేలా అవగాహన కల్పించాలి
దళితబంధుపై సమావేశంలో కలెక్టర్ ఆర్వీ కర్ణన్
కరీంనగర్, జనవరి 7 (నమస్తే తెలంగాణ): హుజూరాబాద్ నియోజకవర్గంలో దళితబంధు పథకం కింద యూనిట్లను ఎంపిక చేసుకున్న లబ్ధిదారులకు వేగంగా డబ్బులు విడుదల చేయాలని, యూనిట్లను త్వరగా గ్రౌండింగ్ చేయాలని కలెక్టర్ ఆర్వీ కర్ణన్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో దళితబంధు పథకం అమలుపై క్లస్టర్, గ్రౌండింగ్ అధికారులు, హుజూరాబాద్ నియోజకవర్గ మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీవోలతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, దళితబంధు లబ్ధిదారులు స్వయం ఉపాధి కింద లాభసాటి యూనిట్లు పెట్టుకునేందుకు సిద్ధంగా ఉండి అనుభవం ఉన్న వారికి వేగంగా 50 శాతం డబ్బులు విడుదల చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఫార్మసీ, ఆటో మొబైల్స్, ఫొటో స్టూడియో, సెంట్రింగ్, డెయిరీ , పేపర్ ప్లేట్స్, ఎలక్ట్రికల్ గూడ్స్, క్లాత్ షోరూమ్స్ లాంటి లాభసాటిగా ఉండే యూనిట్లను ఎంపిక చేసుకున్న లబ్ధిదారులకు డబ్బులు విడుదల చేసి యూనిట్లను గ్రౌండింగ్ చేయాలన్నారు. ముగ్గురు, నలుగురు కలిసి సూపర్ మారెట్ పెట్టుకుంటామని ముందుకు వస్తే వారికి సరైన ప్రదేశం, ప్రధాన రహదారి ప్రాంతంలో సూపర్ మారెట్ పెట్టుకునేలా అవగాహన కల్పించాలని చెప్పారు. ట్రాన్స్పోర్ట్ వాహనాలను ఎంపిక చేసుకున్న లబ్ధిదారులు తమ యూనిట్లను మార్చుకునేందుకు అవకాశం ఇవ్వాలని, వారు పాడి గేదెలు, ఇతర లాభసాటి యూనిట్లను ఎంపిక చేసుకునేందుకు తగిన సూచనలు, సలహాలు అందజేయాలని అధికారులకు సూచించారు. ఈ నెల 10వ తేదీలోగా సగానికి పైగా యూనిట్లను గ్రౌండింగ్ చేయాలని అధికారులను ఆదేశించారు. లబ్ధిదారులు ఇదివరకే వ్యాపారం చేస్తుంటే వారి వ్యాపారం విస్తరణ కోసం ప్రాధాన్యమివ్వాలన్నారు. ఎక్స్కవేటర్, హార్వెస్టర్, డీసీఎం వాహనాల కొనుగోలు కోసం గ్రూపులుగా వచ్చిన వారికి వాహనాలు అందించాలని తెలిపారు. సమావేశంలో అదనపు కలెక్టర్ జీవీ శ్యాం ప్రసాద్‌లాల్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్, డీఆర్డీవో శ్రీలత, ఉప రవాణా శాఖ అధికారి చంద్రశేఖర్‌గౌడ్, క్లస్టర్, గ్రౌండింగ్ అధికారులు, ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్లు, ఎస్సీ కార్పొరేషన్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.