సిరిసిల్ల/ కలెక్టరేట్, నవంబర్ 6 : “పోడు భూముల సమస్యను శాశ్వతంగా పరిష్కరించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం చట్టానికి లోబడి పటిష్ట చర్యలు తీసుకుంటున్నది. ఈ నెల 8 నుంచి రాజన్న సిరిసిల్ల జిల్లాలోని 67 గ్రామాల్లో సదస్సులు నిర్వహించి అర్జీలు స్వీకరిస్తాం. క్షేత్రస్థాయిలో పరిశీలించి వాస్తవ పరిస్థితుల ఆధారంగా నిర్ణయం తీసుకుంటాం. ఇకపై అటవీ భూములు ఎవరు ఆక్రమించినా జైలుకు వెళ్లకు తప్పదు” అని రాష్ట్ర ఐటీ, మున్సిపల్, పరిశ్రమల శాఖ మంత్రి కే తారక రామారావు స్పష్టం చేశారు. శనివారం సిరిసిల్ల పట్టణంలో పర్యటించిన ఆయన, ముందుగా కేడీసీసీ బ్యాంకు నూతన భవన సముదాయాన్ని, బైపాస్ రోడ్డులోని రెడ్డి సంక్షేమ సంఘం జిల్లా కార్యాలయాన్ని ప్రారంభించారు. అనంతరం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ‘పోడు భూముల సమస్యల పరిష్కారం, అడవుల సంరక్షణ’ అంశాలపై అఖిల పక్ష నేతలతో నిర్వహించిన అవగాహన సదస్సుకు హాజరై సమీక్షించి, దిశానిర్దేశం చేశారు.
పోడు భూముల సమస్యకు శాశ్వత పరిష్కారం దిశగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని రాష్ట్ర ఐటీ, మున్సిపల్, పరిశ్రమల శాఖల మంత్రి కే తారకరామారావు స్పష్టం చేశారు. శనివారం రాజన్న సిరిసిల్ల జిల్లాలో మంత్రి కేటీఆర్ పర్యటించారు. ఉదయం 11.30 గంటలకు సిరిసిల్ల పట్టణంలోని కేడీసీసీ బ్యాంకు నూతన భవన సముదాయాన్ని నాఫ్స్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్‌రావుతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రికి కొండూరి తెల్ల కండువా కప్పి ఆహ్వానించారు. అనంతరం బైపాస్ రోడ్డులోని రెడ్డి సంక్షేమ జిల్లా కార్యాలయాన్ని ప్రారంభించి, సమీకృత కలెక్టరేట్‌కు చేరుకున్నారు. మధ్యాహ్నం 12.30 గంటలకు కలెక్టరేట్ సమావేశ మందిరంలో ‘పోడు భూముల సమస్యల పరిష్కారం, అడవుల సంరక్షణ’ అంశాలపై అధికారులు, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు, 8 మండలాలకు చెందిన ప్రజాప్రతినిధులతో నిర్వహించిన అఖిలపక్ష అవగాహన సదస్సుకు హాజరై సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ జిల్లా సుమారు 4,72,329 ఎకరాల భౌగోళిక విస్తీర్ణం కలిగి ఉందని, ఇందులో ప్రాథమిక అంచనాల ప్రకారం 96,394 ఎకరాల అటవీ ప్రాంతం 20 శాతం మేర ఉందన్నారు. జిల్లాలో సుమారు 8 వేల ఎకరాల్లో గిరిజన, ఇతరులు అటవీ భూ ప్రాంతంలో పోడు వ్యవసాయం చేసుకుంటూ జీవనోపాధి పొందుతున్నట్లు తెలిపారు.
పేద వారికి న్యాయం చేస్తూ, అడవిని, పుడమిని కాపాడుకోవడం లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఈ నెల 8 నుంచి గ్రామ గ్రామాన సదస్సులు నిర్వహించి, పోడు భూములు ఆక్రమణలో ఉన్న వారి నుంచి అర్జీలు స్వీకరించనున్నట్లు తెలిపారు. అర్హత ఉన్న వాటిని పరిశీలించి, క్షేత్రస్థాయిలో వాస్తవికత పరిస్థితుల ఆధారంగా నిర్ణయం తీసుకోనున్నట్లు వెల్లడించారు. పోడు భూముల సమస్య పరిష్కారం తర్వాత భవిష్యత్తులో తిరిగి అటవీ భూమి ఆక్రమణకు గురికాకుండా చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు. గ్రామాల్లో అటవీ హక్కుల కమిటీలు, జిల్లా స్థాయిలో అటవీ సంరక్షణ కమిటీలు ఏర్పాటు చేయాలన్నారు. అన్ని పక్షాల భాగస్వామ్యంతో పారదర్శకంగా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. 33 శాతం అటవీ ప్రాంతంతో వాతావరణ సమతుల్యత ఉంటుందని, అటవీ సంపద సంరక్షణ అందరి ప్రాథమిక కర్తవ్యమని చెప్పారు. అడవులు క్షీణిస్తూ ఉండడంతో వాతావరణ సమతుల్యత దెబ్బతిని అతివృష్టి, అనావృష్టి, కాలం లేకుండా వర్షాలతో ఎన్నో ఇబ్బందులు పడుతామని తెలిపారు. పార్టీలకతీతంగా అన్ని పక్షాల సమ్మతితో ముందుకు వెళ్లాలని కోరారు. అటవీ, రెవెన్యూ భూ సమస్యలు ఉన్న చోట రెండు శాఖలు జాయింట్ సర్వే చేపట్టి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలన్నారు. గతంలో కేంద్ర ప్రభుత్వం ఆర్వోఎఫ్ఆర్ చట్టం తెచ్చి గిరిజనులకు హక్కు కల్పించిందని, గిరిజనేతరుల విషయంలో కేంద్ర చట్టం అడ్డంకిగా ఉందని, ఈ సమస్య పరిష్కారానికి అఖిలపక్షంతో కేంద్రం దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో ‘ధరణి’ ప్రవేశపెట్టి, విజయవంతంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికే రూ.10 లక్షలకు పైగా రిజిస్ట్రేషన్లు జరిగాయన్నారు.
త్వరలో డిజిటల్ సర్వే
రాష్ట్రంలో త్వరలో డిజిటల్ సర్వే చేపట్టనున్నట్లు మంత్రి కేటీఆర్ వెల్లడించారు. ఈ సర్వేతో అక్షాంశాలు, రేఖాంశాలతో భూముల విషయంలో కచ్చితత్వం వస్తుందన్నారు. పోడు సమస్యలు ఉన్న 67 గ్రామాల్లో సదస్సుల నిర్వహణ అనంతరం సేకరించిన వివరాలతో తిరిగి అఖిలపక్ష సమావేశం నిర్వహించి పారదర్శకంగా చర్యలు చేపట్టనున్నట్లు వెల్లడించారు. పేదవారికి జీవనోపాధి, భవిష్యత్ తరాలకు అడవి లక్ష్యంగా ప్రతి ఒక్కరూ ప్రతినబూనాలన్నారు. సమావేశంలో నాఫ్స్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్రావు, జడ్పీ చైర్పర్సన్ నాలకొండ అరుణ, మానకొండూరు ఎమ్మెల్యే రసమయి బాలకిషన్, జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ బీ సత్యప్రసాద్, జెడ్పీ సీఈవో గౌతంరెడ్డి, డీపీవో రవీందర్, డీటీడీవో గంగారాం, జడ్పీటీసీలు, ఎంపీపీలు, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు.
అడవులను కాపాడుకోవాలి
పోడు భూముల సమస్య దశాబ్ధాలుగా పరిష్కారం కావడం లేదు. గ్రామాల్లో నిర్వహించే సదస్సుల్లో ప్రతి దరఖాస్తు స్క్రుటినీ చేసి పారదర్శకంగా పరిష్కారం చూపాలి. జిల్లాలో ఇంకా 10 శాతం అటవీ సంపద పెంచాల్సిన అవసరం ఉంది. అడవులను కాపాడుకోవడంలో ప్రజల భాగస్వామ్యం అవసరం. పోడు భూముల శాశ్వత పరిష్కారంతోపాటు అడవిని, పేద రైతుల హక్కులను కాపాడుకోవాలి.
గ్రామసభలో అర్జీలు స్వీకరిస్తాం
పోడు భూముల సమస్యకు పరిష్కారం చూపుతూ అర్హులకు పట్టాలిచ్చి, మిగిలిన అడవిని కాపాడుకొనేలా చర్యలు చేపడుతాం. గిరిజన, గిరిజనేతరుల అర్జీలు స్వీకరిస్తాం. గ్రామ స్థాయిలో సర్పంచ్ అధ్యక్షతన, పంచాయతీ కార్యదర్శి, వీఆర్ఏ, అటవీ బీట్ అధికారి, మండల సర్వేయర్‌తో ఉన్న బృందం సోమవారం నుంచి అర్జీలు ఏ ఫారంలో, ఎలా సమర్పించాలి? అనే విషయంలో అవగాహన కల్పిస్తారు. గ్రామ సభ ద్వారా అర్జీలు స్వీకరిస్తాం. 8 మండలాల పరిధిలోని 67 గ్రామాల్లో అటవీ హక్కు కమిటీలు ఏర్పాటు చేశాం. ప్రతి అర్జీని పరిశీలించి చర్యలు తీసుకుంటాం