కాంగ్రెస్, బీజేపీ పొత్తు వల్లే ఈటల గెలుపు
పార్టీ కోసం కష్టపడి పనిచేసిన కార్యకర్తలకు కృతజ్ఞతలు
ఏఎంసీ చైర్మన్ బాలకిషన్‌రావు, ట్రస్మా చైర్మన్ తిరుపతిరెడ్డి
వీణవంక, నవంబర్ 6: ‘హుజూరాబాద్ ఉప ఎన్నికలో ఈటల రాజేందర్ దుష్ప్రచారం చేసిండు. టీఆర్ఎస్, కేసీఆర్మీద బదనాం చేసేలా మాట్లాడిండు. సెంటిమెంట్ డైలాగులతో ప్రజలను మభ్యపెట్టిండు. దేశ చరిత్రలోనే ఎక్కడా లేనివిధంగా కాంగ్రెస్‌తో బీజేపీ పొత్తు పెట్టుకోవడం వల్లే గెలిచిండు. లేదంటే డిపాజిట్ కూడా రాకపోతుండే. ఏదైమైనా నైతిక విజయం టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్‌దే’ అని ఏఎంసీ చైర్మన్ వాల బాలకిషన్‌రావు, ట్రస్మా నియోజకవర్గ అధ్యక్షుడు ముసిపట్ల తిరుపతిరెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ విజయభాస్కర్‌రెడ్డి, మాజీ చైర్మన్ మాడ సాధవరెడ్డి పేర్కొన్నారు. వీణవంకలో శనివారం వారు విలేకరులతో మాట్లాడారు. ఎన్నికలో గెలుపోటములు సహజమని, నాలుగు నెలలుగా టీఆర్ఎస్ గెలుపు కోసం విరామం లేకుండా పని చేసిన, మద్దతు తెలిపిన కార్యకర్తలు, నాయకులు, ప్రజాప్రతినిధులకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఎన్నికల సమయంలో కార్యకర్తలకు, ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చే బాధ్యత పార్టీ తీసుకుంటుందని, మంత్రి హరీశ్‌రావు నాయకత్వంలో పనులు పూర్తి చేస్తామని తెలిపారు. ఎన్నికల సమయంలో చల్లూరును ప్రత్యేక మండలంగా ఏర్పాటు చేస్తామని ఇచ్చిన హామీని త్వరలోనే నెరవేర్చుతారని వివరించారు. ఎవరూ అధైర్య పడొద్దని, ప్రతి కార్యకర్తకు టీఆర్ఎస్ అండగా ఉంటుందని చెప్పారు. రాష్ట్రంలో ఇంకా రెండున్నరేండ్లు టీఆర్ఎస్సే అధికారంలో ఉంటుందన్న విషయాన్ని ప్రజలు గమనించాలని కోరారు. పార్టీ ఆదేశాల ప్రకారం మండల, గ్రామ కమిటీ, నియోజకవర్గ కమిటీలను ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఎన్నికలో గెలిచాం కదా అని బీజేపీ నాయకులు సోషల్ మీడియాలో రెచ్చగొట్టే కామెంట్లు పెడితే తగిన బుద్ధి చెబుతామని హెచ్చరించారు. ప్రజల తీర్పును శిరసావహిస్తామని, ప్రజలకు అండగా ఉండి పనులు చేస్తామని పేర్కొన్నారు. సమావేశంలో సర్పంచుల ఫోరం అధ్యక్షుడు ఎక్కటి రఘుపాల్‌రెడ్డి, ఎంపీటీసీల ఫోరం అధ్యక్షుడు కాసం వీరారెడ్డి, సర్పంచులు కాంతారెడ్డి, మోరె సారయ్య, ఎంపీటీసీలు రాంచందర్, మాజీ జడ్పీటీసీ ప్రభాకర్, నాయకులు పరిపాటి రవీందర్‌రెడ్డి, చిన్నాల అయిలయ్య, పొదిల రమేశ్, చదువు మహేందర్‌రెడ్డి, నర్సింహారెడ్డి, సత్యనారాయణ, గంగాడి తిరుపతిరెడ్డి, మ్యాకల సమ్మిరెడ్డి, యాసిన్, సంపత్‌రెడ్డి, యర్రి స్వామి, సతీశ్, బండ కిషన్‌రెడ్డి, సమ్మయ్య తదితరులు పాల్గొన్నారు.