ఎక్కడికక్కడ ఊపందుకున్న వానకాలం ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ
ఇప్పటికే కరీంనగర్ జిల్లాలో 52 వేల మెట్రిక్ టన్నుల సేకరణ
కేంద్రం కొనకున్నా.. రాష్ట్ర సర్కారు భరోసా
కరీంనగర్, అక్టోబర్ 5 (నమస్తే తెలంగాణ): సేద్యపు జిల్లా కరీంనగర్లో ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ స్పీడందుకున్నది. ప్రతి గింజా కొనడమే లక్ష్యంగా సర్కారు ఊరూరా అడుగులు వేస్తున్నది. కేంద్రం కొనకున్నా రాష్ట్ర సర్కారే స్వయంగా రంగంలోకి దిగింది. కరీంనగర్ జిల్లాలో 351 సెంటర్లను సిద్ధం చేయగా, యంత్రాంగం ఇప్పటిదాకా 175 కేంద్రాల ద్వారా 52,037.610 మెట్రిక్ టన్నులను కొనుగోలు చేసింది. రైతులకు ఎప్పటికప్పుడు తమ బ్యాంకు ఖాతాల్లో నగదు జమ చేస్తూ, ఏ ఇబ్బంది రాకుండా చూస్తున్నది. కాగా, రైతులు ఆందోళన చెందవద్దని, వానకాలంలో పండిన చివరి ధాన్యపు గింజ వరకు కొనుగోలు చేస్తామని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ భరోసా కల్పిస్తున్నారు.
కాళేశ్వరం ప్రాజెక్టు అందుబాటులోకి వచ్చిన తర్వాత జిల్లాలో వరి సాగు విస్తీర్ణం పెరిగింది. దీం తో ఒక్కసారిగా ధాన్యం దిగుబడులు రెండింతలు పెరిగాయి. ఈ వానకాలంలో కూడా 2,72,951 ఎకరాల్లో వరి సాగు చేశారు. 6.20 మెట్రిక్ టన్నుల దిగుబడి వచ్చే అవకాశం ఉందని వ్యవసాయ శాఖ అంచనా వేస్తున్నది. ఇందులో సుమా రు 90 మెట్రిక్ టన్నులు సీడ్ ప్రొడక్షన్‌కు పోను రైతుల అవసరాలకు మరో 1.31 లక్షల మెట్రిక్ టన్నులు ఉంచుకునే అవకాశం ఉంది. ఇక మిగిలిన 3.97 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వచ్చే అవకాశం ఉందని అధికారులు ఇప్పటికే అంచనాలు వేశారు. ఇందు కు తగినట్లుగా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు.
ఊరూరా కొనుగోలు కేంద్రాలు..
రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా అధికారులు 351 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇందులో ఐకేపీ నుంచి 69, పీఏసీఎస్‌ల నుంచి 231, డీసీఎమ్మెస్ నుంచి 43, మార్కెటిం గ్ శాఖ నుంచి 8 కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇందులో ఇప్పటికే 259 కేంద్రాలను ప్రారంభించారు. హుజూరాబాద్, మానకొండూర్, శంకరపట్నం తదితర మండలాల్లోని 175కేంద్రాల ద్వారా ఇప్పటికే కొనుగోళ్లు జరుపుతున్నారు. మిగ తా ప్రాంతాల్లో ఇప్పుడిప్పుడే కొనుగోళ్లు పుంజుకుంటున్నాయి. ముందుగా కోతలకు వచ్చే హుజూరాబాద్ నియోజకవర్గంలో వారం పది రోజుల కిందనే కొనుగోలు కేంద్రాలు ప్రారంభించారు. మానకొండూర్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ కూడా కొనుగోలు కేంద్రాలను విస్తృతంగా ప్రారంభిస్తున్నారు. శుక్రవారం కరీంనగర్, కొత్తపల్లి మండలాల్లో పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ కూడా ఈ కేంద్రాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా గంగుల మాట్లాడుతూ వానకాలంలో పండిన ప్రతి ధాన్యం గింజనూ కొనుగోలు చేస్తామని స్పష్టం చేశారు.
కొనుగోళ్లతోనే చెల్లింపులు..
కొనుగోళ్లు జరిపిన కొద్ది గంటల్లోనే రైతుల ఖాతాల్లో నగదు జమ చేస్తున్నారు. ఇప్పటివరకు ఐకేపీ ద్వారా 459 రైతుల నుంచి 3,164.900, పీఏసీఎస్ ద్వారా 4,985 మంది రైతుల నుంచి 39,289.030, డీసీఎమ్మెస్ ద్వారా 1,080 మంది రైతుల నుంచి 8,267.700, మార్కెటింగ్ శాఖ ద్వారా 222 మంది రైతుల నుంచి 1,315 మెట్రిక్ టన్నుల చొప్పున మొత్తం 6,746 మంది రైతుల నుంచి 52,037.610 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశారు. వీటి మొత్తం విలువ రూ.101.99 కోట్లు కాగా, ఇప్పటికే 42 శాతం మంది రైతులకు సంబంధించిన రూ.22.43 కోట్లు వారి ఖాతాల్లో జమచేశారు.
ఈ నెలలోనే అత్యధికంగా..
రైతులు ఈ నెలలోనే ముమ్మరంగా కోతలు నిర్వహించే అవకాశం ఉంది. దిగుబగి కూడా ఆ స్థాయిలోనే వచ్చే అవకాశాలు ఉన్నాయని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే 40వేల మె ట్రిక్ టన్నుల వరకు ధాన్యం వచ్చింది. ఇక ఈ నెల లో 2.68లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగో లు కేంద్రాలకు వచ్చే అవకాశం ఉన్నట్లు అధికారు లు అంచనా వేస్తున్నారు. డిసెంబర్లో మరో 73 నుంచి 75 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు కేంద్రాలకు రావచ్చని వారు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ నెలలో ధాన్యం కొనుగోళ్లు ముమ్మరంగా జరిగే అవకాశం ఉంది. గన్నీ బ్యాగులకు కొరత లేకుండా అధికారులు అన్ని చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికే 30,25,000 గన్నీ బ్యాగులను కేంద్రాలకు సరఫరా చేశారు. ఇంకా 27,50,291 బ్యాగులు అందుబాటులో ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు.