రైతులూ ఆందోళన వద్దు
యాసంగి ధాన్యాన్ని కేంద్ర ప్రభుత్వం కొనాల్సిందే
ఎఫ్‌సీఐ కొర్రీలు పెడితే బీజేపీ ఎంపీలు ఏం చేస్తున్నరు?
మంత్రి గంగుల కమలాకర్
పలు గ్రామాల్లో కొనుగోలు కేంద్రాలు ప్రారంభం
కొత్తపల్లి/కరీంనగర్ రూరల్, నవంబర్ 5: వానకాలం పండిన ధాన్యంలో ప్రతి గింజనూ కొంటామని, రైతులు ఆందోళన చెందవద్దని రాష్ట్ర మంత్రి గంగుల కమలాకర్ భరోసా ఇచ్చారు. శుక్రవారం కొత్తపల్లి మండల కేంద్రం, కరీంనగర్ మండలం దుర్శేడ్, నగునూర్ గ్రామాల్లో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. రైతులతో కాసేపు ముచ్చటించారు. అనంతరం మంత్రి మాట్లాడారు. రైతులు పం డించిన ప్రతి పంటనూ కేంద్రం కొనాల్సిందేనని, యాసంగి సీజన్లో ధాన్యాన్ని కొనుగోలు చేసేలా కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు సీఎం కేసీఆర్‌తో కలిసి మోదీని కలుస్తామని చెప్పారు. వ్యవసాయ చట్టాలు కేంద్ర పరిధిలోనివని, రైతులు పండించిన ధాన్యాన్ని ఎఫ్‌సీఐ ద్వారా కొనుగోలు చేసే బాధ్యత కేంద్రానికే ఉంటుందని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం ఏడాదిన్నర కాలంగా ధాన్యాన్ని కొనుగోలు చేయబోమని పేచీ పెడుతున్నదని చెప్పారు. దీనిపై సీఎం కేంద్రంపై ఒత్తిడి తీసుకురావడంతో వానకాలంలో కొంతమేర సేకరిస్తామని చెప్పిందని, ఈ క్రమంలో రైతులకు ఎక్కడా ఇబ్బంది కావద్దని రాష్ట ప్రభుత్వమే పూర్తిగా కొనాలని నిర్ణయించిందని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ ఉత్పత్తులకు కనీస మద్దతు ధర ఒక్క రూపాయి పెంచినా కొనుగోలు చేయమని కేంద్రం కరాకండిగా చెబుతున్నదని, ఇది ఎంతవరకు కరెక్టో చెప్పాలన్నారు. కాళేశ్వరం జలాల రాకతో తెలంగాణలో పంట దిగుబడులు పెరిగి దేశానికే అన్నం పెట్టే స్థాయికి చేరిందన్నారు. రైతుల కోసం తెలంగాణ ప్రభుత్వం ఎంతో చేసిందన్నారు.
పంట కొనుగోళ్ల విషయంలో రాష్ట్ర నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, ఎంపీ బండి సంజయ్, ఇతర ఎంపీ లు ఎందుకు మాట్లాడడం లేదని, ఎఫ్‌సీఐ ధా న్యం కొనేలా కేంద్రంపై ఒత్తిడి పెంచాలని డిమాండ్ చేశారు. అందుకు తాము పూర్తిగా సహకరిస్తామని స్పష్టం చేశారు. నిబంధనల మేరకు రైతులు ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తేవాలన్నారు. రైతులు దళారులను నమ్మి మోసపోవద్దని, నిబంధనల ప్రకారం ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తెచ్చి మద్దతు ధర పొం దాలని సూచించారు. కార్యక్రమాల్లో ఎంపీపీ లక్ష్మయ్య, జడ్పీటీసీ లలిత, కరీంనగర్ మార్కెట్ కమిటీ చైర్పర్సన్ ఎలుక అనిత, డీఏవో శ్రీధర్, దుర్శేడ్ విండో చైర్మన్ ఆనందరావు, వైస్ చైర్మన్లు గోను నర్సయ్య, బీరం ఆంజనేయులు, కొత్తపల్లి మున్సిపల్ చైర్మన్ రుద్ర రాజు, డీసీఎంఎస్ వైస్ చైర్మన్ ఫక్రూద్దీన్, మాజీ ఎంపీపీ వాసాల రమేశ్, మాజీ జడ్పీ కో ఆప్షన్ సభ్యుడు ఎండీ జమీలొద్దీన్, సర్పంచులు గాజుల వెంకటమ్మ, ఉప్పు శ్రీధర్, ఉపసర్పంచులు సంపత్‌రావు, దామోదర్, శేఖర్, శంకర్‌గౌడ్, ఎంపీటీసీలు రాజ్యలక్ష్మి, శ్రీనివాస్, వినయ్‌కుమార్, తిరుపతి, అంజిరెడ్డి, రాజమల్లు, మారుతి, బలుసుల శంకర్, ఊరడి మల్లారెడ్డి, డైరెక్టర్లు తిరుపతి, రమేశ్‌గౌడ్, అంజయ్య ఉన్నారు.