కమలాపూర్ రూరల్, అక్టోబర్ 5: బీజేపీ నాయకులకు కేంద్రం నుంచి నిధులు తెచ్చే దమ్ముందా అని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ప్రశ్నించారు. కమలాపూర్ మండలంలోని గూడురు, శ్రీరాముల పల్లి, అంబాల గ్రామాల్లో టీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశాన్ని నిర్వహించారు. రాష్ర్టానికి బీజేపీ చేసిందేమి లేదని విమర్శించారు. కేంద్రం తెలంగాణపై వివక్ష చూపుతుంటే, ఇక్కడి నాయకులు రాష్ట్రంలో రాజకీయాలకే పరిమితమయ్యారని మండిపడ్డారు. నమ్మి, ఉన్నతస్థాయికి చేర్చిన టీఆర్ఎస్ను వదిలి ఈటల బీజేపీలో చేరిండని ఎద్దేవా చేశారు. ఈటల రాజేందర్‌కు ఆస్తుల సంపాదనలోనే ఆత్మగౌరవం ఉందని స్పష్టం చేశారు. నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయకుండా, 20 ఏండ్లలో తన ఆస్తులను కూడబెట్టుకున్నాడని మండిపడ్డారు. రాష్ర్టాభివృద్ధిని అడ్డుకుంటున్న బీజేపీ వంచన చేరిన ఈటల రాజేందర్‌కు బుద్ది చెప్పే సమయం వచ్చిందని, ఈ నెల 30న జరిగే ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్‌ను భారీ మెజారిటీతో గెలిచే విధంగా కార్యకర్తలు కృషి చేయాలని పిలుపునిచ్చారు.