కేసీఆర్ పాలనలో అన్ని వర్గాలకు సమ ప్రాధాన్యం
మంత్రి కొప్పుల ఈశ్వర్
జమ్మికుంటలో చర్చి అభివృద్ధి, డ్రైవర్ల అసోసియేషన్ భనన నిర్మాణ ప్రొసీడింగ్స్ అందజేత
జమ్మికుంట, సెప్టెంబర్ 5: బీజేపీ మొదటి నుంచి ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్నదని మంత్రి కొప్పుల ఈశ్వర్ ఆరోపించారు. ఆదివారం జమ్మికుంట ఎఫ్‌సీఐ గోదాంల సమీపంలోని చర్చి అభివృద్ధికి రూ.10 లక్షలు, లారీ డ్రైవర్ల అసోసియేషన్ భవన నిర్మాణానికి రూ.15 లక్షలు మంజూరు కాగా, అనుమతి పత్రాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి ఈశ్వర్ మాట్లాడుతూ బీజేపీ మతోన్మాద పార్టీ అని, ఎస్సీ, ఎస్టీ, బీసీ, క్రిస్టియన్లు, ముస్లింలు అంటే ఆ పార్టీ నాయకులకు పడదని ఆరోపించారు. టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ మాత్రం అన్ని మతాలను సమానంగా చూస్తూ మత సామరస్యానికి పెద్ద పీట వేస్తున్నారని కొనియాడారు. హైదరాబాద్‌లోని కోకాపేటలో క్రిస్టియన్ భవనాన్ని గొప్పగా కట్టడమే కాకుండా బరియల్ గ్రౌండ్స్‌కు స్థలం కేటాయించి, అభివృద్ధికి నిధులిచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. ఏటా క్రిస్మస్ సందర్భంగా పేదలకు దుస్తులు పంపిణీ చేయడమే కాకుండా చర్చిల నిర్మాణం, మరమ్మతుల కోసం ఆర్థిక సహాయాన్ని సీఎం కేసీఆర్ అందిస్తున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్, మున్సిపల్ చైర్మన్ తక్కళ్లపల్లి రాజేశ్వరరావు, టీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు రాజ్‌కుమార్, బుగ్గారం జడ్పీటీసీ బాదినేని రాజేందర్ తదితరులు పాల్గొన్నారు.