రాష్ట్ర ఆహార కమిషన్ చైర్మన్ కె తిరుమల్ రెడ్డి
ఆహార భద్రత చట్టం అమలు తీరుపై సమీక్ష
కరీంనగర్, జనవరి 5 (నమస్తే తెలంగాణ) : ఆహార భద్రతా చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయాలని, ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణమే లక్ష్యంగా ముందుకు సాగాలని తెలంగాణ రాష్ట్ర ఆహార కమిషన్ చైర్మన్ కె తిరుమల్‌రెడ్డి పేర్కొన్నారు. బుధవారం కలెక్టరేట్ ఆడిటోరియంలో ఆహార భద్రతా చట్టం-2013 అమలు తీరుపై కమిషన్ సభ్యులు, కలెక్టర్ ఆర్వీ కర్ణన్‌తో కలిసి జిల్లా అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆహార కమిషన్ చైర్మన్ తిరుమల్‌రెడ్డి మాట్లాడుతూ, పేదల కోసం రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను వారికి అందేలా చూడాల్సిన బాధ్యత అధికారులదేనని తెలిపారు. లబ్ధిదారులకు గల చట్టబద్ధమైన హకులను అమలు చేయాలని సూచించారు. అర్హులైన కొత్త వారికి రేషన్ కార్డులు అందించాలన్నారు. 65 సంవత్సరాల పైబడిన వృద్ధులకు రేషన్ షాపుల్లో వేలిముద్రలు, ఐరిష్ రావడం లేదని రేషన్ ఇవ్వడం ఆపొద్దని సూచించారు. తహసీల్దార్లు రేషన్ షాపులను పర్యవేక్షించాలని తెలిపారు. కలెక్టర్ ఆర్వీ కర్ణన్ మాట్లాడుతూ చౌక ధరల దుకాణాల్లో వృద్ధులకు వేలిముద్రలు, ఐరిష్ రాకున్నా రేషన్ సరుకులు అందేలా చర్యలు తీసుకోవాలని తహసీల్దార్లు, ప్రజాప్రతినిధులకు సూచించారు. అంగన్వాడీ కేంద్రాల్లో పిల్లలు, గర్భిణులు, బాలింతలకు పోషకాహారం అందించాలని జిల్లా సంక్షేమాధికారికి సూచించారు. వ్యాక్సినేషన్ మొదటి డోసు వందశాతం పూర్తిచేసి రాష్ట్రంలో జిల్లాను మొదటి స్థానంలో నిలిపామన్నారు. అంతకుముందు ఆహార కమిషన్ సభ్యుడు ఓరుగంటి ఆనంద్ ఆహార భద్రతా చట్టం గురించి, అమలు చేయాల్సిన విధానం గురించి విపులంగా వివరించారు. సమావేశంలో జడ్పీచైర్మన్ కనుమల్ల విజయ, అదనపు కలెక్టర్లు జీవీ శ్యాంప్రసాద్‌లాల్, గరిమా అగర్వాల్, ఆహార కమిషన్ సభ్యులు ములుగంటి భారతి, రంగినేని శారద, గోవర్ధన్‌రెడ్డి, జడ్పీ సీఈవో ప్రియాంక, కరీంనగర్, హుజూరాబాద్ ఆర్డీవోలు ఆనంద్‌కుమార్, రవీందర్‌రెడ్డి, జడ్పీటీసీలు, ఎంపీపీలు, సర్పంచులు, జిల్లా సంక్షేమ అధికారి పద్మావతి, జిల్లా పౌరసరఫరాల అధికారి సురేష్‌రెడ్డి, జిల్లా పంచాయతీ అధికారి వీర బుచ్చయ్య, తహసీల్దార్లు, ఎంపీడీవోలు, అధికారులు పాల్గొన్నారు.