ఇక్కడి పథకాలు ఎక్కడైనా అమలు చేస్తున్నారా?
అనవసర ఆరోపణలు మానుకోవాలి
పిచ్చిపిచ్చిగా మాట్లాడితే ఊరుకోం
మంత్రి కొప్పుల ఈశ్వర్
కరీంనగర్, జనవరి 5 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : యావత్ ప్రపంచం కాళేశ్వరం ప్రాజెక్టును కీర్తిస్తోంటే జేపీ నడ్డా బక్వాస్ మాటలు మాట్లాడుతున్నారని, ఇది ఈయన దిగజారుడుకు నిదర్శనమని మంత్రి కొప్పుల ఈశ్వర్ విమర్శించారు. రాష్ర్టానికి వచ్చిన ప్రతి కేంద్ర మంత్రి.. ఇక్కడి పథకాలు బాగున్నాయని కితాబిస్తున్నారని చెప్పారు. నడ్డా మాత్రం అందుకు విరుద్ధంగా విమర్శలు చేయడం సరికాదని, జుగుప్సాకరమైన రాజకీయాలు మానుకోవాలని సూచించారు. బుధవారం ఆయన ‘నమస్తే తెలంగాణ’తో ప్రత్యేకంగా మాట్లాడారు. ఆయన మాటల్లోనే.. తెలంగాణ అనతి కాలంలోనే దేశానికి దిక్సూచిగా నిలిచింది. ఎక్కడా లేని సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నది. వీటి సృష్టికర్త ముఖ్యమంత్రి కేసీఆర్. ఆయనను విమర్శించే ముందు.. ఈ పథకాలు బీజేపీ పాలిత రాష్ర్టాల్లో ఎక్కడైనా అమల వుతున్నాయో ప్రజలకు చెప్పాలి. రైతుబంధు, రైతుబీమా, మిషన్ భగీరథ, ఆసరా ఫించన్లు, కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ వంటి పథకాలు అమలు చేస్తున్నారా? చెప్పాలి. మూడేళ్లలో కాళేశ్వరం వంటి అద్భుతమైన ప్రాజెక్టులు నిర్మించిన చరిత్ర బీజేపీకి ఉన్నదా? చెప్పాలి. రైతు సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని కాళేశ్వరం ప్రాజెక్టును పూర్తి చేసి కోటి ఎకరాలకు సాగునీరు అందించేందుకు సీఎం కేసీఆర్ ముందుకెళ్తున్న తీరును, జరిగిన ప్రాజెక్టు పనులను యావత్ ప్రపంచం కీర్తిస్తున్నది. కానీ, ఈ పథకంలో అవినీతి జరిగిందని విమర్శలు చేయడం నడ్డా అవగాహన రాహిత్యానికి నిదర్శనం. సీఎం కేసీఆర్పై విమర్శలు చేసే ముందు రాష్ట్రంలో కొనసాగుతున్న అభివృద్ధిని గమనించాలి. నిరాధార ఆరోపణలు చేయడం కాదు.. సత్తా ఉంటే నిరూపించాలి. ఇక ముందు పిచ్చిపిచ్చిగా మాట్లాడితే.. జాతీయ అధ్యక్షుడు అని చూడాల్సిన అవసరం కూడా ఉండదు. ప్రజలే తగిన బుద్ధి చెబుతారు.