తెలంగాణ చౌక్, డిసెంబర్ 4: రాష్ట్రంలో రైతులు పండించిన ధాన్యాన్ని కేంద్ర ప్రభుత్వమే కొనుగోలు చేయాలని ప్రజాసంఘాల జేఏసీ చైర్మన్ గజ్జెల కాంతం డిమాండ్ చేశారు. దేశ వాప్తంగా రైతుల పట్ల కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిని నిరసనగా ఈనెల 18న చలో ఢిల్లీ కార్యక్రమం చేపడుతున్నట్లు తెలిపారు. నగరంలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో శనివారం నిర్వహించిన తెలంగాణ అంబేద్కర్ యువజన సంఘం ముఖ్యకార్యకర్తల సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. రాష్ర్టాల్లో పండిన ధాన్యాన్ని కేంద్ర ప్రభుత్వం ఎఫ్‌సీఐ ద్వారా కొనుగోలు చేయాలని రాజ్యాంగంలో ఉందన్నారు. కేంద్రంలో బీజేపీ అధికారం చేపట్టిన నాటి నుంచి దేశ ప్రజలు సంతోషంగా లేరన్నారు. ప్రతి సంవత్సరం కోటి ఉద్యోగాలు ఇస్తామని మ్యానిఫెస్టోలో ప్రకటించిన బీజేపీ అధికారంలోకి వచ్చి ఏడేళ్లయినా ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదన్నారు. ఎస్సీ, ఎస్టీలకు 8 లక్షలు, బీసీలకు 6 లక్షల ఉద్యోగాలు ఇవ్వాల్సి ఉందన్నారు. కేంద్ర ప్రభుత్వరంగ సంస్థలను ప్రైవేటీకరణ చేసి ఉన్న ఉద్యోగాలను తీసేయడమే కాకుండా, రిజర్వేషన్లను తొలగించేందుకు మోదీ, అమిత్‌షా కుట్ర చేస్తున్నారని విమర్శించారు. తెలంగాణ రాష్ట్ర రైతాంగం అభివృద్ధి చెందడాన్ని ఓర్వలేకే ధాన్యం కొనుగోలు చేయబోమని కేంద్రం ప్రకటనలు చేస్తున్నదన్నారు. తెలంగాణ ప్రభుత్వం రైతులకు అందిస్తున్న పథకాలు బీజేపీ పాలితరాష్ర్టాల్లో ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. దేశంలో రైతులు పండించిన పంటలను కొనుగోలు చేసేలా స్పష్టమైన విధానాన్ని తీసుకురావాలని డిమాండ్ చేశారు. నల్ల చట్టాలకు వ్యతిరేకంగా చేసిన పోరాటంలో ప్రాణాలు కోల్పోయిన ప్రతి రైతు కుటుంబానికి రూ.25 లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లించాలన్నారు. ఈనెల 18న తేదీన ఢిల్లీలో జంతర్‌మంతర్ వద్ద చేపట్టనున్న మహాధర్నాను విజయవంతం చేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ప్రజాసంఘాల జేఏసీ జిల్లా అధ్యక్షుడు పురుమళ్ల శ్రీనివాస్, జిల్లా అధ్యక్షుడు సముద్రాల అజయ్, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ క్యాదశి ప్రభాకర్ నాయకులు గజ్జెల ఆనంద్, కొండ్ర సంపత్, ఎస్కే సుల్తాన్, నగర అధ్యక్షుడు ప్రభు పాల్గొన్నారు.