కార్పొరేషన్, డిసెంబర్ 4: రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్, మేయర్ వై సునీల్‌రావు, మున్సిపల్ పాలకవర్గంపై విమర్శలు చేస్తే చూస్తూ ఊరుకోమని టీఆర్ఎస్వీ జిల్లా కో-ఆర్డినేటర్ పొన్నం అనిల్‌కుమార్‌గౌడ్ మాజీ డిప్యూటీ మేయర్ గుగ్గిల్ల రమేశ్‌ను హెచ్చరించారు. స్థానిక ఎస్బీఎస్ ఫంక్షన్ హాల్లో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మంత్రి గంగుల కమలాకర్ గత మున్సిపల్ పాలకవర్గంలో డిప్యూటీ మేయర్ పదవి ఇస్తే తన స్వార్థం కోసం దందాలు, అక్రమాలకు పాల్పడిన విషయం ప్రజలందరికీ తెలుసన్నారు. మంత్రికి దగ్గరగా ఉండి అన్ని విధాలా సహాయం పొంది ఇప్పుడు ఆయనపైనే విమర్శలు చేయడం సరికాదని ధ్వజమెత్తారు. టీఆర్ఎస్పై విమర్శలు చేస్తే భౌతికదాడులు చేసేందుకూ వెనుకాడే ప్రసక్తే లేదని హెచ్చరించారు. ‘పదవులు రాలేదని నీవు పార్టీ మారావని, కాని ఇప్పటి వరకు మీ భార్యతో ఎందుకు పార్టీకి రాజీనామా చేయించలేదని’ నిలదీశారు. ‘నీకు దమ్ముంటే మీ భార్యతో కార్పొరేటర్ పదవికి రాజీనామా చేయించి, మళ్లీ గెలువాలని’ సవాల్ విసిరారు. మేయర్ వై సునీల్‌రావు ఆధ్వర్యంలో నగరంలో రూ. వంద కోట్లతో అన్ని డివిజన్లలో అభివృద్ధి పనులు సాగుతున్నాయని గుర్తు చేశారు. మీ డివిజన్లోని అశోక్‌నగర్‌లో ప్రధాన మురుగు కాలువ సమస్య ఉంటే మంత్రి గంగుల, మేయర్ వై సునీల్‌రావు ఆధ్వర్యంలో రూ. కోటి నిధులు కేటాయించి అభివృద్ధి చేసింది కనిపించడం లేదా? అని నిలదీశారు. నగరంలో పార్టీలతో సంబంధం లేకుండా అన్ని డివిజన్లలో అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు పేర్కొన్నారు. ఈ విషయం బీజేపీ కార్పొరేటర్లు సైతం అంగీకరిస్తున్నారని తెలిపారు. ఇప్పటికైనా ఆరోపణలు మానుకోవాలని హితవు పలికారు. మున్సిపల్ కో-ఆప్షన్ సభ్యురాలు నందెల్లి రమ, జీకే యూత్ అధ్యక్షుడు మొగిలోజు వెంకట్, ప్రధాన కార్యదర్శి పొన్నం రాజు, పూసాల శ్రీకాంత్, బట్టు వరప్రసాద్, ఆరె రవిగౌడ్, మీర్ షౌకత్ అలీ, పబ్బతి శ్రీనివాస్‌రెడ్డి, నవాజ్ హుస్సేన్, ఆనంద్, చుక శ్రీనివాస్, వడ్లకొండ పరశురాం, అజయ్, సాయికృష్ణ, జెళ్లోజి శ్రీనివాస్, అజిత్‌రావు, రవినాయక్, వినోద్, ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.