రైతుబీమా మాదిరిగానే నేతన్నలకూ బీమా
మరమగ్గాల ఆధునీకరణ, కార్మికుల జీవన ప్రమాణాలకు ప్రత్యేక ప్రణాళికలు
మూలవాగు, మానేరు వాగుపై మరో 12 చెక్‌డ్యాంల మంజూరు
పద్మశాలీ భవన్ నిర్మాణానికి 5 కోట్లు
lమరో విడుతలో జిల్లాకు మెడికల్ కళాశాల
జేఎన్టీయూ ఇంజినీరింగ్ కళాశాల ఏర్పాటుకు ఆదేశాలు
అప్పర్ మానేరు ఆధునీకరణకు 50 కోట్లు మంజూరు
సిరిసిల్ల మార్కెట్ యార్డు వరకు డబుల్ రోడ్డుకు అనుమతి
నర్సింగ్ కళాశాలకు ప్రత్యేక గుర్తింపు..విద్యార్థులకు ైస్టెఫండ్ పెంపు
మానేరు వెంట పర్యాటక కేంద్రం ఏర్పాటుకు ఆదేశం
అతి త్వరలోనే కాళేశ్వరం ప్యాకేజీ 9 పూర్తికి చర్యలు.. తద్వారా మూడు లక్షల ఆయకట్టు
రాజన్న ఆలయ అభివృద్ధికి మరిన్ని చర్యలు
కరీంనగర్, జూలై 4 (కరీంనగర్ ప్రతినిధి/రాజన్న సిరిసిల్ల):కార్మిక, ధార్మిక క్షేత్రం రాజన్న సిరిసిల్ల జిల్లాపై ముఖ్యమంత్రి కేసీఆర్ వరాల జల్లు కురిపించారు. ఆదివారం జిల్లాలో డబుల్ బెడ్రూం ఇండ్లు, ఐడీటీఆర్, నర్సింగ్ కాలేజీ, మార్కెట్‌యార్డు, సమీకృత కలెక్టరేట్‌కు ప్రారంభోత్సవం చేసిన ఆయన, కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. మంత్రి కేటీఆర్ అడిగిన ప్రతిపాదనలే కాకుండా అదనంగా పలు హమీలు ఇచ్చారు. ఇదే సమయంలో ఈ గడ్డపై నుంచి కొత్తగా పలు పథకాలు ప్రకటించారు. ముఖ్యంగా రైతుబీమా మాదిరిగానే నేతన్నలకు బీమా సౌకర్యం, మానేరు, మూలవాగులపై కొత్తగా మరో 12 చెక్‌డ్యాంలకు అనుమతి, జేఎన్టీయూ ఇంజినీరింగ్ కళాశాల ఏర్పాటు, రెండో విడుతలో మెడికల్ కళాశాల, అప్పర్‌మానేరు ఆధునీకరణ, సిరిసిల్లలో మార్కెట్ యార్డు వరకు డబుల్ రోడ్డు మంజూరు వంటి కీలకమైన హామీలు ఇచ్చారు. వీటితోపాటు రాజన్న ధార్మిక క్షేత్ర విశిష్టతను పెంచడానికి అన్ని రకాల చర్యలు తీసుకుంటామని చెప్పిన ముఖ్యమంత్రి, ఆనాడు ఉద్యమ కాలంలో రాజన్న పేరుతో ‘రాజనో.. రాజన’ అంటూ పాట పాడి అందరినీ అకట్టుకున్నారు.
రాజన్న సిరిసిల్ల జిల్లాపై సీఎం కేసీఆర్ కీలక వరాలు ప్రకటించారు. పలు అభివృద్ధి పనులను ప్రారంభించేందుకు వచ్చిన ఆయన, నూతన కలెక్టరేట్ కేంద్రంగా కార్మిక, ధార్మిక క్షేత్రాలకు అనేక హామీలు ఇచ్చారు. గంట పాటు సాగిన ఆయన ప్రసంగంలో అనేక విషయాలు ప్రస్తావించారు. ఇంకా ఏమన్నారంటే..
శిరస్సు వంచి నమస్కరిస్తున్నా..
“రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రజలు, ప్రజాప్రతినిధులకు హృదయ పూర్వక అభినందనలు తెలియజేస్తున్న.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సిరిసిల్లలో జిల్లా పాలనకు సంబంధించిన ఇంత అద్భుతమైన ముఖ్యకార్యాలయం కలెక్టరేట్ ఏర్పాటు చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఈ నేపథ్యంలో జిల్లా ప్రజలందరికీ హృదయ పూర్వక అభినందనలు తెలియజేస్తున్నా.. తెలంగాణ ఏర్పడక ముందు ఎన్నో రకాల వాద ప్రతివాదాలు జరిగాయి. మీకు ఏదీ చేతగాదు అనే దుర్మార్గపూరిత వాదన కూడా విన్నం, ఖండించినం, బాధకూడా పడ్డాం. తెలంగాణ ముద్దు బిడ్డ.. రాష్ట్రంలో కడుతున్న కలెక్టరేట్లకు అన్నింటికీ మన నెత్తురు, తెలంగాణ బిడ్డ.. ఆర్కిటెక్ట్ ఉషారెడ్డి. ఇంత మంచి బిల్డింగ్ తెలంగాణ వాళ్లు కట్టగలరా? అనేదానికి సమాధానంగా కలెక్టరేట్లకు డిజైన్ చేసింది మన ఉషారెడ్డి అయితే, ఇంజినీరింగ్ ఇన్ చీఫ్ గణపతిరెడ్డి కట్టి చూపించారు. మంత్రి ప్రశాంత్‌రెడ్డి ముగ్గురు కూడా తెలంగాణ వాళ్లే. దటీజ్ ఆల్సో తెలంగాణ టాలెంట్..” అని మంత్రితో పాటు అధికారులపై సీఎం కేసీఆర్ ప్రశంసలు కురిపించారు. ‘కాంట్రాక్టర్లకు, ఏజెన్సీలకు శ్రమ చేసిన కూలీలకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నా..’ అని ముఖ్యమంత్రి అన్నారు.
నేతన్నలకు బీమా
ఉద్యమ కాలంలో సిరిసిల్లలో ప్రతి రోజూ నేతన్నల ఆత్మహత్యలు జరిగేవని, వాటిని శాశ్వతంగా దూరం చేసేందుకు తమ ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్నదని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. బతుకునివ్వాలన్న లక్ష్యంతో బతుకమ్మ చీరల ఆర్డర్ ఇస్తున్నామని, అంతేకాకుండా దేశంలో ఎక్కడా లేని విధంగా 50 శాతం సబ్సిడీపై నూలు రంగులు ఇస్తున్నామని చెప్పారు. కార్మికుల వేతనాలు పెరిగేందుకు కేటీఆర్ కూడా పలు చర్యలు తీసుకుంటున్నారని, అయితే ఇవి తాత్కాలిక రిలీఫ్‌ను మాత్రమే ఇస్తాయని, ఇంకా చేయాల్సి ఉందని తెలిపారు. కార్మికుల జీవన ప్రమాణాల పెంపునకు.. త్వరలోనే కార్పస్ ఫండ్ వంటివి ఏర్పాటు చేయడమేకాకుండా.. ఒక బృహత్తర ప్రణాళిక సిద్ధం చేస్తామని వెల్లడించారు. అంతేకాదు కార్మికుల కష్టాలను ఉద్యమకాలంలో స్వయంగా చూశానని, ఏదేని కారణాల వల్ల కుటుంబ పెద్ద చనిపోతే ఆ కుటుంబం అనాథ కావద్దన్నారు. అందుకే, కార్మికక్షేత్రం గడ్డపై ఒక విషయాన్ని సగర్వంగా ప్రకటిస్తున్నానని చెబుతూనే.. రైతుబీమా పథకం మాదిరిగానే నేతన్నలకు బీమా పథకాన్ని అమల్లోకి తెస్తామని స్పష్టం చేశారు. రైతుబీమా ద్వారా ఎలాగైతే పరిహారం అందుతుందో.. అదే మాదిరిగా ఈ పథకం రూపకల్పన ఉంటుందని చెప్పడంతో సభలో ఒక్కసారిగా చప్పట్లు మారుమోగాయి. అయితే, కొంత మంది రాజకీయ నాయకులు బతుకు కోసం ఇస్తున్న బతుకమ్మ చీరల ఆర్డర్లపై పిచ్చి కామెంట్లు చేస్తున్నారని, చీరల విషయంలోనూ నీచ రాజకీయాలు చేస్తున్నారని, ఈ తరహా విధానంలో మార్పులు రావాలని చెప్పారు. వీటితోపాటు పద్మశాలీ భవనానికి మంత్రి కేటీఆర్ ఐదెకరాల స్థలం కేటాయించడంతోపాటు ఈరోజు తన చేతుల మీదుగా శంకుస్థాపన చేయించారని, భవనాన్ని అన్ని వసతులతో నిర్మించేందుకు రూ.5 కోట్లు మంజూరు చేస్తున్నట్లుగా ప్రకటించడంతో మరోసారి.. చప్పట్లు మారుమోగాయి.
మరో 12 చెక్ డ్యాంలు మంజూరు
సభాధ్యక్షత వహించిన మంత్రి కేటీఆర్ ముందుగా మాట్లాడుతూ.. మూలవాగు, మానే రు వాగును సజీవ జల దృశ్యాలుగా మార్చేందుకు ముఖ్యమంత్రి చేస్తున్న కృషి అభినందనీయమని చెబుతూనే.. ఇప్పటికే ఈ రెండు వాగులపై 24 చెక్‌డ్యాంల నిర్మాణాలకు అనుమతి ఇచ్చారని, ఆ పనులు నడుస్తున్నాయని చెప్పారు. అయితే.. ఇటీవల అధికారులతో జరిపిన సమీక్షలో ఈ రెండు వాగులపై మరో 12 చెక్‌డ్యాంలు నిర్మించడం ద్వారా మరిన్ని ఫలితాలు ఉంటాయని తెలిపారని, అందుకే 12 చెక్ డ్యాంలను మంజూరు చేయాలని ముఖ్యమంత్రి ముందు ప్రతిపాదన పెట్టారు. ఆ మేరకు.. దీనిపై ముఖ్యమంత్రి స్పందిస్తూ.. ప్రతి నీటి బొట్టునూ ఒడిసి పట్టేందుకు ప్రయత్నాలు చేయాలని చెబుతూనే.. మంత్రి కేటీఆర్ అడిగినట్లు 12 చెక్‌డ్యాంలను వెంటనే మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు.
ఇంజినీరింగ్ కళాశాల ఏర్పాటు
జేఎన్టీయూ ఆధ్వర్యంలో రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఇంజినీరింగ్ కళాశాల ఏర్పాటుకు అనుమతి, అలాగే మెడికల్ కళాశాల ఇవ్వాలని మంత్రి కేటీఆర్ ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేశారు. ఆ మేరకు స్పందించిన ముఖ్యమంత్రి.. జేఎన్టీయూ ఆధ్వర్యంలో మెడికల్ కళాశాల ఏర్పాటుకు అనుమతి ఇస్తున్నట్లు ప్రకటించారు. అలాగే, రాజన్న సిరిసిల్ల జిల్లాకు మెడికల్ కళాశాల కూడా ఇస్తామని, అయి తే అది ఇప్పుడు కాదని రెండో విడుతలో తప్పకుండా ఇస్తామని హామీ ఇవ్వడంతో.. కరతాళ ధ్వ నులతో సభ మారుమోగింది. సిరిసిల్లలో నర్సింగ్ కళాశాలను అద్భుతంగా నిర్మించారని, ఈ కళాశాలను మోడల్‌గా తీర్చిదిద్దాలని ఆదేశించారు.
అప్పర్ మానేరుకు రూ.50 కోట్లు
అప్పర్ మానేరు ప్రాజెక్టు చరిత్రలో ఇప్పటి వరకు జూన్‌లో సాగుకోసం నీళ్లు ఇవ్వలేదని, అయితే కాళేశ్వరం నీళ్లు రావడంతో ఈసారి ఇస్తున్నామని మంత్రి కేటీఆర్ వివరించారు. ఇదే సమయంలో ఎగువమానేరు నిత్యం నీటితో కళకళలాడేలా ఉండేందుకు కాళేశ్వరం నుంచి, అలాగే మధ్యమానేరు నుంచి ఎగువమానేరు నీళ్లు నింపడానికి అన్ని పనులు జరుగుతున్న నేపథ్యంలో అప్పర్ మానేరు ప్రాజెక్టుతోపాటు కాలువలను ఆధునీకరించాలని, ఇందుకోసం ప్రత్యేకంగా నిధులు ఇవ్వాలని కోరారు. దీనిపై స్పందించిన ముఖ్యమంత్రి రూ.50 కోట్లు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. యుద్ధ ప్రాతిపదికన ఆధునీకరించేందుకు కావాల్సిన పనులు చేపట్టి.. ఆయకట్టు మొత్తానికి నీళ్లు ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అలాగే, సిరిసిల్ల పరిధిలో కొత్తగా నిర్మించిన మార్కెట్ యార్డు వరకు డబుల్‌రోడ్డు మంజూరు చేస్తున్నట్లు ప్రటించారు.
పర్యాటక కేంద్రం ఏర్పాటుకు ఆదేశాలు
కాళేశ్వరం జలాలతో ఎగుమానేరు నుంచి శ్రీ రాజరాజేశ్వర జలాశయం వరకు మానేరు జీవనదిలా ఉంటుందని, అలాగే అన్నపూర్ణ రిజర్వాయర్ అందాలను దృష్టిలో పెట్టుకొని.. ఈ ప్రాంతాన్ని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు అనుమతి ఇవ్వాలని మంత్రి కేటీఆర్ ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై స్పందిస్తూ.. ఇప్పటికే ఈ దిశగా చర్యలు తీసుకుంటున్నట్లుగా వివరించారు. రాజరాజేశ్వర జలాశయం పరిధిలో 243 ఎకరాల ప్రభుత్వ భూమి ఉన్నట్లు గుర్తించామన్నారు. అలాగే, అన్నపూర్ణ రిజర్వాయర్ పరిధిలో 240 ఎకరాలు ఉందని, అంతేకాకుండా అన్నపూర్ణ రిజర్వాయర్ మధ్యలో 40 ఎకరాల ఐలాండ్ ఉందని తెలిపారు. ఈ రెండు ప్రాంతాలను టూరిజం కేంద్రాలుగా మార్చేందుకు స్పెషల్ ఫండ్ మంజూరు చేస్తామని ప్రకటించారు. ఇందుకోసం అతి త్వరలోనే అన్నపూర్ణ రిజర్వాయర్ పరిధిలోకి రానున్నట్లు ముఖ్యమంత్రి తెలిపారు.
అదనంగా మూడు లక్షల ఎకరాలు
ఒకనాడు కరువు తప్ప గుక్కెడు నీళ్లు లేని రాజన్న సిరిసిల్ల ప్రాంతం ఈరోజు ఒక వాటర్ హబ్‌గా మారిందని, ఈ విషయం తాను చెప్పడమేకాదు.. జిల్లా ప్రజల ముందు సాక్షాత్కరిస్తుందని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. మిడ్‌మానేరు నుంచి లిఫ్ట్ చేసి మల్కపేట రిజర్వాయర్‌లో పోసి వేములవాడ, సిరిసిల్ల నియోజకవర్గాలకు నీళ్లు అందించడమే కాకుండా అక్కడి నుంచి చిన్న చిన్న లిఫ్ట్‌లు పెట్టుకుని ఎత్తయిన ప్రాంతాలకు అందిస్తూ చివరికి అప్పర్ మానేరును నింపే ప్రొవిజన్ అందులో పెట్టామని చెప్పారు. దీనికి రూ.130 కోట్లు మంజూరు చేశామని, ఆ పనులు ఎంత వరకు వచ్చాయో అధికారులతో రివ్యూ చేస్తానని తెలిపారు. రెండు నెలల్లో దీనిని పూర్తి చేస్తామని, తద్వారా సిరిసిల్ల, వేములవాడ నియోజకవర్గాల్లో మూడు లక్షల ఎకరాల ఆయకట్టు ఏర్పడుతుందని చెప్పారు. భూగర్భ జలాలు పెరగడమే కాకుండా అద్భుతమైన నీటి పారకం వస్తుందని, ఇదొక కాశ్మీర ఖండం అవుతుందని, ఇవన్నీ జరుగుతాయని స్పష్టం చేశారు.
రాజన్న క్షేత్ర అభివృద్ధిపై మరింత శ్రద్ధ
రాజన్న క్షేత్ర అభివృద్ధిపై మరింత దృష్టిపెడుతామని చెపుతూనే.. రాజన్న కేత్ర విశిష్టతను వివరించారు. ఇప్పటికే దాదాపు 37 ఎకరాల స్థలం తీసుకొని.. పనులు జరుగుతున్నాయని, అలాగే అథారిటీ ఏర్పాటు చేసుకొని పనులు చేస్తున్నామన్నారు. భవిష్యత్‌లో మరింత దృష్టి పెడుతామని చెప్పిన ముఖ్యమంత్రి, రాజన్న దేవాలయం అ త్యంత శక్తిమైంతమందని పేర్కొన్నారు. అందుకే తెలంగాణలో ఆ దేవుడి పేరుతో రాజయ్య అంటూ అనేక మందికి పేరు పెడుతారని చెప్పారు. అంతేకాదు.. తెలంగాణ ఉద్యమ సమయంలో.. రాజన్న ఓ రాజన్న’ అంటూ ఉన్న పాటను గుర్తుచేసిన తీరు అందరినీ ఆకట్టుకుంది.
చేసి చూపించాం
కొత్తగా ముఖ్యమంత్రి అయిన తదుపరి కరీంనగర్లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆనాటి ఉమ్మడి కరీంనగర్ జిల్లా నలువైపులా సజీవ జలధార అవుతుందని చెప్పానని గుర్తు చేశారు. ఆనాడు ఎవరికీ అర్థం కాలేదని, కానీ ఆనాడు తాను చెప్పిన మాటలు ప్రస్తుతం ప్రజల కళ్ల ముందు కనిపిస్తున్నాయని చెప్పారు. ఎగుమానేరు నుంచి మంథని వరకు మానేరు ఒక సజీవ జలధారగా మారిందని పేర్కొన్నారు. అలాగే వరదకాలువ, కాకతీయ కెనాల్ జలధారలుగా మారాయని, వీటితోపాటు 110 కిలోమీటర్ల పొడవు అంటే తుపాకులగూడెం నుంచి ఎల్లంపల్లి ప్రాజెక్టు వరకు గోదావరి సజీవజలధారగా మారిందని తెలిపారు. అకుంఠిత దీక్ష ఉంటే తప్ప ఇది సాధ్యం కాదని ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పారు.