నేడు వెలుగుల వేడుక
పటాకుల మోతకు తరుణం
వైభవంగా జరుపుకునేందుకు సిద్ధమైన జిల్లా ప్రజానీకం
రేపటి నుంచి కార్తీక మాసం ప్రారంభం
ఇంటింటా వెల్లివిరియనున్న ఆధ్యాత్మికత
భయానికీ, అజ్ఞానానికీ ప్రతీక ‘చీకటి’. నిర్భయ, విజ్ఞాన వీచిక ‘వెలుగు’. కష్టాల్లోనూ సుఖాలను కలగనాలనే సందేశాన్ని మోసుకుంటూ దీపావళి రానే వచ్చింది. నేటి ‘వెలుగుల’ వేడుకను అంగరంగ వైభవంగా జరుపుకునేందుకు జిల్లా ప్రజానీకం సిద్ధమైంది. దివ్వెల వెలుగులు, పటాకుల జిలుగులను చిన్నాపెద్దా తనివితీరా ఆస్వాదించే తరుణమాసన్నమైంది.
కమాన్చౌరస్తా, నవంబర్ 3: దీపావళి అంటే ‘దీపాల వరుస’ అని అర్థం. చీకటిని పారదోలే ఈ పండుగ, కష్టాల్లోనూ సుఖం కలగాలనే సందేశాన్ని మానవాళికి అందిస్తున్నది. హిందువుల ముఖ్యమైన పర్వదినాల్లో దీపావళి ఒకటి. దుష్టులను శిక్షించి, శిష్టులను రక్షించడానికి అవతరించిన శ్రీకష్టుడు ప్రజలను హింసించే నరకాసురుని సంహరించి ఆనంద దీపాలను వెలిగించిన రోజే దీపావళి పర్వదినమని ప్రజలు విశ్వసిస్తూ దీపావళి వేడుకలు జరుపుకుంటున్నారు. వ్యాపార సముదాయాల వద్ద లక్ష్మీదేవికి పూజలు నిర్వహించడం ఆనవాయితీ. చిన్నాపెద్దా తేడా లేకుండా ప్రతి ఒక్కరూ ఆనందోత్సాహాల నడుమ పండుగ జరుపుకుంటారు. చీకటి పడగానే మహిళలు దీపాలు వెలిగిస్తే బాలురు, యువకులు, పురుషులు పటాకులు కాల్చి ఆనందిస్తారు.
దివ్య దీపావళి..
నిజానికి దీపావళి రుతువులు మారే సమయంలో వస్తుంది. వర్షాలు వెనుకబడి, వ్యవసాయ పనులు ముగుస్తాయి. రైతులు పనిముట్లను శుభ్రం చేసి, మూలనపెడతారు. రాబోయే చలిని తట్టుకునేందుకు అంతా సిద్ధమవుతారు. బంధువులంతా ఒక చోటుకు చేరుతారు. కొత్తగా పెళ్లిళ్లు చేసిన కుటుంబాల్లో కూతురునీ, అల్లుడినీ ఆహ్వానిస్తారు. రకరకాల పిండివంటలతో సేదదీరుతారు. ‘నోము’లయ్యాక ఇంటి ముందు దీపాలు వెలిగించి ఆనందిస్తారు. పటాకులు పేల్చుతూ చిన్నాపెద్దా కేరింతలు కొడతారు.
లక్ష్మీపూజ..
దీపావళి రోజు సిరిసంపదలకు చిహ్నమైన లక్ష్మీదేవిని పూజిస్తారు. చీకట్లు అలుముకుంటుండగా, ప్రతి ఇంటా, దుకాణాల్లో లక్ష్మీగణపతి పూజ మొదలుపెడతారు. భోగభాగ్యాలను ప్రసాదించుమని వేడుకుంటారు. అటుపై పటాకలు కాల్చడం మొదలుపెడతారు. దీంతో అప్పటి వరకు అంధకారం అలుముకున్న ఆకాశంలో దివ్య కాంతులు పూస్తాయి. చూసే అందరి మనస్సులూ ఆనంద డోలికల్లో తేలియాడుతాయి.
‘పేలుతున్న’ధరలు
దీపావళి సందర్భంగా జిల్లా వ్యాప్తంగా వెలిసిన పటాకుల దుకాణాల్లో విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. జీఎస్టీ మూలంగా ఈ సారి పటాకుల ధరలు అధికమయ్యాయి. గతేడాది 250కే కిలో పటాకులు రాగా, ఈ సారి 350కి అమ్ముతున్నారు. ఉమ్మడి జిల్లాలో పటాకులను కిలోల లెక్కన అమ్ముతున్నారు. పిల్లలు, పెద్దలు కాల్చే పటాకులకు కంపెనీ బట్టి ధరలు నిర్ణయించారు. కాగా, ఎక్కువ ఫ్యాన్సీ ఐటమ్స్పైనే కొనుగోలుదారులు మక్కువ చూపుతున్నారు.
ఇదీ పురాణం..
నరకాసురుడనే రాక్షస రాజు అనేక మంది యువతుల్ని చెరబట్టి, చిత్రహింసలకు గురిచేసేవాడు. ప్రజలను హింసిస్తూ ఆనందించేవాడు. అతనికి ఎదురే లేకుండా పోవడంతో భక్తజన బాంధవుడు శ్రీకృష్ణుడు నరకాసుర సంహారానికి బయల్దేరుతాడు. ఆ రాక్షస సంహారానికి తానూ తోడుగా వస్తానంటుంది సత్యభామ. ఆమె స్వయంగా రాక్షస సంహారం చేస్తుంది. దీంతో నరకుడి పీడ వదిలిన ప్రజలు దీపాలు వెలిగించి పండుగ జరుపుకుంటారు. ఆనాటి నుంచి అది ఆనవాయితీగా వస్తున్నది.