ప్రజల నమ్మకాన్ని నిలుపుకొనేలా కరీం‘నగర’ అభివృద్ధి
మంత్రి గంగుల కమలాకర్
నగర పాలక సంస్థ కొనుగోలు చేసిన ఎక్స్కవేటర్ ప్రారంభం
కార్పొరేషన్, జనవరి 3: హైదరాబాద్ తర్వాత రాష్ట్రంలో రెండో పెద్ద నగరంగా కరీంనగర్‌ను తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ పేర్కొన్నారు. సోమవారం నగరపాలక సంస్థలో రూ.37లక్షలతో కొనుగోలు చేసిన ఎక్స్‌కవేటర్‌ను మేయర్ వై.సునీల్‌రావుతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకుండా అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. ఇచ్చిన మాట ప్రకారం మొదటి విజయంగా నగరంలో ప్రతి రోజూ తాగునీరు సరఫరా చేస్తున్నామని పేర్కొన్నారు. భవిష్యత్‌లో 24గంటలు సరఫరా చేసేందుకు చేపట్టిన పైలెట్ ప్రాజెక్ట్ కోసం టెండర్లు పిలిచామని తెలిపారు. పంచాయతీరాజ్ కింద రెండు స్వీపింగ్ యంత్రాలను తీసుకువచ్చి రోడ్లను పరిశుభ్రంగా ఉంచుతున్నామన్నారు. మరో రెండు యంత్రాలను త్వరలోనే అందుబాటులోకి తీసుకువస్తున్నామన్నారు. ఇప్పటివరకు రూ.8.60కోట్లను పారిశుధ్య నిర్వహణకు వినియోగించామని తెలిపారు. అలాగే రెండు వాటర్ జెట్టింగ్ యంత్రాలను కూడా తీసుకువచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. సుందర నగరంగా తీర్చిదిద్దాలన్న ఆలోచనతోనే తాము ముందుకు సాగుతున్నామని మంత్రి తెలిపారు.
స్మార్ట్‌సిటీ కంపెనీకి సంబంధించిన బోర్డు మీటింగ్ కూడా త్వరలోనే నిర్వహించుకొని పలు నిర్ణయాలు తీసుకుంటామన్నారు. ముఖ్యంగా నగరంలోని డంప్‌యార్డు సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేందుకు ఇప్పటికే టెండర్లు నిర్వహించామన్నారు. పూర్తిస్థాయిలో బయోమైనింగ్ చేయడం, ప్రతి రోజు 1.50 లక్షల మెట్రిక్ టన్నుల చెత్తను మైనింగ్ చేయడంతో పాటు ప్రతిరోజూ నగరం నుంచి వచ్చే చెత్తను కూడా క్లీనింగ్ చేపడుతున్నామన్నారు. దీంతో ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం దొరుకుతుందన్నారు. అలాగే రూ.130 కోట్లతో నగరంలో ప్రధానంగా వరదకాలువను కట్టేందుకు ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు. దీంతో లోతట్టు ప్రాంతాల్లోకి వర్షపు నీరు రాకుండా ఉండేందుకు అవకాశం ఉంటుందన్నారు. నగరపాలక సంస్థ అప్రమత్తంగా ఉండడంతోనే కరోనా సంక్షోభంలో డెత్ రేటును తగ్గించుకోగలిగామన్నారు. సఫాయిమిత్ర చాలెంజ్‌లో వచ్చిన రూ.4కోట్ల నగదు బహుమతి నిధులతో పాటు హెచ్డీఎఫ్సీ సంస్థ కూడా క్యాటింగ్ జెన్సీ నిధులు రూ.5 కోట్లు వ్యయం చేసేందుకు ముందుకు వచ్చిందని తెలిపారు. నగరంలో అభివృద్ధి చేసిన రోడ్లపై ఆక్రమణలను పూర్తిస్థాయిలో తొలగించనున్నట్లు పేర్కొన్నారు. ఫుట్‌పాత్ ఆక్రమణలను తొలగించి ప్రజలకు వినియోగంలోకి తీసుకువస్తామన్నారు. దీనికి ప్రజలు కూడా పూర్తిస్థాయిలో సహకరించాలని కోరారు. డిప్యూటీ మేయర్ చల్ల స్వరూపారాణి-హరిశంకర్, కమిషనర్ సేవా ఎస్లావత్, కార్పొరేటర్లు, నగరపాలక సంస్థ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
పనులను వేగంగా పూర్తి చేయాలి
నగరపాలక సంస్థ కార్యాలయంలో నూతనంగా చేపట్టిన సమావేశ మందిర నిర్మాణ పనులను వేగంగా పూర్తి చేయాలని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ ఆదేశించారు. చివరి దశకు చేరిన కౌన్సిల్ హాల్, డైనింగ్ హాల్ నిర్మాణ పనులను మంత్రి సోమవారం పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. అన్ని రకాల వసతులు, సౌకర్యాలను కల్పించి చకటి లైటింగ్ సిస్టమ్, ఇంటర్నల్ సౌండ్ సిస్టమ్ ఏర్పాటు చేయాలన్నారు. పాలకవర్గ సభ్యుల సంఖ్య ప్రకారం క్రమపద్ధతిలో సీటింగ్‌ను అమర్చాలన్నారు. ప్రతి సభ్యుడికి మైక్ సిస్టమ్‌ను అమర్చాలని, మహిళలు, పురుషులకు వేర్వేరుగా మరుగుదొడ్ల సౌకర్యం కూడా కల్పించాలని సూచించారు. ఆయన వెంట మేయర్ వై.సునీల్‌రావు, డిప్యూటీ మేయర్ చల్ల స్వరూపారాణి-హరిశంకర్, కమిషనర్ సేవా ఎస్లావత్, పాలకవర్గ సభ్యులు, అధికారులు పాల్గొన్నారు.