కార్పొరేషన్, జనవరి 3 ;నగరంలో రోడ్లు, ఫుట్‌పాత్ ఆక్రమణలతో ట్రాఫిక్‌కు తీవ్ర ఇబ్బందులు వస్తున్నాయి. ఇప్పటికే అధికారులు రోడ్డు ఆక్రమణలను తొలగించే కార్యక్రమాలు చేపట్టినా రెండు, మూడు రోజుల్లో మళ్లీ యథాస్థితికి చేరాయి. ఈ క్రమంలో నగరపాలక సంస్థ ఆక్రమణల తొలగింపుల్లో కఠినంగా వ్యవహరించాలని నిర్ణయించగా, నేటి నుంచి నిరంతరాయంగా ప్రత్యేక డ్రైవ్ చేపట్టనున్నది.
నగరంలోని ప్రధాన రహదారుల్లో ఫుట్‌పాత్ ఆక్రమణలను మంగళవారం నుంచి తొలగించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ రోడ్లల్లో ఫుట్‌పాత్ ఆక్రమణల తొలగింపునకు గతంలో మేయర్ వై.సునీల్‌రావు, నగరపాలక అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి, స్థానిక వ్యాపారులకు అవగాహన కల్పించినా ఫలితం లేకుండా పోయింది. కాగా, ఈ సారి మాత్రం మరింత కఠిన చర్యలు తీసుకునేందుకు అధికారులు సిద్ధమయ్యారు.
వెండింగ్ జోన్ల ఏర్పాటు
రోడ్లపై వీధి వ్యాపారాలు నిర్వహిస్తున్న వారి కోసం ప్రత్యేకంగా నగరానికి నలువైపులా వెండింగ్ జోన్ల ఏర్పాటు కోసం నగరపాలక సంస్థ ప్రణాళికలు సిద్ధం చేసింది. ఇప్పటికే బస్టాండ్ వెనుకలా, చైతన్యపురి, అంబేద్కర్ స్టేడియం వద్ద వెండింగ్ జోన్లను ఏర్పాటు చేశారు. అయితే వాటిని ప్రస్తుతం వినియోగించడం లేదు. ఈ సారి వీటిని వినియోగంలోకి తీసుకువచ్చేందుకు అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. వీటితో పాటు నగరానికి నలువైపులా వెండింగ్ జోన్లను ఏర్పాటు చేయనున్నారు. ఈ మేరకు మార్క్‌ఫెడ్ నుంచి వాటర్ రిజర్వాయర్ వరకు, ఎస్సారార్ కళాశాల నుంచి ఆర్టీసీ వర్క్‌షాపు వరకు, శాతవాహన యూనివర్సిటీ రోడ్డులో, ప్రభుత్వ దవాఖాన వెనుక వైపు, సప్తగిరికాలనీలో వెండింగ్ జోన్ల కోసం స్థలాలను గుర్తించారు. వీటితోపాటు మంచిర్యాల రోడ్డులో, పెద్దపల్లి రోడ్డులోనూ వెండింగ్ జోన్ల ఏర్పాటుకు స్థలాలను పరిశీలిస్తున్నారు. సప్తగిరికాలనీలో రూ.48 లక్షల వ్యయంతో జోన్‌ను ఏర్పాటు చేస్తున్నారు. ప్రస్తుతం టెలిఫోన్ క్వార్టర్స్ రోడ్డులో సాగుతున్న వ్యాపారాలను పూర్తిగా ఇక్కడికి తరలించనున్నారు. అలాగే మిగిలిన ప్రాంతాల్లో జోన్ల ఏర్పాటుకు అతి త్వరలోనే చర్యలు చేపట్టనున్నారు. వీటితో పాటు చైతన్యపురి మార్కెట్, శనివారం మార్కెట్ రైతుబజార్లో రోడ్లపై వ్యాపారాలు చేస్తున్న వారికి సైతం వెండింగ్ జోన్ కేటాయించాలని భావిస్తున్నారు. ఇకపై ఆయా వెండింగ్ జోన్స్లోనే వీధి వ్యాపారాలు జరిగేలా చర్యలు తీసుకుంటున్నారు.
ప్రత్యేక టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు
ఇటీవల మంత్రి గంగుల కమలాకర్ ఆధ్వర్యంలో మేయర్, పాలకవర్గ సభ్యులు అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఇందులో ఫుట్‌పాత్ ఆక్రమణల తొలగింపునకు ప్రత్యేకంగా టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేయడంతో పాటు ఈ విషయంలో స్థానిక ప్రజాప్రతినిధులు ఎవరూ జోక్యం చేసుకోవద్దని ఏకగ్రీవంగా తీర్మానం చేశారు. టాస్క్‌ఫోర్స్ చైర్మన్‌గా నగర మున్సిపల్ కమిషనర్ వ్యవహరిస్తుండగా, పోలీస్, తహసీల్దార్, ఆర్ అండ్ బీ, విద్యుత్, నగరపాలక సంస్థ టౌన్‌ప్లానింగ్, ఇంజినీరింగ్, పారిశుధ్య విభాగాలకు చెందిన అధికారులు సభ్యులుగా ఉన్నారు.