సిరిసిల్ల కలెక్టర్ అనురాగ్జయంతి
డాక్టర్లు, సిబ్బంది 24 గంటలు అందుబాటులో ఉండి సేవలందించాలి
వైద్యాధికారులతో ప్రత్యేక సమావేశం
కలెక్టరేట్, సెప్టెంబర్ 2: ప్రతి మనిషికి ప్రాణంతోపాటు జీవితం చాలా విలువైనదని రాజన్న సిరిసిల్ల కలెక్టర్ అనురాగ్జయంతి పేర్కొన్నారు. గురువారం సమీకృత కలెక్టరేట్లోని సమావేశ హాల్లో కొవిడ్-19పై డాక్టర్లు, వివిధ శాఖల జిల్లా అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లాలోని పీహెచ్సీ, సబ్సెంటర్లలో పని చేసే సిబ్బంది, అర్బన్ ఏరియాలో పని చేస్తున్న డాక్టర్లు, సిబ్బంది స్థానికంగా ఉంటూ 24 గంటలు రోగులకు రక్తపరీక్షలతోపాటు సరైన వైద్యం అందించాలని సూచించారు. ప్రతి విషయం తనకు వాట్సాప్ ద్వారా ఎప్పటికప్పుడు అందించాలని ఆదేశించారు. ప్రతి గ్రామం విజిట్ చేయాలని, కొవిడ్ నివారణకు ప్రత్యేక శ్రద్ధ చూపాలన్నారు. ఏఎన్ఎంలు గ్రామాల వారీగా సర్పంచ్, పంచాయతీ సెక్రటరీల ద్వారా గ్రామంలో దండోరా వేయించి ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. డీపీవో, మున్సిపల్ కమిషనర్, పంచాయతీ సెక్రటరీలు ముందు జాగ్రత్తగా ఉండాలని, గ్రామాల్లో దోమలు ప్రబలకుండా డ్రైనేజీలను ప్రతిరోజు శుభ్రం చేయించాలని, ఇమ్యూనైజేషన్ అధికారి బాధ్యత వహించి డాక్టర్లకు సూచనలు, సలహాలు అందించాలన్నారు. ప్రభుత్వ దవాఖాన్లలో కరోనా, డెంగీ పరీక్షలు చేయాలన్నారు. మలేరియాకు సంబంధించిన ర్యాపిడ్ సర్వే నిర్వహించాలని, దాని కోసం ప్రత్యేక ప్రణాళిక సిద్ధం చేయాలని సూచించారు.
సాధారణ ప్రసవాలు గాని, ఆపరేషన్లు గాని ప్రభుత్వ దవాఖాన్లలోనే జరిగేలా ఏఎన్ఎంలు, ఆశ కార్యకర్తలు అవగాహన కల్పించాలని తెలిపారు. పాఠశాలలను మినహాయించి ఖాళీగా ఉన్న భవనాల్లో కరోనా వ్యాక్సినేషన్ కేంద్రాలను ఏర్పాటు చేయాలని సూచించారు. బీపీ, షుగర్ ఉన్న వారికి ప్రత్యేక పరీక్షలు చేయాలని, క్యాన్సర్, బ్లడ్ క్యాన్సర్ గురించి ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. రోజూ గ్రామాల్లో డ్రైనేజీలు శుభ్రం చేసేలా చూడాలని, వానకాలం కావడంతో తాగునీటి విషయంలో జాగ్రత్తలు పాటించాలన్నారు. మెడికల్ ఆఫీసర్లు ప్రోగ్రాం ఆఫీసర్లకు ప్రతి శనివారం ప్రత్యేక సమావేశాలు నిర్వహించి అవగాహన కల్పించాలని సూచించారు. అదనపు కలెక్టర్ బి.సత్యప్రసాద్, డీపీవో రవీందర్, మున్సిపల్ కమిషనర్ సమ్మయ్య, వైద్యాధికారి సుమన్మోహన్రావు, టీబీ ప్రోగ్రాం ఆఫీసర్ రజిత, విజయ, రాజశేఖర్మోహన్, మల్లికార్జున్ పాల్గొన్నారు.