కరీంనగర్, నవంబర్ 1 (నమస్తే తెలంగాణ): హుజూరాబాద్ శాసనసభ నియోజకవర్గం ఉప ఎన్నికకు సంబంధించిన కౌంటింగ్ ప్రక్రియను కేంద్ర ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం సజావుగా, పకడ్బందీగా నిర్వహించాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి డాక్టర్ శశాంక్ గోయల్ ఆదేశించారు. హుజూరాబాద్ ఉప ఎన్నికకు సంబంధించి మంగళవారం నిర్వహించనున్న కౌంటింగ్ ప్రక్రియపై జిల్లా ఎన్నికల అధికారులతో సోమవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ శశాంక్ గోయల్ మాట్లాడుతూ, కౌంటింగ్ ప్రక్రియకు సంబంధించి పొరపాట్లకు తావులేకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. స్ట్రాంగ్ రూంల్లో భద్రపరిచిన ఈవీఎంలను భద్రంగా కౌంటింగ్ టేబుల్స్ వద్దకు తీసుకురావాలని సూచించారు. కౌంటింగ్ ప్రక్రియ ముగిశాక రాష్ట్ర ఎన్నికల సంఘానికి నివేదిక అందజేయాలని తెలిపారు. జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఆర్వీ కర్ణన్ మాట్లాడుతూ, కౌంటింగ్ ప్రక్రియకు సంబంధించి ఎస్సారార్ ప్రభుత్వ డిగ్రీ పీజీ కళాశాలలో చేసిన ఏర్పాట్ల గురించి వివరించారు. కేంద్ర ఎన్నికల సాధారణ పరిశీలకుల సమక్షంలో కౌంటింగ్ ప్రక్రియ నిర్వహిస్తామన్నారు. కొవిడ్ నిబంధనల మేరకు అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని తెలిపారు. పోలీస్ కమిషనర్ సత్యనారాయణ మాట్లాడుతూ, కేంద్ర ఎన్నికల సంఘం నిబంధనల మేరకు కౌంటింగ్ ప్రక్రియకు సంబంధించి పటిష్టమైన భద్రత ఏర్పాటు చేశామని తెలిపారు. వీడియో కాన్ఫరెన్స్‌లో అదనపు కలెక్టర్లు జీవీ శ్యాంప్రసాద్ లాల్, గరిమా అగర్వాల్, అసిస్టెంట్ కలెక్టర్ మయాంక్ మిట్టల్, హుజూరాబాద్ రిటర్నింగ్ ఆఫీసర్, ఆర్డీవో సీహెచ్ రవీందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఎన్నికల కౌంటింగ్ సిబ్బందికి శిక్షణ
కలెక్టరేట్ ఆడిటోరియంలో ఎన్నికల కౌంటింగ్ సిబ్బందికి సోమవారం శిక్షణ తరగతులు నిర్వహించారు. దీనికి కలెక్టర్ ఆర్వీ కర్ణన్, కేంద్ర ఎన్నికల సాధారణ పరిశీలకుడు ముత్తు కృష్ణన్ శంకర్ నారాయణ, హుజూరాబాద్ రిటర్నింగ్ అధికారి సీహెచ్ రవీందర్‌రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, కౌంటింగ్ ప్రక్రియకు సంబంధించి సిబ్బందికి పలు సూచనలు చేశారు. మైక్రో అబ్జర్వర్లు కౌంటింగ్ సిబ్బంది చేపట్టే లెకింపు ప్రక్రియను నిశితంగా పరిశీలించాలన్నారు. అభ్యర్థుల తరఫున కౌంటింగ్‌లో పాల్గొనే ఏజెంట్లతో మర్యాదపూర్వకంగా మెదలాలని తెలిపారు. కౌంటింగ్ సమయంలో సొంత నిర్ణయాలు తీసుకోవద్దని, ఏమైనా సందేహాలుంటే రిటర్నింగ్ అధికారికి తెలుపాలన్నారు. ఎన్నికల సాధారణ పరిశీలకుడు ముత్తు కృష్ణ శంకర్ నారాయణ మాట్లాడుతూ, కౌంటింగ్ ప్రక్రియను సజావుగా పకడ్బందీగా నిర్వహించాలని సూచించారు. అనంతరం రిటర్నింగ్ అధికారి సీహెచ్ రవీందర్‌రెడ్డి కౌంటింగ్ ప్రక్రియలోని పలు అంశాలపై కౌంటింగ్ సిబ్బందికి అవగాహన కల్పించారు. మాస్టర్ ట్రైనర్ రాజేందర్‌రెడ్డి కౌంటింగ్ ప్రక్రియలో చేపట్టవలసిన అంశాలపై సమగ్ర శిక్షణ ఇచ్చారు. కౌంటింగ్ ప్రక్రియలో పాల్గొనే కౌంటింగ్ సిబ్బందికి కొవిడ్ ర్యాపిడ్ పరీక్షలు నిర్వహించి సర్టిఫికెట్లు అందజేశారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు జీవీ శ్యాంప్రసాద్‌లాల్, గరిమా అగర్వాల్, ఎన్నికల నోడల్ అధికారులు వీ శ్రీధర్, బీ రవీందర్, ఎన్నికల అధికారులు పాల్గొన్నారు.