ఈవీఎంలను మార్చారంటూ బీజేపీ దుష్ప్రచారం
టీఆర్ఎస్ ప్రతిష్టను దెబ్బతీసే కుట్రలు
పార్టీ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్‌యాదవ్ గెలుపు ఖాయం
కరీంనగర్ మేయర్ వై.సునీల్‌రావు
కార్పొరేషన్, నవంబర్ 1: హుజూరాబాద్ ఉప ఎన్నికలో ఓటమి తప్పదని తెలిసే బీజేపీ నాయకులు సాకులు వెతుక్కుంటున్నారని కరీంనగర్ మేయర్ వై.సునీల్‌రావు ఎద్దేవా చేశారు. ఈవీఎంలను మార్చారంటూ అబద్ధపు ప్రచారానికి తెరలేపారని మండిపడ్డారు. సోమవారం నగరంలోని ఓ ఫంక్షన్హాల్లో విలేకరులతో మాట్లాడారు. డమ్మీ వీవీ ప్యాట్లను అధికారిక వాహనాల్లో తరలించడంపై అనవసర రాద్ధాంతం చేస్తున్నారని ఆక్షేపించారు. టీఆర్ఎస్కు అంటగడుతూ పార్టీ ప్రతిష్టను దెబ్బతీసే కుట్రలకు పాల్పడుతున్నారన్నారు. రాజకీయ లబ్ధి కోసమే ధర్నాలు, రాస్తారోకోల పేరిట నాటకాలాడుతున్నారని విమర్శించారు. హుజూరాబాద్ ఉప ఎన్నికలో టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్‌యాదవ్ గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. రాజ్యాంగబద్ధమైన ఎన్నికల సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన ఎన్నికల ప్రక్రియను బీజేపీ తప్పుదోవపట్టిస్తుందని నిప్పులు చెరిగారు. వారికి ఈవీంలకు, వీవీప్యాట్లకు తేడా తెలియకపోవడం విడ్డూరంగా ఉన్నదన్నారు. వారికి ఉన్న తప్పుడు ఫేస్బుక్, వాట్సాప్ యూనివర్సిటీల్లో తప్పుడు పోస్టులు పెడుతూ ప్రజల్లో గందరగోళం సృష్టిస్తున్నారని విమర్శించారు. ఓటమి భయంతోనే పోలింగ్ రోజున బీజేపీ నాయకులు టీఆర్ఎస్ నాయకులపై దాడులు చేశారన్నారు. స్థానికేతరులని ఆరోపిస్తూ టీఆర్ఎస్ కార్యకర్తలపై దౌర్జన్యం చేశారని దుయ్యబట్టారు. మరి స్థానికేతరులైన బీజేపీ నాయకులు తుల ఉమ, రాంగోపాల్ వీణవంక, ఇల్లందకుంట మండలాల్లో ఎలా పర్యటించారని ప్రశ్నించారు. తాము ఎవరినీ అడ్డుకోలేదన్నారు. సీఎం కేసీఆర్ సభ పెడితే ఓటమి తప్పదని గ్రహించే దొడ్డిదారిలో అడ్డుకున్నారని ధ్వజమెత్తారు. దళితబంధును ఆపాలని ఆ పార్టీ నేత ప్రేమేందర్‌రెడ్డి లేఖ రాశారని గుర్తుచేశారు. ఓటర్లను ప్రలోభపెట్టేందుకు ఒక్కొక్కరికీ రూ. 1500 పంపిణీ చేశారని ఆక్షేపించారు. టీఆర్ఎస్ నాయకులు బాధ్యతాయుతంగా వ్యవహరించి ఎన్నికల నిబంధనలకు అనుగుణంగా పని చేశామన్నారు. సమావేశంలో కార్పొరేటర్లు సరిళ్ల ప్రసాద్, వాల రమణారావు, చాడకొండ బుచ్చిరెడ్డి, గుగ్గిళ్ల జయశ్రీ, ఎదుర్ల రాజశేఖర్, నేతికుంట యాదయ్య, నాయకులు శ్రీనివాస్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు.