హుజూరాబాద్‌టౌన్, నవంబర్ 1: హుజూరాబాద్ నియోజకవర్గంలో టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్‌యాదవ్ గెలుపు ఖాయమని టీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు కొలిపాక శ్రీనివాస్ ధీమా వ్యక్తం చేశారు. సోమవారం పట్టణంలోని పార్టీ కార్యాలయ ఆవరణలో ఆయన విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలో సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న అనేక సంక్షేమ పథకాలతో ప్రజలు ఎంతో సౌకర్యంగా ఉన్నారని, అందుకే బై పోల్‌లో గతంలో కన్నా అత్యధికంగా ఓట్లు వేశారని తెలిపారు. ఎలాగైనా గెలువాలని బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు రూ.100 కోట్లకు పైగా ఖర్చుపెట్టిండని ఆరోపించారు. ప్రజలను తప్పుదారి పట్టించేలా తనకు అనుకూల సంస్థలతో సర్వేలు చేయించి తానే గెలుస్తున్నట్లు మీడియాలో దుష్ప్రచారం చేస్తున్నాడని విమర్శించారు. నాలుగు యూట్యూబ్ చానళ్లు, మూడు శాటిలైట్ చానళ్లు బీజేపీ కోసం సర్వశక్తులు ఒడ్డినా ఉపయోగం లేదని పేర్కొన్నారు. టీఆర్ఎస్ను గెలిపిస్తేనే నియోజకవర్గం అన్ని విధాలుగా అభివృద్ధి చెందుతుందని మంత్రులు హరీశ్‌రావు, గంగుల కమలాకర్, కొప్పుల ఈశ్వర్ చెప్పడంతో వారి మాటలను ఓటర్లు విశ్వసించి కారు గుర్తుకు ఓటు వేశారని తెలిపారు. మంచి మెజార్టీతో గెల్లు శ్రీనివాస్‌యాదవ్ గెలుస్తాడని చెప్పారు. టీఆర్ఎస్ మహిళా విభాగం అధ్యక్షురాలు, కౌన్సిలర్ కల్లెపల్లి రమాదేవి, కౌన్సిలర్లు మారపెల్లి సుశీల, ముక్క రమేశ్, నాయకులు సబ్బని రమేశ్, గందె సాయిచరణ్, గద్దల జయరాజ్ తదితరులు పాల్గొన్నారు.