ఎక్కడికక్కడ సభల నిర్వహణ
ఊరు, వాడ మెరిసేలా ప్రణాళికలు
ర్యాలీలతో ప్రజలకు అవగాహన
ఉత్సాహంగా హరితహారం
పల్లె మురిసేలా.. పట్టణం మెరిసేలా.. పచ్చదనం వెల్లివిరిసేలా
కరీంనగర్, జూలై 1 (నమస్తే తెలంగాణ);‘ప్రగతి’ పండుగ మొదలైంది. మంత్రులు, ఎమ్మెల్యేలు, స్థానిక ప్రజాప్రతినిధులు పల్లె, పట్టణ ప్రగతి, హరితహారం కార్యక్రమాలకు అంకురార్పణ చేయగా, ఊరూరా అభివృద్ధికి అడుగుపడింది. ఓవైపు గ్రామాలు, పట్టణాల్లో సభలు నిర్వహించి ప్రణాళికలు సిద్ధం చేయగా, మరోవైపు ప్రజలకు అవగాహన కలిగేలా తీసిన ర్యాలీలతో సందడి కనిపించింది. మంత్రి గంగుల కమలాకర్ కరీంనగర్‌లోని 18వ డివిజన్, హుజూరాబాద్‌లోని 13వ వార్డులో పట్టణ ప్రగతిలో పాల్గొన్నారు. చొప్పదండి మండలం కాట్నపల్లి, గన్నేరువరం మండల కేంద్రంలో జరిగిన పల్లె ప్రగతి, హరితహారం కార్యక్రమాలుకు ఎమ్మెల్యేలు సుంకె రవిశంకర్, రసమయి బాలకిషన్ హాజరయ్యారు.
గ్రామాలు, పట్టణాల సమగ్రాభివృద్ధే లక్ష్యంగా మరోదఫా చేపట్టిన పల్లె..పట్టణ ప్రగతి, హరితహారం కార్యక్రమాలు గురువారం అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, పంచాయతీల్లో సభలు నిర్వహించి, ప్రణాళికలు రూపొందించారు. మంత్రి కేటీఆర్ రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం రాజుపేట, దేశాయిపేట, జగదాంబతండా, సముద్రలింగాపూర్ గ్రామాల్లో పల్లె ప్రగతి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినిపల్లి వినోద్‌కుమార్ కోనరావుపేట మండలంలోని కొలనూర్‌లో ముందుగా మొక్కలు నాటారు. అనంతరం పల్లెప్రగతిని ప్రారంభించారు.
వేములవాడ పురపాలక సంఘం 11వవార్డు దానిమ్మతోటలో మొక్కలు నాటారు. జగిత్యాల మున్సిపాలిటీలోని 11వ వార్డు గాంధీనగర్ నిర్వహించిన పట్టణ ప్రగతిలో ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్‌కుమార్‌తో కలిసి పాల్గొన్నారు. అనంతరం మొక్కలు నాటారు. గొల్లపల్లి మండలం దమ్మన్నపేటలో పల్లె ప్రగతి కార్యక్రమాన్ని ప్రారంభించారు. రాష్ట్ర బీసీ సంక్షేమం, పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ కరీంనగర్ నగరపాలక సంస్థ పరిధిలోని 18వ డివిజన్, హుజూరాబాద్ పురపాలక సంఘం పరిధిలోని 13వ వార్డులో నిర్వహించిన పట్టణ ప్రగతిలో పాల్గొన్నారు. మెట్పల్లి మున్సిపల్ పరిధిలోని 11, 12 వార్డుల్లో జరిగిన పట్టణప్రగతి కార్యక్రమంలో ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు పాల్గొన్నారు.
కోరుట్ల పట్టణ శివారు రశ్మీధర్ తేజ డీఎడ్ కళాశాల సమీపంలో జాతీయ రహదారి పక్కన మొక్కలు నాటి హరితహారం కార్యక్రమాన్ని ప్రారంభించారు. చొప్పదండి మండలం కాట్నపల్లిలో జరిగిన పల్లె ప్రగతిలో ఎమ్మెల్యే సుంకె రవిశంకర్, గన్నేరువరం మండల కేంద్రం, రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం రహీంఖాన్‌పేటలో పల్లెప్రగతి, హరితహారం కార్యక్రమాల్లో ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ మాట్లాడారు. పెద్దపల్లిలోని 10 వ వార్డులో పట్టణ ప్రగతి, కాల్వశ్రీరాంపూర్ మండలం కిష్టంపేట, చిన్నరాత్‌పల్లి, మాదాసుపల్లి గ్రామాల్లో, సుల్తానాబాద్ మండలం చిన్నకల్వలలో పల్లె ప్రగతి కార్యక్రమాలను ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి ప్రారంభించారు. రామగుండం 42వ డివిజిన్లో పట్టణ ప్రగతి, అంతర్గాం మండలం ఎల్లంపల్లిలో పల్లెప్రగతి కార్యక్రమాన్ని ఎమ్మెల్యే కోరుకంటి చందర్ లాంఛనంగా ప్రారంభించి మొక్కలు నాటారు.