నగరంలో 16 బృందాల ఏర్పాటు
మొదటి సారి హెచ్చరికలతో సరి
వారం రోజుల్లో క్లీనింగ్‌కు చర్యలు
పరిశీలించిన అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్
కార్పొరేషన్, ఫిబ్రవరి 1: కరీంనగర్లో 14 కిలోమీటర్ల ప్రధాన రహదారులతో పాటు నిత్యం రద్దీగా ఉండే ఇతర రహదారుల్లో రోడ్డు, ఫుట్‌పాత్‌ల ఆక్రమణల తొలగింపు కార్యక్రమం మంగళవారం నుంచి మొదలైంది. రాష్ట్ర మంత్రి గంగుల కమలాకర్ ఆదేశాలతో అధికారులు కొరడా ఝళిపిస్తున్నారు. వారం రోజుల్లో నగరంలోని అన్ని ప్రధాన రహదారుల్లో ఎక్కడా ఫుట్‌పాత్ ఆక్రమణలు ఉండకుండా చూడాలన్న మంత్రి ఆదేశాల మేరకు అధికారులు పకడ్బందీ చర్యలు చేపడుతున్నారు. ఈ రోడ్లల్లో ఎక్కడా కూడా రోడ్డు, ఫుట్‌పాత్‌లను ఆక్రమించి విక్రయాలు సాగిస్తుంటే తొలగిస్తున్నారు. జిల్లా అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్ క్షేత్రస్థాయిలో పర్యటించి, పరిశీలించారు. నగరంలోని ప్రధాన రహదారుల్లో ఫుట్‌పాత్ ఆక్రమణల తొలగింపు కోసం ప్రత్యేకంగా నగరపాలక సంస్థ, పోలీస్, రెవెన్యూ అధికారులతో 16 బృందాలను ఏర్పాటు చేశారు. ఈ వారం రోజులు ఉదయం, సాయంత్రం ఆక్రమణల తొలగింపుపై ప్రత్యేక చర్యలు తీసుకోనున్నారు. వీరికి తోడు నగరపాలక సంస్థ డీఆర్ఎఫ్ సిబ్బంది, ప్రతి బృందానికి ఒక ట్రాక్టర్‌ను సామగ్రి తరలించేందుకు కేటాయించారు. అలాగే, ఫుట్‌పాత్‌లపై విక్రయాలు సాగిస్తున్న వారిని బల్దియా ఏర్పాటు చేసిన వెండింగ్ జోన్లకు తరలించేందుకు చర్యలు తీసుకుంటున్నారు.
ఏరియా వారీగా బృందాల ఏర్పాటు
నగరంలోని ప్రధాన రహదారుల్లో ఫుట్‌పాత్, రోడ్డు ఆక్రమణల తొలగింపు కోసం జిల్లా అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. నగరంలోని రహదారులను చౌరస్తాల వారీగా 16 సెంటర్లుగా విభజంచి రెవెన్యూ, పోలీస్, నగరపాలక సంస్థ అధికారులతో బృందం ఏర్పాటు చేశారు. ఎన్టీఆర్ చౌరస్తా నుంచి కమాన్ వరకు కేంద్రంగా ఏర్పాటు చేసి ఒక బృందానికి, కమాన్ నుంచి వన్ టౌన్ వరకు ఒక బృందానికి బాధ్యతలు అప్పగించారు. వన్ టౌన్ నుంచి తెలంగాణ చౌక్ వరకు ఒక బృందానికి, తెలంగాణ చౌక్ నుంచి మార్కెఫెడ్ వరకు ఓ బృందానికి, తెలంగాణచౌక్ నుంచి ఐబీ చౌరస్తా వరకు ఓ బృందానికి, కోర్టు చౌరస్తా నుంచి ఆర్టీసీ వర్క్‌షాప్ వరకు ఓ బృందానికి, ఐబీ చౌరస్తా నుంచి కోర్టు చౌరస్తా వరకు ఓ బృందానికి, కోర్టు చౌరస్తా నుంచి మంచిర్యాల చౌరస్తా వరకు ఓ బృందానికి, మంచిర్యాల చౌరస్తా నుంచి అపోలో దవాఖాన వరకు ఓ బృందానికి, మంచిర్యాల చౌరస్తా నుంచి నాకా చౌరస్తా వరకు ఓ బృందానికి, నాకా చౌరస్తా నుంచి బొమ్మకల్ చౌరస్తా వరకు ఓ బృందానికి, అటవీ శాఖ చౌరస్తా నుంచి ఐబీ చౌరస్తా వరకు ఓ బృందానికి, వన్ టౌన్ నుంచి వేంకటేశ్వర ఆలయం వరకు ఓ బృందానికి, ప్రతిమ మల్టిప్లెక్స్ నుంచి కలెక్టరేట్ రోడ్డు వరకు ఓ బృందానికి, అంబేద్కర్ స్టేడియం చుట్టూ ఆక్రమణలను తొలగించే బాధ్యతలు ఓ బృందానికి అప్పగించారు. అలాగే, ఈ రోడ్లపై విక్రయాలు జరుపుతున్న వ్యాపారులను ఆయా ప్రాంతాల్లో నగరపాలక సంస్థ ఏర్పాటు చేసిన వెండింగ్ జోన్లకు తరలించే విధంగా చర్యలు తీసుకుంటున్నారు. ఇందులో ఎన్టీఆర్ చౌక్, కమాన్ చౌరస్తా, నాకా చౌరస్తా ప్రాంతం వారిని హౌసింగ్‌బోర్డు కాలనీలోని మార్కెట్‌కు, వన్‌టౌన్ రోడ్డు, తెలంగాణ చౌక్, ఐబీ చౌరస్తా వరకు వ్యాపారాలు చేస్తున్న వారిని బస్టాండ్ వెనుక ఉన్న జోన్‌కి, మంకమ్మతోట, రాంనగర్ రోడ్డులోని వారిని రాంనగర్ మార్కెట్‌కు, మంచిర్యాల రోడ్డు, కోర్టు చౌరస్తా నుంచి ఐబీ చౌరస్తా వరకు వ్యాపారాలు చేస్తున్న వారిని ఇందిరానగర్ మార్కెట్‌కు తరలించే విధంగా చర్యలు తీసుకుంటున్నారు.
మళ్లీ ఏర్పాటు చేస్తే కఠిన చర్యలు
నగరంలో మంగళవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆయా బృందాల సభ్యులు తమకు కేటాయించిన కేంద్రాల్లో పర్యటించి రోడ్డు, ఫుట్‌పాత్‌లను ఆక్రమించి విక్రయాలు చేస్తున్న వారికి తొలగించాలని హెచ్చరికలు జారీ చేశారు. ఆక్రమణలను తొలగించి వెండింగ్ జోన్లలోకి వెళ్లాలని వీధి వ్యాపారులకు సూచిస్తున్నారు. ముఖ్యంగా ఉదయం, సాయంత్రం వేర్వేరుగా వ్యాపారాలు చేస్తున్న వారు ఉండడంతో అందుకు అనుగుణంగా సిబ్బంది కూడా ఆయా ప్రాంతాలకు వెళ్లి విక్రయాలను వెండింగ్ జోన్లలోనే చేపట్టాలని సూచిస్తున్నారు. రోడ్డు ఆక్రమించి నిర్మాణాలు చేస్తే తొలగిస్తున్నారు. అలాగే, ఫుట్‌పాత్‌లు, రోడ్డుపై ప్రచార బోర్డులను పెడితే వాటిని సీజ్ చేస్తున్నారు. మొదటిసారి హెచ్చరిస్తున్నామని, మరోసారి అక్కడే విక్రయాలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు చెబుతున్నారు. కలెక్టరేట్ ఏరియాలో చేపట్టిన ఆక్రమణల తొలగింపును అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్, మున్సిపల్ కమిషనర్ సేవ ఇస్లావత్ పరిశీలించారు. ఎక్కడా కూడా ఫుట్‌పాత్, రోడ్డు ఆక్రమణలు లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు.