ఉమ్మడి జిల్లాకు కేంద్రం మొండిచేయి
వేతన జీవులకు మళ్లీ నిరాశే
జాతీయ రహదారులు, రైల్వే లైన్లపై నో క్లారిటీ
పత్తాలేని పాత వాటి ప్రస్తావన
రైల్వే స్టేషన్ ఆధునీకరణకు కేటాయింపులు నిల్
మెగా పవర్‌లూం క్లస్టర్ మాటే లేదు
ఊసెత్తని ఉద్యోగాల ప్రస్తావన
కరీంనగర్, ఫిబ్రవరి 1(నమస్తే తెలంగాణ ప్రతినిధి) :కేంద్రం చేతిలో ‘బండి’ బోర్లపడ్డడు. నిత్యం బడాయి మాటలు చెప్పే ఎంపీ సంజయ్ హయాంలో ఉమ్మడి జిల్లాకు కేంద్రం ఉత్త చేతులే చూపెట్టింది. ఇది తెస్తా.. అది తెస్తా.. అంటూ గొప్పలు చెప్పుకుంటున్న ఆయనకు మొండిచేయి చూపింది. పాతవాటి గురించి ప్రస్తావించకపోగా.. ఉమ్మడి జిల్లా వాసులు పెట్టుకున్న ఆశలపై నీళ్లు చల్లింది. ఆదాయ పన్ను పరిమితి పెంచకుండా వేతన జీవులకు నిరాశ మిగిల్చింది.. పెండింగ్‌లో ఉన్న అనేక జాతీయ రహదారుల ఊసే మరిచింది. పాత, కొత్త రైల్వేల ప్రస్తావనే లేదు. మెగా పవర్‌లూం క్లస్టర్‌పై కనికరం చూపలేదు. దక్షిణ భారత దేశంలోనే అత్యధిక ఆదాయాన్ని ఇస్తున్న.. కరీంనగర్ రైల్వే స్టేషన్ ఆధునీకరణకు ఏమాత్రం నిధులు కేటాయించలేదు. పైగా ఎరువులు, రసాయనాలపై సబ్సిడీల్లో కోత పెట్టడంతో వాటి ధరలు పెరిగి రైతులపై భారం పడే ప్రమాదం పొంచి ఉన్నది. ఏ రంగానికీ ఉపయోగపడని బడ్జెట్ ఇది.. అని అన్నివర్గాల నుంచి విమర్శలు వెల్లువెత్తుతుండగా, కరీంనగర్ ఎంపీగా, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా కొనసాగుతున్న ‘బండి’ ఏమి సమాధానం చెపుతారన్న ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి.
కేంద్రం చేతిలో కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ బోర్లా పడ్డారు. మరోసారి ఉమ్మడి జిల్లాకే కాదు.. బండి సంజయ్‌కు కేంద్రం మొండి చేయి చూపింది. నిజానికి కరీంనగర్ ఎంపీగా, ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా కొనసాగుతున్న ఆయన సారథ్యంలో.. ఈసారి ఉమ్మడి జిల్లాకు భారీ ఎత్తున నిధులు వచ్చే అవకాశం ఉందని అందరూ ఆశించారు. అంతేకాదు.. ఇప్పటికే సూత్రప్రాయంగా అంగీకారం తెలిపిన జాతీయ రహదారులు, రైల్వే లైన్లు వస్తాయని భావించారు. కానీ.. ఈ బడ్జెట్లో ఉమ్మడి జిల్లాకు నిధులు, జాతీయ రహదారుల వంటి అంశాలను ఎక్కడా ప్రస్తావించిన దాఖలాలు లేవు. కరీంనగర్-కాజీపేట వయా హుజూరాబాద్ నూతన రైల్వే లైన్‌కు ప్రస్తుత ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌కుమార్ ఒక ప్రణాళికాబద్ధంగా కేంద్రాన్ని గతంలోనే ఒప్పించినా.. ఈ బడ్జెట్లో ఆ ప్రస్తావనే కనిపించలేదు. అలాగే, రామగుండం నుంచి మణుగూరు వయా మంథని భూపాల్పల్లి పరిధిలో 199 కిలోమీటర్ల మేర రైల్వే కోల్‌కారిడార్ ఏర్పాటుకు సుముఖత చూపిన కేంద్రం.. ఈసారైనా నిధులు కేటాయిస్తుందని భావించారు. ఇక జాతీయ రహదారుల ప్రస్తావనేలేదు. ట్రిపుల్ ఐటీ కేటాయించాలని స్వయంగా ముఖ్యమంత్రి లేఖ రాసినా నేటి బడ్జెట్లో ఆ ఊసే లేదు. మెగా పవర్‌లూం క్లస్టర్ మొరను ఏమాత్రం పట్టించుకోలేదు.
ఎంపీగా ఏమి చెపుతారు?
2022-23 కేంద్ర బడ్జెట్లో ఉమ్మడి జిల్లాకు ఒరిగిందేమైనా ఉందా? అనే ప్రశ్నలకు బీజేపీ నాయకులు ఏం సమాధానం చెబుతారన్న దానికి ఎవరికి వారే.. దేశ బడ్జెట్ గురించి చెపుతున్నారే.. తప్ప ఉమ్మడి జిల్లాకు ఇది వచ్చిందని చెప్పలేకపోతున్నారు. దేశానికి ఊతం ఇస్తుందని అంటున్నారే కానీ, సొంత గడ్డకు ఏం ఒనగూరిందో చెప్పలేని దుస్థితిలో ఉన్నారు. ఉమ్మడి జిల్లాలో జాతీయ రహదారుల జంక్షన్ చేయాలని గత ఎంపీ వినోద్‌కుమార్ కేంద్రాన్ని ఒప్పించి ఆరు జాతీయ రహదారులకు సూత్రప్రాయ అంగీకారం వచ్చేలా చర్యలు తీసుకుంటే.. వాటిని ముందుకు తీసుకెళ్లలేని దుస్థితిలో నేడు బీజేపీ నాయకులున్నారు. సాధారణంగా కేంద్ర బడ్జెట్ వచ్చిన తర్వాత నా పార్లమెంట్ స్థానంలో కేంద్రం నుంచి ఈ బడ్జెట్ తీసుకొచ్చామని ఎంపీలు చెప్పడం సాంప్రదాయంగా వస్తుంది. కానీ, బండి సంజయ్ మాత్రం తన నియోజకవర్గానికి తెచ్చింది ఏంటో మాత్రం చెప్పలేదు. అంతేకాదు.. బడ్జెట్‌కు ముందు మన జిల్లాకు ఏమైనా వచ్చే అవకాశం ఉందా? అని ‘నమస్తే తెలంగాణ’ ప్రశ్నించే ప్రయత్నం చేస్తే… ఆయన నుంచి సమాధానం కరువైంది. ఇప్పుడూ అదే పరిస్థితి నెలకొంది. మున్ముందు.. కేంద్ర బడ్జెట్‌పై ఆయన ఏం వాదిస్తారో చూడాలన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దేశ బడ్జెట్ గొప్ప అని చెప్పడం కాదని.. తన సొంత నియోకవర్గానికి ఏం తెచ్చారో చెప్పాలన్న డిమాండ్‌ను ఉమ్మడి జిల్లా వాసులు వినిపిస్తున్నారు. ఏ ప్రజాప్రతినిధి అయినా.. ఇంట గెలిచి రచ్చ గెలువాలని, కానీ.. బండి మాత్రం రెండు చోట్లా గెలువలేకపోతున్నారన్న విమర్శలు వస్తున్నాయి. ఎంతసేపూ టీఆర్ఎస్పై అర్థం లేని విమర్శలు చేయడమే తప్ప.. నియోజకవర్గ అభివృద్ధి కోసం.. ‘ఈ నిధులు తెచ్చా.. ఇలా అభివృద్ధి చేస్తా..’ అని ఏనాడూ చెప్పిన పాపాన పోలేదన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. దీనిపై బండి మౌనం వహిస్తారా..? లేక తన సొంత నియోజకవర్గానికి, రాష్ట్ర అధ్యక్షుడిగా రాష్ర్టానికి కేంద్రం నుంచి తెచ్చిన నిధుల గురించి ఏమైనా చెపుతారో? చూడాలన్న చర్చ జరుగుతోంది.
ఎనిమిదేళ్లుగా నిరాశే..
కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ప్రతిపక్ష పార్టీగా ఉన్నప్పుడు.. అలాగే, ఎన్నికల ప్రచారంలో తాము అధికారంలోకి వస్తే ఆదాయ పన్ను పరిమితిని రూ.5 లక్షలకు పెంచి తీరుతామని చెప్పిన మోడీ.. గత ఎనిమిదేళ్లుగా ఊరించడమే తప్ప పెంచడం లేదు. ఈ బడ్జెట్‌పై వేతన జీవులు చాలా ఆశలు పెట్టుకున్నారు. కరోనా పరిస్థితుల్లో ఆర్థిక వ్యవస్థ అతలాకుతలమైన నేపథ్యంలో.. ఆదాయ పన్ను పరిమితి పెంచుతారని ఆశించారు. కానీ, వారి ఆశలపై కేంద్రం నీళ్లు చల్లింది. ఈ ప్రస్తావనే లేకుండా బడ్జెట్‌ను ముగించింది. ఇవేకాదు.. ప్రస్తుతం ఉన్న రూ.1.50 లక్షల పొదుపు పరిమితినీ రూ.3 లక్షలకు పెంచాలని యావత్ దేశ ఉద్యోగుల నుంచి విజ్ఞప్తులు వెల్లువెత్తినా పెడచెవిన పెట్టింది. దీంతో ఉమ్మడి జిల్లాలో సుమారు యాభైవేల మంది ఉపాధ్యాయులు, ఉద్యోగులు, వేతన జీవులను నిరాశకు గురయ్యారు.
వ్యాపార వర్గాలకు నిరాశ
కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన బడ్జెట్ వ్యాపారరంగాలను పూర్తిగా నిరాశకు గురిచేసింది. వ్యక్తిగత ఆదాయ పన్ను పరిమితి పెంచుతుందని కోటి ఆశలతో ఎదురు చూసిన వ్యాపారవర్గాలపై నీళ్లు చల్లింది. స్టార్టప్ కంపెనీలకు ప్రోత్సాహకాలు ఇవ్వలేదు. దేశ వ్యాప్తంగా డిజిటల్ విద్య, ఆంగన్వాడీ కేంద్రాల అభివృద్ధి మంచిదే అయినా.. కేంద్రం అచరణలో పెడుతుందన్న నమ్మకం లేదు. మొత్తంగా చూస్తే.. ఈసారి బడ్జెట్ ఏ వర్గానికీ అనుకూలంగా లేదన్నది స్పష్టమవుతోంది. కరోనా నేపథ్యంలో వ్యాపార రంగాలకు ఎలాంటి ప్రోత్సాహకం ఇవ్వకపోవడం బాధారం.-చిట్టిమల్ల శ్రీనివాసు, ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రెసిడెంట్
అమానవీయంగా ఉన్నది
కేంద్ర బడ్జెట్ అమానవీయంగా ఉన్నది. దీనినిబట్టి పేదల సంక్షేమంపై కేంద్ర సర్కార్‌కు ఎంత చిత్తశుద్ధి ఉందో తెలుస్తున్నది. గత బడ్జెట్లో ప్రవేశపెట్టిన 72 అంశాల్లో 80 శాతం పెండింగ్‌లోనే ఉన్నాయి. కేంద్రం అబద్ధాల ప్రభుత్వమని.. మాటలే తప్ప చేతలు ఉండవని తేటతెల్లమవుతున్నది. అంకెల గారడీతో బురిడీ కొట్టించడమే తప్ప.. బడ్జెట్లో ఏమీ లేదు. పాతదానికి కొనసాగింపుగా మాత్రమే ఉన్నది. బీజేపీ రెండోసారి అధికారంలోకి వచ్చి కూడా జనరంజక బడ్జెట్ ప్రవేశ పెట్టకపోవడం బాధాకరం. వ్యవసాయరంగాన్ని పూర్తిగా నీరుగారుస్తున్నది. బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాలను పూర్తిగా విస్మరించింది.