రాజన్నసిరిసిల్ల జిల్లాలో గంజాయి దందాపై పోలీసుల ఉక్కుపాదం
వరుస దాడులతో అక్రమార్కుల్లో వణుకు
ఇప్పటి దాకా 50 మంది అరెస్ట్..26 కేసులు
నాలుగు బృందాలతో డేగకన్ను
సిరిసిల్ల/ సిరిసిల్ల రూరల్, అక్టోబర్ 31: రాజన్నసిరిసిల్ల జిల్లా పోలీసులు గంజాయిపై ఉక్కుపాదం మోపుతున్నారు..అడుగడుగునా గస్తీ కాస్తూ మత్తు దందాను అణచివేస్తు న్నారు. ప్రత్యేక టాస్క్‌ఫోర్స్ బృందాలను ఏర్పాటు చేసి పటిష్ట నిఘా పెడుతున్నారు. ఎక్సైజ్ సిబ్బందితో కలిసి వరుస దాడులు చేస్తూ అక్రమార్కుల్లో వణుకు పుట్టిస్తున్నారు. ఊరూరా ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి అవగాహన కల్పిస్తున్నారు.
రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత గుడుంబా, నాటుసారా నిర్మూలించిన ప్రభుత్వం ఇటీవల కాలంలో పెచ్చుమీరుతున్న గంజాయికి అడ్డుకట్ట వేసే దిశగా ముందుకెళ్తున్నది. రాజన్నసిరిసిల్ల జిల్లాలోని సిరిసిల్ల, తంగళ్లపల్లి, ఇల్లంతకుంట మండలాల్లో ఈ నిషేధిత పదార్థాన్ని విక్రయిస్తున్న ముఠా ఇటీవల పట్టుబడడం కలకలం రేపింది. ఈ నేపథ్యంలో పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది. ఎక్సైజ్ అధికారులతో కలిసి అక్రమార్కుల ఆటకట్టించాలని నిర్ణయించింది. ఇందుకు నాలుగు ప్రత్యేక బృందాలను నియమించింది. అన్ని ఠాణాల పరిధిలోని అనుమానితులతో పాటు గతంలో పట్టుబడిన వారిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. అడ్డదారిలో వెళ్తున్న యువకుల తల్లిదండ్రులను పిలిపించి కౌన్సెలింగ్ చేస్తున్నారు. అలాగే ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి అవగాహన కల్పిస్తున్నారు.
యువతపై తీవ్ర ప్రభావం..
గంజాయి ప్రభావం యువతపై తీవ్రంగా పడుతున్నది. కొందరు ముఠాలుగా ఏర్పడి ఈ మత్తు పదార్థాన్ని ఇక్కడికి తెచ్చి విక్రయిస్తున్నట్లు తెలుస్తున్నది. ముఖ్యంగా టీనేజీ యువకులను ఈ ఊబిలోకి దించుతున్నారు. దీనికి అలవాటు పడిన వారు అనేక దుర్ఘటనలకు కారణమవుతున్నారు. రోడ్డు ప్రమాదాలకు కారకులవుతున్నారు. లైంగిక దాడులు, దొంగతనాలు లాంటి నేరాలకు పాల్పడుతున్నారు. కొందరు మైనర్లు సైతం ఈ ఉచ్చులో చిక్కుకోవడం ఆందోళన కలిగిస్తున్నది. జిల్లా ఏర్పడ్డ తర్వాత 50 మందిని పట్టుకొని బాధ్యులపై 26 కేసులు నమోదు చేశారు.
పలువురి అరెస్ట్..భారీగా గంజాయి స్వాధీనం
సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని వంశీకృష్ణకాలనీ శివారులో ఇటీవల గంజాయి సరఫరా చేస్తున్న ఒకరిని పట్టుకొని, 150 గ్రాముల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన వ్యక్తి డిచ్‌పల్లిలో ఓ మహిళ నుంచి తీసుకువచ్చి ఇక్కడ సరఫరా చేస్తున్నట్లు ఒప్పుకోగా ఈ కేసులో సదరు మహిళతోపాటు మరో ఇద్దరిని రిమాండ్‌కు తరలించారు.
తంగళ్లపల్లిలో హుక్కా తాగుతూ నలుగురు యువకులు పట్టుబడ్డారు. వీరిని రిమాండ్‌కు తరలించి, మరికొంతమందిపై విచారణ కొనసాగుతున్నది. తంగళ్లపల్లి మండలంలోని పలు గ్రామాల్లోని మరో నలుగురు యువకులను అదుపులోకి తీసుకుని, కేసు నమోదు చేశారు.
ఇల్లంతకుంట మండలంలో నలుగురు యువకులు గంజాయి తాగుతూ పట్టుబడ్డారు. వీరిలో ఒకరు మైనర్ కూడా ఉన్నాడు.
పటిష్టమైన నిఘా..
జిల్లాలో గంజాయి దందా ఆటకట్టించేందుకు పటిష్టమైన నిఘా పెట్టాం. జిల్లా సరిహద్దు ప్రాంతాలపై దృష్టిపెట్టాం. కొందరు ముఠాలుగా ఏర్పడి గంజాయిని ఇతర ప్రాంతాల నుంచి తీసుకువచ్చి ఇక్కడ విక్రయిస్తున్నట్లు సమాచారం ఉన్నది. తల్లిదండ్రులు సైతం అప్రమత్తంగా ఉండాలి. తమ పిల్లల ప్రవర్తనను ఎప్పటికప్పుడూ గమనించాలి. ఎవరైనా ఈ అక్రమ వ్యవహారాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిస్తే పోలీసులకు సమాచారం అందించాలి. తెలియజేసినవారి వివరాలు గోప్యంగా ఉంచుతాం.
-రాహుల్ హెగ్డే, ఎస్పీ ,రాజన్న సిరిసిల్ల జిల్లా
9440902704కు ఫోన్ చేయండి..
సర్కారు ఆదేశాల మేరకు గంజాయి దందాపై ఉక్కుపాదం మోపుతున్నం. టాస్క్‌ఫోర్స్ బృందాలు ఏర్పాటు చేసి గస్తీ ముమ్మరం చేస్తున్నం. రాత్రివేళల్లో పటిష్టమైన నిఘా పెట్టినం. పట్టుబడ్డ వారిపై కేసులు నమోదు చేసి రిమాండ్‌కు పంపిస్తున్నం. ఈ అక్రమ కార్యకలాపాలు నియంత్రించేందుకు ప్రజలు సహకరించాలి. ఎవరైనా నిషేధిత పదార్థాలను అమ్ముతున్నట్లు గాని, వీటిని తీసుకుంటున్నట్లు తెలిస్తే 9440902704 నంబర్‌కు సమాచారం అందించాలి. తెలియజేసిన వారి వివరాలు బయటకు చెప్పం. – ఎంపీఆర్ చంద్రశేఖర్, ఎక్సైజ్ సీఐ
.