రాంనగర్, జనవరి 31: పేదలకు చేరాల్సిన రేషన్ బియ్యాన్ని తక్కువ ధరకు సేకరించి ఇతర రాష్ర్టాలకు అక్రమంగా రవాణా చేసే ఇద్దరు నిందితులపై పీడీయాక్టు అమలు చేస్తూ కరీంనగర్ సీపీ సత్యనారాయణ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇల్లందకుంట మండలం మల్లన్నపల్లికి చెందిన ప్రసునూటి ప్రశాంత్, ఆబాది జమ్మికుంటకు చెందిన పిట్టల వీరయ్య రేషన్ బియ్యాన్ని తక్కువ ధరకు సేకరించి మహారాష్ట్రలోని నాందేడ్ ప్రాంతానికి అక్రమ రవాణా చేసేవారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్, వరంగల్ జిల్లా రఘునాథపల్లి ప్రాంతాల నుంచి గతంలో బియ్యం స్మగ్లింగ్ చేస్తూ పట్టుబడి జైలుకు కూడా వెళ్లారు. అయినా తమ ప్రవర్తన మార్చుకోకుండా మకాం మార్చి భీమదేవరపల్లి మండలం మారుమూల గ్రామాల నుంచి 168 క్వింటాళ్ల బియ్యం కొనుగోలు చేసి నాందేడ్ ప్రాంతానికి డీసీఎం వ్యాన్‌లో తరలిస్తూ గత నెల 20న అల్గునూర్ చౌరస్తాలో పట్టుబడ్డారు. వీరిపై కేసు నమోదు చేసిన పోలీసులు కోర్టులో హాజరు పరిచి జైలుకు తరలించారు. ప్రజా పంపిణీ వ్యవస్థకు చెందిన బియ్యం కొనుగోలు, నిల్వ, రవాణా నిషేధమని తెలిసీ స్మగ్లింగ్ చేస్తూ శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తున్నారని, ఆ ఇద్దరిపై పీడీయాక్టు నమోదు చేశారు. ఈ మేరకు నిందితులిద్దరికీ జిల్లా జైలర్ సమక్షంలో ఉత్తర్వులు అందజేసి చర్లపల్లి సెంట్రల్ జైలుకు తరలించారు.
అంతర్ జిల్లా దోపిడీ దొంగపై..
కామారెడ్డి జిల్లా బాన్సువాడకు చెందిన రంజిత్‌సింగ్ అలియాస్ బండ సింగ్‌పై పీడీయాక్టు అమలు చేస్తూ సీపీ ఉత్తర్వులు జారీ చేశారు. పదేళ్లుగా తెలంగాణలోని పలు జిల్లాల్లో దొంగతనాలు చేసి పలుమార్లు జైలుకు వెళ్లిన నిందితుడు తన మకాంను మహారాష్ట్రలోని నాందేడ్‌కు మార్చి ప్రతాప్‌సింగ్ అనే వ్యక్తితో పరిచయం పెంచుకుని తిరిగి దోపిడీలకు పాల్పడ్డాడు. ఈ క్రమంలో గత డిసెంబర్ 13న అల్గునూర్ గ్రామంలో రాజరాజేశ్వర సిమెంట్, స్టీల్ షాపులో షట్టర్ పగులగొట్టి నగదు అపహరించాడు. స్థానికులు అప్రమత్తమై నిందితుడికి దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. ఈ ఘటనలో స్థానికులపై ఇనుప రాడ్‌తో దాడి చేసి గాయపరిచాడు. నిందితుడిపై రెండు కేసులు నమోదు చేసిన తిమ్మాపూర్ పోలీసులు అతడి నేర చరిత్ర ఆధారంగా గతంలో నమోదైన కేసులను పరిగణనలోకి తీసుకుని జిల్లా జైలులో ఉన్న నిందితుడికి నిర్బంధ ఉత్తర్వులు అందజేసి చర్లపల్లి జైలుకు తరలించారు. పీడీయాక్టు అమలు చేయడంలో కీలక పాత్ర పోషించిన తిమ్మాపూర్ సీఐ శశిధర్‌రెడ్డి, పీడీ సెల్ ఇన్చార్జి పండరీని సీపీ అభినందించారు.