హుజూరాబాద్, ఆగస్టు 24: శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని సీపీ సత్యనారాయణ హెచ్చరించారు. హుజూరాబాద్ పట్టణంలోని పోలీస్స్టేషన్లో మంగళవారం విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. వీణవంకలో జరిగిన సంఘటనలో పోలీసుల తప్పేమీ లేదని, అవేశంలో బీజేపీ కార్యకర్తలే దుశ్చర్యకు పాల్పడ్డారన్నారు. రాజకీయ సమావేశాలకు సెలబ్రిటటీలు, బడా రాజకీయ నాయకులు వచ్చినప్పుడు నిబంధనలు అతిక్రమిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. ప్రతి సంఘటనను ఎన్నికలకు ముడిపెడుతున్నారని, ఇది ఎంత మాత్రం సహేతుకం కాదని చెప్పారు. అనుమతి లేకుండా ధర్నాలు, రాస్తారోకో చేయవద్దన్నారు. పోలీసులు చట్టానికి లోబడి ఎవరికైనా అన్యాయం జరిగితే న్యాయం చేసేందుకు ప్రయత్నం చేస్తారన్నారు. సోషల్ మీడియాలో రెచ్చగొట్టే విధంగా, తప్పుడు ప్రచారం చేసినవారిపై నిఘా ఉంటుందని స్పష్టం చేశారు. సమయం వచ్చినప్పుడు వారిపై కేసులు పెడుతామన్నారు. ప్రస్తుతం నియోజకవర్గంలో శాంతియుత వాతావరణం ఉందని, ఎవరైనా రెచ్చగొట్టేందుకు కుట్రలు పన్నితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రేషన్ బియ్యం, గుట్కా, ఇసుక దందాపై ఉక్కుపాదం మోపుతామన్నారు. ఎన్నికల వాతావరణం నెలకొని ఉండడంతో ముందస్తుగా పాత నేరస్తులను బైండోవర్ చేశామని పేర్కొన్నారు. ఎవరైనా రోడ్లపై, రద్దీ ఉన్న చోట జన్మదిన వేడుకలు నిర్వహిస్తే తక్షణమే కేసు నమోదు చేస్తామన్నారు. తల్వార్లు, డమ్మీ పిస్తోళ్లతో యువత హల్చల్ చేయడానికి ప్రయత్నిస్తున్నారని, ఇటువంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. మహిళలు, విద్యార్థినుల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తే జైలుపాలు కాక తప్పదన్నారు. టాస్క్ఫోర్స్, ఇంటలిజెన్స్, స్పెషల్ బ్రాంచ్ పోలీసులు తమ పని చేసుకుంటూ పోతారని, వాళ్ల విధులకు ఆటంకం కలిగిస్తే ఎంత వాళ్లనైనా ఉపేక్షించేది లేదని చెప్పారు. బహిరంగ ప్రదేశాల్లో పార్టీ సమావేశాలు నిర్వహిస్తే సమాచారం సేకరించడం వారి విధుల్లో భాగమేనని పేర్కొన్నారు. ఇక్కడ అడిషనల్ సీపీ శ్రీనివాస్, ఏసీపీ వెంకట్రెడ్డి, సీఐ శ్రీనివాస్ ఉన్నారు.