రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖల మంత్రి గంగుల కమలాకర్
మానేరు నదీ తీరంలో హిందూ శ్మశాన వాటిక ప్రారంభం
కార్పొరేషన్, ఫిబ్రవరి 23: నగరంలోని అన్ని మతాలకు సంబంధించిన వైకుంఠధామాల్లో సకల సదుపాయాలు కల్పిస్తున్నట్లు రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖల మంత్రి గంగుల కమలాకర్ పేర్కొన్నారు. స్థానిక మానేరు నదీ తీరంలో ఆధునీకరించిన హిందూ శ్మశాన వాటికను బుధవారం ఆయన కలెక్టర్ ఆర్వీ కర్ణన్, మేయర్ వై సునీల్‌రావుతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి గంగుల మాట్లాడుతూ, వైకుంఠధామాల అభివృద్ధికి సీఎం కేసీఆర్ పట్టణ ప్రగతి కింద ప్రత్యేకంగా నిధులు మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. మానేరు నదీ తీరంలోని ఏడెకరాల స్థలంలో రూ. 2.65 కోట్లతో వైకుంఠధామాన్ని సుందరంగా తీర్చిదిద్దినట్లు పేర్కొన్నారు. గతంలో ఇద్దరి అంత్యక్రియలు మాత్రమే నిర్వహించే అవకాశం ఉండగా, ప్రస్తుతం ఐదుగురి అంత్యక్రియలు నిర్వహించేలా వాటికలు నిర్మించినట్లు తెలిపారు. అస్థికలు భద్రపరిచేందుకు స్టోరేజ్ గది, లాకర్ సౌకర్యం, మహిళలు, పురుషులకు వేర్వేరుగా స్నానపు గదులు, మరుగుదొడ్ల సదుపాయాలు కల్పించామన్నారు. అలాగే, వర్షానికి కట్టెలు తడవకుండా షెడ్డు, గ్యాలరీ, గ్రీనరీ తదితర సౌకర్యాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. దీంతో పాటు అలకాపురికాలనీలో రూ. 2 కోట్లతో, కార్ఖానగడ్డలో రూ. 2 కోట్లు, మార్కండేయనగర్‌లోని శ్మశాన వాటికకు రూ. కోటి, ముస్లింల కోసం రూ.50 లక్షలు, క్రైస్తవుల శ్మశాన వాటికకు రూ.50 లక్షల చొప్పున కేటాయించి ఆధునీకరించినట్లు తెలిపారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు నగర ప్రజలకు పారులు, రోడ్లు, డ్రైనేజీలు, మారెట్ల అభివృద్ధితో పాటు వైకుంఠధామాల్లో సదుపాయాలు కల్పిస్తున్నట్లు చెప్పారు. మేయర్ వై సునీల్‌రావు మాట్లాడుతూ, నగరంలోని అన్ని శ్మశాన వాటికలను అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగానే మానేరు నదీ తీరంలోని శ్మశాన వాటికను అన్ని సౌకర్యాలతో సుందరీకరించినట్లు చెప్పారు. పట్టణ ప్రగతి నిధులతో పారులు, శ్మశాన వాటికలు, వాకింగ్ ట్రాక్‌లు, ఓపెన్ జిమ్‌లు, పబ్లిక్ టాయ్‌లెట్స్ అన్ని రకాల అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ గరిమాఅగర్వాల్, కార్పొరేటర్ ఆకుల పద్మ-ప్రకాశ్, నేతికుంట యాదయ్య, మున్సిపల్ కమిషనర్ సేవ ఇస్లావత్, కార్పొరేటర్లు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.