కమాన్‌చౌరస్తా, ఆగస్టు 24 : సెప్టెంబర్ ఒకటి నుంచి అన్ని విద్యాలయాలు ప్రారంభించనున్నందున స్పెషల్ డ్రైవ్ నిర్వహించి, పారిశుధ్య పనులు పూర్తి చేసి సిద్ధంగా ఉంచాలని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పేర్కొన్నారు. హైదరాబాద్ నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లు, జిల్లా పరిషత్ చైర్పర్సన్లు, నగర పాలక సంస్థ చైర్మన్లు, జిల్లా విద్యాధికారులు, పంచాయతీ అధికారులతో మంగళవారం పాఠశాలల పునఃప్రారంభం, పారిశుధ్య పనుల నిర్వహణపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో పారిశుధ్య చర్యలు చేపట్టేలా జిల్లా విద్యాధికారులు పర్యవేక్షించాలని ఆదేశించారు. పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాల్లో నిర్వహించే పారిశుధ్య పనుల్లో సర్పంచులు, ఎంపీపీలు, జడ్పీటీసీలు, వార్డు సభ్యులు, ప్రజాప్రతినిధులు భాగస్వాములు కావాలని సూచించారు. రాష్ట్ర పంచాయితీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు మాట్లాడుతూ.. పండుగ వాతావరణంలో సెప్టెంబర్ ఒకటిన పాఠశాలలను ప్రారంభించాలన్నారు. కరీంనగర్ జిల్లా పరిషత్ అధ్యక్షురాలు కనుమల్ల విజయ మాట్లాడుతూ.. జిల్లాలోని అన్ని పాఠశాలల్లో అధికారులు, ప్రజాప్రతినిధుల భాగస్వామ్యంతో విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా పాఠశాలలను ప్రారంభానికి సిద్ధం చేస్తామని తెలిపారు. కలెక్టర్ ఆర్వీ కర్ణన్ మాట్లాడుతూ.. పారిశుధ్య పనులు పూర్తి చేస్తామని పేర్కొన్నారు. ఈ వీడియో కాన్పరెన్స్‌లో పంచాయతీరాజ్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్ కుమార్‌సుల్తానియా, కమిషనర్ రఘునందన్ రావు, పురపాలక శాఖ కమిషనర్ సత్యనారాయణ, కరీంనగర్ నగరపాలక సంస్థ కమిషనర్ వల్లూరి క్రాంతి, లోకల్ బాడీస్ అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్, జిల్లా విద్యాధికారి జనార్దన్‌రావు, జిల్లా పంచాయతీ అధికారి వీర బుచ్చయ్య, డివిజనల్ పంచాయతీ అధికారి హరి కిరణ్ పాల్గొన్నారు.