అదనపు విద్యుత్ వినియోగించే వారికే వర్తింపు
లోడ్ లేదని భావిస్తే ఫిర్యాదు చేయొచ్చు
వెల్లడించిన ఎన్పీడీసీఎల్ సీఎండీ అన్నమనేని గోపాల్‌రావు
వినియోగదారుల అనుమానాల నివృత్తికి ప్రకటన విడుదల
ముకరంపుర, ఫిబ్రవరి 24: కనెక్టెడ్ లోడ్‌కు మించి అధికంగా విద్యుత్ వినియోగించిన వారికే అదనపు లోడ్ చార్జీలను లెక్కించి బిల్లులో కలిపినట్లు ఎన్పీడీసీఎల్ సీఎండీ అన్నమనేని గోపాల్‌రావు వెల్లడించారు. ఈ (డెవలప్మెంట్, సెక్యూరిటీ డిపాజిట్) చార్జీల విషయంలో వినియోగదారుల్లో అనుమానాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో వారి సందేహాలను నివృత్తి చేయడానికి పూర్తి వివరాలతో ఒక ప్రకటన విడుదల చేశారు. వినియోగదారులు మొదట కొత్త విద్యుత్ సర్వీసు కనెక్షన్ తీసుకునే సమయంలో దరఖాస్తు చేసుకున్న కనెక్టెడ్ లోడ్ ప్రకారం డెవలప్మెంట్ చార్జీలు, సెక్యూరిటీ డిపాజిట్ నిర్ణయించబడతాయని పేర్కొన్నారు. అయితే, వినియోగదారులు సంస్థకు తెలియజేయకుండా ఫ్రిజ్, వాటర్ హీటర్, గీజర్లు, గ్రైండర్లు, ఏసీలు, తదితర గృహోపకరణాలు వినియోగిస్తున్నారని, అదనపు వాడకం వల్ల కనెక్టెడ్ లోడ్ కంటే ఎక్కువ విద్యుత్ వినియోగమవుతుందని తెలిపారు. రికార్డు ప్రకారం 3 వేల మెగావాట్ల అమోదిత లోడు ఉంటే 4,200 మెగావాట్ల లోడుగా రికార్డు అయిందని పేర్కొన్నారు. దీంతో ట్రాన్స్ఫార్మర్లు, లైన్లు, ఇతర విద్యుత్ సామగ్రిపై భారం అధికమై అనేక సమస్యలు తలెత్తాయని వివరించారు. దీన్ని నివారించి వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్ సరఫరా చేసేందుకు అదనపు ట్రాన్స్ఫార్మర్లు, లైన్లు, ఇతర పనులు చేయాల్సిన అవసరం ఉన్నందున డెవలప్మెంట్ చార్జీలు వేసినట్లు చెప్పారు.
చార్జీలు వేయడానికి కారణాలు
అక్టోబర్ 2021 వరకు 1201.07మెగా వాట్ల అదనపు కనెక్టెడ్ లోడ్‌ను ఎన్పీడీసీఎల్ సిస్టమ్‌కు వినియోగదారులు వివిధ ఎలక్ట్రికల్ పరికరాల రూపంలో కనెక్ట్ చేశారని పేర్కొన్నారు. ఈ 1201.07 మెగావాట్ల విద్యుత్ లోడ్‌కు అనుగుణంగా సంస్థ డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్లు, లైన్లు, సబ్స్టేషన్ల ఏర్పాటు, అదనపు విద్యుత్ ఉత్పాదకత అవసరం ఏర్పడిందన్నారు. ఇందుకు అవసరమైన నిధులు సమకూర్చుకోవడానికి, వినియోగదారులకు నాణ్యమైన నిరంతర విద్యుత్ సరఫరా అందించేందుకు కనెక్టెడ్ లోడ్‌కు మించి అధికంగా విద్యుత్ వాడుతున్నారో వారికే అదనపు లోడ్ చార్జీలు కలపడంతోపాటు వారి కనెక్టెడ్ లోడ్ కూడా పెంచినట్లు తెలిపారు.
బిల్లులోనే నోటీసు రూపంలో చార్జీలు
అదనపు లోడ్ ఒక కిలోవాట్‌కు రూ.1,200 డెవలప్మెంట్ చార్జీలు, సెక్యూరిటీ డిపాజిట్‌గా రూ.200 లెక్కించి వినియోగదారులకు బిల్లులో వేసినట్లు తెలిపారు. అధికంగా లోడ్ వాడుకున్న విషయాన్ని వినియోగదారులకు 2021 డిసెంబర్, 2022 జనవరి విద్యుత్ బిల్లులో నోటీసు రూపంలో చూపించినట్లు వివరించారు. అదనపు చార్జీలపై అభ్యంతరం తెలిపిన వినియోగదారుల గృహోపకరణాలను సెక్షన్ అధికారి నేరుగా తనిఖీ చేసి, అదనపు లోడ్ లేకపోతే బిల్లుల నుంచి తొలగించినట్లు చెప్పారు. రెండు నెలల తర్వాత కూడా ఆక్షేపణ తెలియజేయని వినియోగదారులకు 2022 ఫిబ్రవరి నెల బిల్లులో అదనపు లోడ్ చార్జీలు(డెవలప్మెంట్, సెక్యూరిటీ డిపాజిట్) కలుపడంతో పాటు కనెక్టెడ్ లోడ్‌ను రికార్డుల్లో పెంచినట్లు తెలిపారు. ఒక వేళ వినియోగదారులు అదనపు లోడ్ లేదని భావిస్తే తమ పరిధిలోని సెక్షన్(ఏఈ) అధికారికి లిఖిత పూర్వకంగా తెలియజేసినట్లయితే విద్యుత్లోడ్ను తనిఖీ చేసి, అదనపు లోడ్ లేనట్లయితే అదనపు లోడ్ చార్జీలను తీసివేస్తారని తెలిపారు. వినియోగదారులు ఈ విషయాన్ని గమనించాలని కోరారు.