హుజూరాబాద్‌టౌన్, ఆగస్టు 30: మున్నూరు కాపులకు సీఎం కేసీఆర్ అండగా ఉన్నారని, వారిని టీఆర్ఎస్ నుంచి విడదీయడం ఎవరి తరం కాదని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాలశాఖ మంత్రి గంగుల కమలాకర్ పేర్కొన్నారు. సోమవారం హుజూరాబాద్ నియోజకవర్గం పరిధిలోని ఐదు మండలాల మున్నూరుకాపు సంఘం అధ్యక్ష, కార్యదర్శులు, ప్రతినిధులతో హుజూరాబాద్‌లోని సిటీ సెంటర్ హాల్లో నిర్వహించిన సమావేశానికి మంత్రి హాజరై మాట్లాడారు. హుజూరాబాద్‌లో మున్నూరు కాపుల ఐక్యతను దెబ్బతీసేందుకు కుట్రలు జరుగుతున్నాయని, వాటిని ఛేదించి అభివృద్ధి, సంక్షేమంలో మున్నూరు కాపులకు అండగా ఉండే ముఖ్యమంత్రి కేసీఆర్‌కు మద్దతు తెలుపాలన్నారు. రాష్ట్ర కేబినెట్లో అత్యున్నత మంత్రి పదవిని మున్నూరు కాపులకు ఇచ్చారని చెప్పారు. హైదరాబాద్‌లోని అత్యంత ఖరీదైన ప్రాంతం కోకాపేటలో, హుజురాబాద్‌లో మున్నూరుకాపు భవనాలకు స్థలాన్ని కేటాయించి నిధులను కూడా మంజూరు చేసిన విషయాన్ని గుర్తు చేశారు. గెల్లు శ్రీనివాస్‌యాదవ్ గెలుపులో మున్నూరు కాపుల భాగస్వామ్యం ఉండాలని పిలుపునిచ్చారు. గతంలో హుజూరాబాద్‌లో ఈటల రాజేందర్ మున్నూరు కాపులను అణిచివేశాడని, రాజకీయంగా ఎదగనీయకుండా అడ్డుకున్నాడని ఆరోపించారు.
ఈటల కుట్రలను సీఎం కేసీఆర్ భగ్నం చేశారని, ఈటలకు తగిన గుణపాఠం చెప్పాలన్నారు. కాంగ్రెస్ కపట నాటకాలతో మున్నూరు కాపుల ఓట్లను చీల్చే కుయుక్తుల్ని పన్నుతుందని, దీనిని కులస్తులంతా తిప్పికొట్టాలన్నారు. ఉప ఎన్నికల్లో హుజూరాబాద్‌లో గులాబీ జెండా ఎగురుతుందని ధీమా వ్యక్తం చేశారు. జిల్లా మంత్రిగా, మున్నూరు కాపు బిడ్డగా హుజూరాబాద్‌లోని ప్రతి ఒకరికీ అందుబాటులో ఉండి సమస్యలు పరిషరిస్తానని చెప్పారు. సీఎం కేసీఆర్‌కు గెల్లు గెలుపును కానుకగా ఇచ్చి, అభివృద్ధి, సంక్షేమాన్ని మరింత ముందుకు తీసుకువెళ్తామని పేర్కొన్నారు. సమావేశంలో నాయకులు చల్ల హరిశంకర్, పొనగంటి మల్లయ్య, నల్లమల రవీందర్, కల్లెపల్లి రమాదేవి, ఐదు మండలాల మున్నూరు కాపు సంఘాల అధ్యక్షులు, కార్యదర్శులు, అధికసంఖ్యలో కులస్తులు పాల్గొన్నారు.
రూ.40 కోట్లతో కేసీఆర్ ఆటోనగర్ అభివృద్ధి
కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ పట్టణంలోని ఆటో మొబైల్ కార్మికులకు ప్రభుత్వం మంజూరు చేసిన భూమి పట్టాలను వచ్చే నెల 5న మంత్రి హరీశ్‌రావుతో కలిసి తాను పంపిణీ చేయనున్నట్లు బీసీ సంక్షేమ, పౌరసరఫరాలశాఖ మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. ఈ మేరకు సోమవారం పట్టణ శివారులోని కేసీఆర్ ఆటోనగర్కాలనీ వద్ద అధికారులతో కలిసి ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. కేసీఆర్ ఆటోనగర్ కాలనీ అభివృద్ధికి రూ.40 కోట్లు మంజూరు చేశామన్నారు. కార్మికుల కష్టాలను గుర్తించి వారి కోసం రాష్ట్ర ప్రభుత్వం 7 ఎకరాల భూమిని ప్రభుత్వం కేటాయించిందని, దానికి కృతజ్ఞతగా ‘కేసీఆర్ ఆటోనగర్’గా నామకరణం చేసుకున్నామని తెలిపారు. అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉండాలన్నదే సీఎం కేసీఆర్ ఆకాంక్ష అని, 350 మంది ఆటోనగర్ కార్మికులకు వచ్చే నెల 5న తనతో పాటు సహచర మంత్రి తన్నీరు హరీశ్‌రావు చేతుల మీదుగా ప్రభుత్వం మంజూరు చేసిన భూమి పట్టాలను అందజేయనున్నట్లు పేరొన్నారు. గతంలో ఆటోనగర్ కావాలని మెకానిక్‌లు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా అప్పటి మంత్రి ఈటల రాజేందర్ పట్టించుకోలేదని వెల్లడించారు. హుజూరాబాద్ పట్టణంలో చాలా మంది నిరుపేద కార్మికులు తమ షాపులకు కిరాయి కట్టలేని పరిస్థితులు ఉండేవని, కార్మికుల అభివృద్ధిపై ఈటలకు చిత్తశుద్ధి లేదని మండిపడ్డారు. గత 20 ఏండ్లుగా దొరకని స్థలం ఇప్పుడు ఎకడి నుంచి వచ్చిందని, తామేమీ కరీంనగర్ నుంచి స్థలాన్ని తీసుకురాలేదని, ఈటలకు చిత్తశుద్ధి లేకనే ఇవ్వలేదని, ఇప్పుడు తమకు చిత్తశుద్ధి ఉంది కనుకనే ఇకడ ఉన్న స్థలాన్నే ఇచ్చామన్నారు. కేవలం మెకానిక్లకే కాకుండా ప్రతి కుల సంఘానికి స్థలాన్ని కేటాయించి, సంఘ భవనాలను కూడాం నిర్మించి ఇస్తున్నామన్నారు. కార్యక్రమంలో తెలంగాణ స్టేట్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ జోనల్ మేనేజర్ అజ్మీరస్వామి, టీఆర్ఎస్ నాయకులు చల్ల హరిశంకర్, గందె శ్రీనివాస్, ఆటో మోబైల్ సంఘం నాయకులు పాల్గొన్నారు.