హుజూరాబాద్ టౌన్/హుజూరాబాద్‌రూరల్, అక్టోబర్ 10: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న తీరుతో విసిగిపోయిన ప్రజలు ఉప ఎన్నికలో ఆ పార్టీని వ్యతిరేకిస్తున్నారు. ఈ మేరకు ఎవరికి వారు ‘మా ఇంటికి రావద్దు అంటూ బోర్డులు పెట్టుకుంటున్నారు. హుజూరాబాద్ పట్టణంలోని 27వ వార్డులో ఇంటింటికి బీజేపీని బహిషరిస్తూ తమ ఇంటికి రావద్దు అంటూ స్వచ్ఛందంగా రాసి గేట్లకు, తలుపులకు తగిలించుకున్న వైనం బీజేపీపై వ్యతిరేకతకు పరాకాష్ట. ‘వంట గ్యాస్ ధరలు పెంచిన బీజేపీకి ఓటు వేయం.. దయచేసి ఇబ్బంది పెట్టకండి’.. అని ఒకరు బోర్డు పెట్టగా, ‘పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలు పెంచిన బీజేపీకి ఓటు వేయం’.. అని మరొకరు, ‘నిత్యావసర ధరలు పెంచుతున్న బీజేపీకి మేము ఓటు వేయం.. దయచేసి ఇబ్బంది పెట్టకండి’ అంటూ ఇంకొకరు, ‘వీ లవ్ కేసీఆర్, వీ వోట్ ఫర్ కార్’ అంటూ మరో చోట.. ఇలా రకరకాల బోర్డులు పెట్టి బీజేపీ నేతలకు 27వ వార్డులో ఓటర్లు చుకలు చూపిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న తీరుతో ఆ పార్టీ బీజేపీని బహిషరిస్తూ తమ ఇంటికి రావద్దని స్వచ్ఛందంగా బోర్డులు పెట్టుకుంటున్న ప్రజల తీరును చూస్తే వారిలోని మొదలైన మార్పుకు, ఆవేదనకు ఆందోళనకు అద్దం పడుతున్నది. ఈ విధంగా కనీవినీ ఎరుగని రీతిలో హుజూరాబాద్ పట్టణంలో ఒక 27వ వార్డే కాదు.. 7వ వార్డులో మున్సిపల్ వైస్ చైర్పర్సన్ కొలిపాక నిర్మల, టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు కొలిపాక శ్రీనివాస్ ఇంటి వద్ద ఖాళీ సిలిండర్‌ను పెట్టి, పెరిగిన గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలతో విసిగిపోయామని పేర్కొంటూ ప్రదర్శించడంతో సమీపంలో పలువురు అదేవిధంగా బోర్డులు పెట్టుకున్నారు. కిందివాడలోని 5వవార్డులో, 7వ వార్డులో కూడా ఇదే విధంగా బీజేపీని బహిష్కరిస్తూ బోర్డులు దర్శనమిస్తున్నాయి. ప్రజల్లో రోజు రోజుకు వస్తున్న అనూహ్య మార్పుకి ఒకసారిగా బీజేపీ నాయకులు, కార్యకర్తలు హుజూరాబాద్‌లో ఖంగు తింటున్నారు.
ఉద్యమ కారుడికే మా ఓటు
మండలంలోని పెద్దపాపయ్యపల్లి గ్రామానికి చెందిన రాము అనే వ్యక్తి తన ఇంటి ఎదుట తెలంగాణ ఉద్యమ కారుడు, ఓయూ ముద్దుబిడ్డ, పేదల పక్షపాతి, టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్‌కే మా ఓట్లు. బీజేపీ, కాంగ్రెస్, ఇతర పార్టీలు మా ఇంటికి ఓటు అడుగడానికి రావద్దని విజ్ఞప్తి చేస్తూ బోర్డు పెట్టాడు. ఆదివారం బీజేపీ నాయకులు పలువురు ప్రచారం కోసం రాము ఇంటికి వెళ్లగా ఎందుకు వచ్చారని వాగ్వాదానికి దిగాడు. ఎన్నికల అధికారులకు ఫోన్ చేయడంతో వారు వెనక్కి వెళ్లి పోయినట్లు రాము తెలిపారు.