యాదాద్రి వైభవం ప్రతిబింబించేలా 30కోట్లతో నిర్మాణం
పదెకరాల స్థలం కేటాయింపు lపత్రాలు అందించిన సీఎం కేసీఆర్
విశేషంగా కృషి చేసిన మంత్రి గంగుల కమలాకర్
జిల్లా ప్రజల తరపున ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు
కార్పొరేషన్, మార్చి 15 : అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు తిరుమల వేంకటేశుడు మన కరీంనగర్‌కు తరలివస్తున్నారు. తిరుమలకు తీసిపోకుండా.. యాదాద్రి వైభవం ప్రతిబింబించేలా నిర్మించే గొప్ప పుణ్యక్షేత్రంలో కొలువు దీరనున్నారు. కోరిన కోర్కెలు తీర్చే ఇలవేల్పై మన వద్దే దర్శన భాగ్యం కల్పించనున్నారు. గుడి నిర్మాణం కోసం తిరుమల తిరుపతి దేవస్థానం ముందుకు రాగా.. అందుకు పదెకరాల స్థలం కావాలని మంత్రి గంగులకమలాకర్ ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ఆ మేరకు పద్మనగర్ వ్యవసాయ క్షేత్ర పరిధిలో స్థలం కేటాయించడంతోపాటు అందుకు సంబంధించిన పత్రాలను సీఎం స్వయంగా మంత్రికి మంగళవారం హైదరాబాద్‌లో అందించారు. ఈ సందర్భంగా గంగుల జిల్లావాసుల తరఫున కృతజ్ఞతలు తెలుపగా, భక్తజనులు ఆనంద డోలికల్లో మునిగితేలారు.
కరీం‘నగరం’లో తిరుమలేశుడి పుణ్యక్షేత్రం ఏర్పాటు కాబోతున్నది. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీవేంకటేశ్వర స్వామి దర్శన భాగ్యం ఉమ్మడి కరీంనగర్ జిల్లా ప్రజలకు కలుగబోతున్నది. వినడానికి నమ్మశక్యంగా లేకున్నా.. త్వరలోనే ఇందుకు అడుగు పడబోతున్నది. వివరాల్లోకి వెళ్తే.. ఇటీవల టీటీడీ బోర్డు సమావేశం జరిగింది. రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్, ‘నమస్తే తెలంగాణ’ సీఎండీ దీవకొండ దామోదర్‌రావు, టీటీడీ తెలంగాణ లోకల్ అడ్వయిజరీ కమిటీ చైర్మన్ గుండవరం వెంకట భాస్కర్‌రావు కృషితో కరీంనగర్లో వేంకటేశ్వరస్వామి గుడి నిర్మాణానికి టీటీడీ బోర్డు చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ఈవో జవహార్‌రెడ్డి, బోర్డు సభ్యుల ఆమోదం లభించింది.
తిరుమలకు ఏమాత్రం తీసిపోకుండా నిర్మించాలంటే.. 30 కోట్ల వ్యయంతోపాటు 10 ఎకరాల స్థలం అవసరమవుతుందని దేవస్థానం తెలిపింది. ఆ మేరకు.. స్థలం సాధనకు మంత్రి గంగుల ప్రత్యేక దృష్టిపెట్టారు. ఇందుకోసం కొన్నాళ్లుగా అన్వేషణ చేశారు. చివరకు పద్మనగర్ వ్యవసాయ క్షేత్రం పరిధిలో పదెకరాల స్థలం అనువుగా ఉంటుందని గుర్తించారు. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లారు. ఈ విషయంలో సీఎం సానుకూలంగా స్పందించి స్థలాన్ని కేటాయించారు. అందుకు సంబంధించిన పత్రాలను మంత్రి గంగుల కమలాకర్, టీటీడీ హైదరాబాద్ లోకల్ అడ్వయిజరీ కమిటీ చైర్మన్ జీవీ భాస్కర్‌రావుకు మంగళవారం హైదరాబాద్‌లో ముఖ్యమంత్రి అందించారు. ఈ సందర్భంగా మంత్రి గంగుల కృతజ్ఞతలు తెలుపగా, ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ప్రతి ఒక్కరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఏడాదిన్నరలోగా పూర్తి చేస్తాం
శ్రీ వేంకటేశ్వర స్వామి గుడి నిర్మాణం కోసం ముఖ్యమంత్రి స్థలం కేటాయించారు. మరోసారి కరీంనగర్‌పై ఉన్న ప్రేమను చాటుకున్నారు. చాలా సంతోషంగా ఉంది. సీఎం కేసీఆర్‌కు జిల్లా ప్రజల తరపున రుణపడి ఉంటాం. భక్తులకు అత్యంత ప్రీతిపాత్రుడైన శ్రీనివాసుడి ఆలయాన్ని సీఎం సంకల్పం మేరకు ఏడాదిన్నర కాలంలో పూర్తి చేస్తాం. భక్తులకు దర్శనభాగ్యం కల్పిస్తాం. తిరుమలకు ఏ మాత్రం తీసిపోకుండా యాదాద్రి వైభవం ప్రతిబింబించేలా నిర్మాణం చేస్తాం. ఆలయ నిర్మాణం కోసం కృషి చేసిన రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్, ‘నమస్తే తెలంగాణ’ సీఎండీ దీవకొండ దామోదర్‌రావు, టీటీడీ తెలంగాణ లోకల్ అడ్వయిజరీ కమిటీ చైర్మన్ గుండవరం వెంకట భాస్కర్‌రావుతోపాటు టీటీడీ పాలక మండలి సభ్యులకు నా ప్రత్యేక కృతజ్ఞతలు.
– మంత్రి గంగుల కమలాకర్