గన్నేరువరం, ఆగస్టు15 : మొహర్రం వేడుకలు అనగానే గుర్తుకు వచ్చేది ముస్లింల పండుగ అని. కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండల కేంద్రంలో ముస్లిం కుటుంబం ఒక్కటి కూడా లేనప్పటికీ ఈ ఏడాది తొలిసారి మొహర్రం వేడుకలు ప్రారంభమయ్యాయి. 60 ఏండ్ల క్రితం గ్రామంలో కొన్ని ముస్లిం కుటుంబాలు ఉండేవి. అప్పుడు ఈ వేడుకలను ఆ కుటుంబాల వారు నిర్వహించేవారు. పీరీలకు కుడుకలు వేయడం, దట్టీ కట్టడం హిందువులకు కూడా సంప్రదాయంగా ఉండేది. కాలక్రమేణా ఆ కుటుంబాల వారు బతుకు దెరువుకోసం గ్రామం వదిలి వేరే ప్రదేశాలకు వెళ్లి పోవడంతో ఈ వేడుకలు 60 ఏండ్లుగా ఆగిపోయాయి. ఈ వేడుకలు తిరిగి నిర్వహించాలని గ్రామస్తులు సంకల్పించుకుని 200 మంది గ్రామస్తులతో మొహర్రం వేడుకల కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీలో అందరూ హిందువులే ఉండడం విశేషం. ఎన్నో ఏండ్లుగా మూలన పడి ఉన్న పీరీలను ఈ సంవత్సరం ముస్లిం మత పెద్దలతో శుద్ధి చేయించి వేడుకలు ప్రారంభించారు. ముస్లింల పండుగను హిందువులు మాత్రమే చేస్తుండడం జిల్లాలోనే చర్చనీయాంశమైంది. తొమ్మిది రోజులపాటు ఈ వేడుకలు నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా పీరీలను ఇంటింటికీ తీసుకెళ్లి దర్శనం చేయిస్తున్నారు. పీరీలు నెల కొల్పిన మసీదు వద్ద అగ్ని గుండం ఏర్పాటు చేశారు. అగ్నిగుండం చుట్టూ తిరుగుతూ ఆశన్న, ఊశన్న ఎన్నీయల్లో అంటూ పాడుతూ చిందులు వేస్తూ పాత కాలాన్ని నేటి యువత, పిల్లలకు పరిచయం చేస్తున్నారు. మోహర్రం పండుగ రోజున పీరీలను నిమజ్జనం చేసి మసీదులో నిలువ చేయనున్నారు. ప్రతి ఏటా పీరీల ఉత్సవాలు జరుగుతాయని నిర్వాహకులు పేర్కొన్నారు.
వేడుకలు నిర్వహించడం ఆనందంగా ఉంది
గ్రామంలో ఎన్నో ఏండ్లుగా నిలిచిపోయిన మొహర్రం పండుగను ఈ ఏడాది గ్రామస్తుల సహకారంతో నిర్వహించడం ఆనందకరంగా ఉన్నది. ప్రతి సంవత్సరం కమిటీ ఆధ్వర్యంలో ఈ వేడుకలు నిర్వహిస్తాం. హిందూ ముస్లింల సఖ్యతకు ఈ పండుగలే నిదర్శనం. ఇంటింటికీ పీరీలు వెళ్తుండగా ప్రతి ఒక్కరూ మొక్కులు చెల్లించుకొంటున్నారు.
-బోయిని మల్లయ్య (ఉత్సవ కమిటీ అధ్యక్షుడు)
మత సామరస్యానికి ప్రతీక
పీరీల పండుగ మత సామరస్యానికి ప్రతీకంగా నిలుస్తున్నది. గ్రామంలో తొలిసారిగా హిందువులంతా కలిసి మొహర్రం కమిటీని ఏర్పాటు చేసి ఉత్సవాలు నిర్వహిస్తున్నాం. పాత కాలపు వేడుకను నేటి యువతకు పరిచయం చేసిన కమిటీ వారికి కృతజ్ఞతలు. ప్రతి ఏటా ఈ ఉత్సవాలు విజయవంతంగా నిర్వహించడానికి యూత తరఫున సహాయమందిస్తాం.
-గూడూరి సురేశ్ (వివేకానంద యూత్ అధ్యక్షుడు)