నిరసన తెలుపుతున్న దళితులు, టీఆర్ఎస్ నాయకులపై అంబేద్కర్ విగ్రహం సాక్షిగా దాడి
హుజూరాబాద్/ హుజూరాబాద్ టౌన్/ హుజురాబాద్ రూరల్, జూలై 29: దళిత సమాజం ఆగ్రహం వ్యక్తం చేసింది. బీజేపీ నేత ఈటల, ఆయన అనుచరుల కుట్రలు, కుతంత్రాలపై భగ్గుమన్నది. దళిత సమాజ సముద్ధరణకు తెచ్చిన దళిత బంధును ఆపేందుకు కుట్రలు చేయడం, దళితులను కించపరిచేలా ఈటల బామ్మర్ది మధుసూదన్ రెడ్డి, ఈటల సతీమణి జమునారెడ్డి మధ్య జరిగిన వాట్సప్ చాట్‌పై మండిపడింది. గురువారం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ముఖ్యంగా హుజూరాబాద్‌లో ఈటల, మధుసూదన్‌రెడ్డి దిష్టిబొమ్మలు దహనం చేసింది. ఈటల దళిత ద్రోహి అని, ఆయనకు ఈ ఎన్నికల్లో తగిన గుణపాఠం చెబుతామని స్పష్టం చేసింది. దళిత జాతికి ఈటలతో పాటు కుటుంబ సభ్యులు బహిరంగ క్షమాపణ చెప్పాలని లేదంటే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించింది.
అట్టుడికిన హుజూరాబాద్..
ఆందోళనలతో హుజూరాబాద్ నియోజకవర్గం అట్టుడికింది. దళిత సంఘం, బుడగజంగాల రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మౌటం రాంకుమార్, ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్ ఆధ్వర్యంలో బీజేపీ నేత రాజేందర్ బావమరిది మధుసూదన్‌రెడ్డి దిష్టిబొమ్మకు శవయాత్ర నిర్వహించి అంబేద్కర్ చౌరస్తాలో దహనం చేశారు. ఈటల దళిత ద్రోహి అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ శ్రీనివాస్ మాట్లాడుతూ, దళితులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఈటల రాజేందర్, అతని బంధువులపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. హుజూరాబాద్ మండలం చెల్పూర్, పోతిరెడ్డిపేట, సిర్సపల్లి, తదితర గ్రామాల్లోనూ దళితులు ఆందోళన చేశారు. డప్పుచప్పుళ్ల మధ్య ఈటల దిష్టిబొమ్మతో శవయాత్రలు చేసి దహనం చేశారు. జమ్మికుంట తెలంగాణ చౌరస్తాలో దళిత ప్రజాప్రతినిధులు, దళిత సంఘాల నాయకుల ఆధ్వర్యంలో మధుసూదన్ రెడ్డి, ఈటల రాజేందర్ దిష్టిబొమ్మను దహనం చేశారు. తర్వాత టౌన్ పోలీస్ స్టేషన్లో ఎస్ఐ కుంట మౌనికకు ఫిర్యాదు చేశారు. ఇల్లందకుంట, వీణవంక మండల కేంద్రాల్లో దళిత సంఘాల ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. ఈటల, మధుసూదన్‌రెడ్డి దిష్టిబొమ్మలను డప్పుచప్పుళ్ల మధ్య శవయాత్ర నిర్వహించి దహనం చేశారు.
చొప్పదండి అంబేద్కర్ చౌరస్తా వద్ద టీఆర్ఎస్ నాయకుడు మాచర్ల వినయ్ ఆధ్వర్యంలో.. అలాగే గంగాధర మండలం మధురానగర్ చౌరస్తాలో మధుసూదన్‌రెడ్డి దిష్టిబొమ్మను ప్రజాప్రతినిధులు, దళిత సంఘం నాయకులు దహనం చేశారు. రామడుగులోని అంబేద్కర్ విగ్రహం వద్ద టీఆర్ఎస్ పార్టీ ఎస్సీసెల్ మండలాధ్యక్షుడు తడగొండ రాజు, సీనియర్ నాయకుడు కలిగేటి లక్ష్మణ్ ఆధ్వర్యంలో ఈటల, మధుసూదన్‌రెడ్డి దిష్టిబొమ్మలు దహనం చేశారు.
జగిత్యాల అంబేద్కర్‌చౌరస్తాలో దళిత సంఘాల ఆధ్వర్యంలో ధర్నా చేశారు. ఈ సందర్భంగా దళితులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బీజేపీ నాయకుడు ఈటల రాజేందర్ బావమరిది మధుసూదన్ రెడ్డిని అరెస్ట్ చేయాలని, ఈటల రాజేందర్‌ను అనర్హుడిగా ప్రకటించాలని ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ సభ్యుడు దుమాల రాజ్ కుమార్, నాయకులు బాలె శంకర్ డిమాండ్ చేశారు. కొడిమ్యాల మండల కేంద్రంలో వైస్ ఎంపీపీ పర్లపల్లి ప్రసాద్, టీఆర్ఎస్ ఎస్సీ సెల్ మండలాధ్యక్షుడు నేరేళ్ల మహేశ్, ఆర్బీఎస్ జిల్లా కమిటీ సభ్యులు బండపల్లి అంజన్‌కుమార్ ఆధ్వర్యంలో.. అలాగే మల్యాల మండల కేంద్రం, ధర్మపురి పట్టణంలో దళిత సంఘాల ఆధ్వర్యంలో ఈటల, మధుసూదన్‌రెడ్డి దిష్టిబొమ్మలు దహనం చేశారు. పెద్దపల్లి జిల్లా కేంద్రం, రామగుండం, మంథని, ధర్మారంలో టీఆర్ఎస్ కార్పొరేటర్లు, నాయకులు, యైటింక్లయిన్‌కాలనీ, ఎన్టీపీసీలో టీఆర్ఎస్ పట్టణ నాయకులు, దళిత సంఘాల నాయకులు ఆందోళన చేశారు. ఈటల, మధుసూదన్‌రెడ్డి దిష్టిబొమ్మలు దహనం చేశారు. ఎన్టీపీసీలో టీఆర్ఎస్ రామగుండం పట్టణ అధ్యక్షుడు బొడ్డుపల్లి శ్రీనివాస్ ఆధ్వర్యంలో టీఆర్ఎస్ శ్రేణులు ఈటల దిష్టిబొమ్మను లింగాపూర్ శివారు గోదావరి నదిలో జలసమాధి చేశారు.
ఈటలకు బుద్ధి చెబుతం..
బీజేపీ నేత ఈటల, ఆయన అనుచరులు దళిత వ్యతిరేకులు. సీఎం కేసీఆర్ తీసుకువచ్చిన దళిత బంధు పథకాన్ని ఆపేందుకు కుట్రలు పన్నుతున్నరు. దళితులను కించపరిచేలా వాట్సప్‌లో చాట్ చేస్తున్నరు. ఈటల బామ్మర్ది మధుసూదన్‌రెడ్డి తీరు సరిగ్గా లేదు. ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలి. దళితుల భూములను అక్రమించుకుంటూనే దళితులపై అమర్యాదగా మాట్లాడుతున్న ఈటల అనుచరులు, అతన్ని కుటుంబ సభ్యులకు బుద్ధి చెబుతం. ఎన్నికల్లో ఓడిపోతామనే భయంతోనే ఇన్ని కుట్రలు, కుతంత్రాలకు పాల్పడుతున్నరు. దళితులను రెచ్చగొడితే ఊరుకునేది లేదు. తగిన గుణపాఠం చెబుతం.