కమాన్‌చౌరస్తా, అక్టోబర్ 12: జిల్లా కేంద్రంలోని కిమ్స్ డిగ్రీ, పీజీ కళాశాలలో మంగళవారం బతుకమ్మ సంబురాలు ఘనంగా నిర్వహించారు. అధ్యాపకులు, విద్యార్థినులు తీరొక్క పూలతో బతుకమ్మలను పేర్చారు. కళాశాల ఆవరణలో బతుకమ్మలను పెట్టి పాటలు పాడుతూ, ఆడారు. ముఖ్యఅతిథిగా కిమ్స్ విద్యా సంస్థల వైస్ చైర్మన్ పేర్యాల సాకేత్ రామారావు హాజరై బతుకమ్మ విశిష్టతను విద్యార్థులకు వివరించారు. ఇక్కడ కళాశాల ప్రిన్సిపాల్ బీ అర్జున్‌రావు, అధ్యాపకులు, విద్యార్థినులు పాల్గొన్నారు. అలాగే, కేడీసీసీ బ్యాంక్‌లో మహిళా ఉద్యోగులు బతుకమ్మ సంబురాలు నిర్వహించారు. మహిళా ఉద్యోగులు కార్యాలయంలో బతుకమ్మ పేర్చారు. బ్యాంకు ఆవరణలో బతుకమ్మలను పెట్టి ఆడిపాడారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా నాఫ్స్ కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్రావు, బ్యాంక్ సీఈవో సత్యనారాయణ రావు, జీఎంలు శ్రీధర్, రియాజ్, డీజీఎంలు హాజరయ్యారు. పద్మనగర్‌లోని డీఐఈవో కార్యాలయంలో డీఐఈవో రాజ్యలక్ష్మి, కల్పన ఆధ్వర్యంలో బతుకమ్మ సంబురాలు నిర్వహించారు. జూనియర్ కళాశాల అధ్యాపకులు పాల్గొని ఆడిపాడారు. జిల్లా జైలులో బతుకమ్మ సంబురాలు నిర్వహించారు. జైలు పర్యవేక్షణాధికారులు సమ్మయ్య, శ్రీనివాస్, అధికారులు, సిబ్బంది కుటుంబసభ్యులతో హాజరయ్యారు.
మండలంలోని ఆసిఫ్‌నగర్, ఖాజీపూర్‌లో సద్దుల బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహించారు. మహిళలు తీరొక్క పూలతో బతుకమ్మలను అందంగా పేర్చారు. సాయంత్రం గ్రామ కూడళ్లలో పెట్టి ఆడిపాడారు. అనంతరం సమీపంలోని చెరువుల్లో నిమజ్జనం చేశారు. ఈ వేడుకల్లో ఎంపీపీ పిల్లి శ్రీలతామహేశ్, ప్రజాప్రతినిధులు, మహిళలు పాల్గొన్నారు.
మండలంలోని బొమ్మకల్ గ్రామంలో మంగళవారం సద్దుల బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహించారు. గ్రామస్తులు తీరొక్క పూలతో బతుకమ్మలను అందంగా పేర్చారు. సాయంత్రం గ్రామ కూడళ్లలో బతుకమ్మలను పెట్టి మహిళలు, యువతులు, చిన్నారులు పాటలు పాడుతూ ఆడారు. కాగా, శివాజీనగర్‌లో జడ్పీటీసీ పురుమల్ల లలిత, కృష్ణనగర్‌లో ఎంపీటీసీ ర్యాకం లక్ష్మి బతుకమ్మ ఆడారు. అనంతరం బతుకమ్మలను మానేరు వాగులోకి తీసుకెళ్లి నిమజ్జనం చేశారు. కాగా, గోకుల కాలనీవాసులు మల్లన్న చెరువులో బతుకమ్మలను నిమజ్జనం చేశారు. ముత్తైదువులు ఒకరికొకరు వాయినాలు ఇచ్చిపుచ్చుకున్నారు. గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో బతుకమ్మ ఆడే ప్రదేశాలతో పాటు నిమజ్జన కేంద్రాల వద్ద లైటింగ్, మంచినీటి వసతి, తదితర సౌకర్యాలు కల్పించారు. సర్పంచ్ పురుమల్ల శ్రీనివాస్‌తో పాటు పాలకవర్గ సభ్యులు, పంచాయతీ అధికారులు, సిబ్బంది ఏర్పాట్లను పర్యవేక్షించారు. ప్రజలకు ఇబ్బందులు కలుగకుండా చర్యలు తీసుకున్నారు.
నగరంలోని విట్స్‌లో అధ్యాపకులు, విద్యార్థినులు బతుకమ్మ ఆడారు. కళాశాల అడిషనల్ డైరెక్టర్ గోవిందరావు, ప్రిన్సిపాల్ టీవీవీ సుధాకర్, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ సుధాకర్ రావు, డీన్ ప్రదీప్‌రావు, మేచినేని పవన్‌రావు, సుగుణాకర్, ప్రోగ్రాం ఇన్చార్జి మాధవి, నాంపెల్లి స్టాలిన్ పాల్గొన్నారు.