దమ్మన్నపేట ప్రభుత్వ పాఠశాల పునర్జీవం
ఉపాధ్యాయులు, గ్రామస్తుల చొరవతో..
ఊపిరిపోసిన ఆంగ్ల మాధ్యమ బోధన
కార్పొరేట్ స్కూల్‌కు దీటుగా నిర్వహణ
గ్రామంలో పిల్లలంతా సర్కార్ స్కూల్‌కే..
150 మందికి చేరిన విద్యార్థుల సంఖ్య
ధర్మపురి మండలంలోని దమ్మన్నపేట గ్రామంలో చాలా ఏండ్ల క్రితమే మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాల ఏర్పాటైంది. కొన్నేండ్లపాటు విద్యార్థులతో కళకళలాడిన పాఠశాల తర్వాత పరిస్థితి మారిపోయింది. కాలానుగుణంగా తల్లిదండ్రులు, విద్యార్థులు ఇంగ్లిష్ మీడియం వైపునకు వెళ్లడం, సర్కారు బడుల్లో నాటి ప్రభుత్వాలు వసతులు కల్పించకపోవడంతో అన్ని ప్రభుత్వ పాఠశాలల మాదిరిగానే దమ్మన్నపేట బడిపైనా ప్రభావం పడింది. విద్యార్థుల సంఖ్య వంద నుంచి పదుల సంఖ్యకు పడిపోయింది. దీంతో ఆ బడిని ప్రాథమిక పాఠశాల స్థాయికి కుదించేశారు. ఐదో తరగతి వరకే పరిమితం చేశారు. కేవలం 20మంది విద్యార్థులు మాత్రమే ఉన్నారు. అదే సమయంలో పాఠశాల ప్రధానోపాధ్యాయుడిగా బాధ్యతలు స్వీకరించిన గోవర్ధన్ బడిని బతికించాలని సంకల్పించారు. పాఠశాల విద్యాకమిటీ చైర్మన్, సభ్యులు, సర్పంచ్ ఇతర ప్రజాప్రతినిధులను సంప్రదించారు. గ్రామంలోని పాఠశాలలో విద్యార్థుల సంఖ్య ను పెంచేందుకు సహకరించాలని కోరారు.
వారి నుంచి స్పందన వచ్చింది. ప్రజాప్రతినిధులు, విద్యాకమిటీ సభ్యులు, ఉపాధ్యాయులు గ్రామంలోని ఇంటింటికీ వెళ్లి, ప్రైవేట్‌కు కాకుండా ప్రభుత్వ పాఠశాలకు పిల్లలను పంపాలని అభ్యర్థించారు. అయితే విద్యార్థుల తల్లిదండ్రులు, ఇంగ్లిష్ మీడియం లేకపోవడం ఇబ్బందికరంగా ఉందని, ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లిష్ మీడియం ఏర్పాటు చేస్తే బాగుంటుందని వారు పేర్కొన్నారు. దీంతో ప్రజాప్రతినిధులు, ఉపాధ్యాయులు అప్పటి ఉమ్మడి కరీంనగర్ డీఈవో శ్రీనివాసాచారిని కలిసి దమ్మన్నపేటలో ఇంగ్లిష్ మీడియంలో బోధనకు అవకాశం ఇవ్వాలని కోరారు. డీఈవో అవకాశం కల్పించడంతో పాఠశాలలో ఆంగ్లమాధ్యమాన్ని ప్రారంభించారు. ప్రాథమిక స్థాయిలో విద్యాభ్యాసం చేస్తున్న పిల్లలు ప్రైవేట్ స్కూళ్లకు వెళ్లకుండా ప్రజాప్రతినిధులు, విద్యాకమిటీ సభ్యులు కట్టడి చేశారు. ప్రభుత్వ బడికే పంపేలా తల్లిదండ్రులను ఒప్పించారు.
ముగ్గురు ప్రభుత్వ ఉపాధ్యాయులుండగా, మరో ఇద్దరు కేరళ దంపతులను వలంటీర్లుగా నియమించారు. వారికి వేతనాన్ని స్వయంగా విద్యాకమిటీ సభ్యులు, గ్రామస్తులు, ఉపాధ్యాయులు విరాళాల ద్వారా సేకరించి అందించారు. గ్రామానికి చెందిన ఓ యువకుడిని సైతం వలంటీర్‌గా నియమించారు. మొత్తం ఆరుగురు టీచర్లు ఆంగ్లమాధ్యమంలో బోధన మొదలుపెట్టారు. బడి రూపు రేఖలను సైతం మార్చివేశారు. ప్రహరీని నిర్మింపజేశారు. ప్రహరీపై రైమ్స్‌ను, రంగురంగుల బొమ్మలను వేయించారు. విద్యార్థులను ఆకర్షించేలా పాఠశాలకు రైలుబండి తరహాలో పెయింటింగ్ వేయించారు. విద్యార్థుల కోసం ప్రత్యేకంగా యూనిఫాం ఏర్పాటు చేశారు. దీంతో క్రమంగా విద్యార్థుల సంఖ్య పెరిగింది. ప్రస్తుతం గ్రామంలో 2,800 జనాభా ఉండగా, 1,957 మంది ఓటర్లు ఉన్నారు. 5 నుంచి 15 ఏళ్లలోపు పిల్లలు 260 మంది ఉండగా, అందులో 150 మంది విద్యార్థులు ప్రాథమిక పాఠశాలలో విద్యాభాస్యం చేస్తున్నారు. గ్రామంలో ప్రాథమిక విద్యను అభ్యసించే ప్రతి పిల్లాడు ప్రభుత్వ పాఠశాలలోనే చదువుతుండడం విశేషం.
రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు…
పాఠశాలకు తిరిగి జవసత్వాలు అందేలా చేసిన పాఠశాల ప్రధానోపాధ్యాయుడు గోవర్ధన్‌ను రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది. 2018లో ఆయనను రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయుడిగా ఎంపిక చేసి సన్మానించింది. ప్రభుత్వ అధికారులను ఒప్పించి ఇంగ్లిష్ మీడియాన్ని ప్రవేశపెట్టడం, విద్యాకమిటీ, ప్రజాప్రతినిధులను సమన్వయం చేసి, గ్రామస్తులను ఒప్పించి, ప్రైవేట్ నుంచి పిల్లలను ప్రభుత్వం వైపునకు విజయవంతంగా మళ్లించడంలో గోవర్ధన్ చేసిన కృషిన ప్రభుత్వం గుర్తించింది.
మనసుంటే మార్గం ఉంటుంది
మనసుంటే మార్గముంటుంది. దమ్మన్నపేట పాఠశాల ప్రధానోపాధ్యాయుడిగా బాధ్యతలు స్వీకరించిన సమయంలో పాఠశాల పరిస్థితి అధ్వానంగా ఉండేది. 20లోపు విద్యార్థులు ఉండేవారు. ఎలాగైనా పాఠశాలను బతికించుకోవాలనుకున్నాం. అప్పుడు ఉపాధ్యాయులు సహకరించారు. విద్యా కమిటీ చైర్మన్ గంగమల్లు, సభ్యులతో చర్చించాం. సర్పంచ్ పెంచాల తిరుపతిని కలిశాం. మిగిలిన ప్రజాప్రతినిధులను కలిశాం. అందరం కలిసి ఇంటింటికీ వెళ్లి ప్రభుత్వ పాఠశాలకు పిల్లలను పంపించాలని కోరాం. అందరు ఇంగ్లిష్ మీడియం కావాలన్నారు. డీఈవోను కలిసి ఇంగ్లిష్ మీడియం మంజూరు ఇవ్వమంటే ఇచ్చారు. గ్రామస్తులు, విద్యా కమిటీ సభ్యులు సహకరించారు.
విరాళాలు సేకరించి కేరళ టీచర్ల, మరో విద్యా వలంటీర్‌ను పెట్టుకున్నాం. సొంత డబ్బుతో ప్రహరీకి, బడికి రంగులు వేయించా. పిల్లలందరికీ టీచర్లమే యూనీఫార్మ్స్ కుట్టించాం. గ్రామస్తులు సహకరించారు. ప్రైవేట్ సంస్థలకు వెళ్లే ఆటోలు, బస్సులను రానివ్వకుండా చూశారు. మొత్తానికి బడి బతికింది. ఇప్పుడు 150 మంది విద్యార్థులు చేరారు. ప్రైవేట్ స్కూల్స్‌కు వెళ్లేవారు ఇప్పుడు దమ్మన్నపేటలో లేరు. రెండేండ్ల క్రితం అక్కడి నుంచి బదిలీ అయ్యాను. అయితే ఇంగ్లిష్ మీడియం ఏర్పాటు చేయడమే బడి బతికేందుకు కారణమైంది. మనసు ఉంటే మార్గం ఉంటుంది. నా శ్రమ వృథా పోలేదు. వందలాది మంది పిల్లలకు, వారి తల్లిదండ్రులకు ఆర్థిక భారం తగ్గింది. నాకు అవార్డు వచ్చింది.
– గోవర్ధన్, పూర్వ ప్రధానోపాధ్యాయుడు
ఇంగ్లిష్ మీడియమే రక్ష
ఇంగ్లిష్ మీడియమే మా బడికి శ్రీరామ రక్ష. రెండేండ్లుగా దమ్మన్నపేట పాఠశాల ప్రధానోపాధ్యాయురాలిగా పనిచేస్తున్నా. గ్రామస్తుల సహకారం గొప్పగా ఉంది. ప్రభుత్వ పాఠశాలపై నమ్మకం ఉంచారు. ఆంగ్ల మాధ్యమం ఏర్పాటు చేయడం, బడిని ఆహ్లాదకరంగా మార్చడంతో పరిస్థితి మారింది. పిల్లలు పెద్ద సంఖ్యలో పాఠశాలలో చేరారు. నలుగురు ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు. ప్రజాప్రతినిధుల సహకారం సైతం బాగుంది. దమ్మన్నపేట బడి బతికేందుకు ఇంగ్లిష్ మీడియమే కారణం. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం గొప్ప నిర్ణయం. ఇంగ్లిష్ మీడియం స్కూల్స్ ఏర్పాటు వల్ల ప్రభుత్వ పాఠశాలలకు పూర్వవైభవం వస్తుంది. సీఎం కేసీఆర్‌కు గొప్ప నిర్ణయం తీసుకున్నారు.
– విజయలక్ష్మి, ప్రస్తుత ప్రధానోపాధ్యాయురాలు