కార్పొరేషన్, ఏప్రిల్ 25: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ, బండి సంజయ్ చేస్తున్నది ప్రజాసంగ్రామ యాత్ర కాదని, అది వసూళ్ల యాత్ర అని టీఆర్ఎస్ నాయకుడు మెండి చంద్రశేఖర్ ఆరోపించారు. సోమవారం కరీంనగర్‌లోని రాష్ట్ర మంత్రి గంగుల కమలాకర్ మీ సేవ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. బండి సంజయ్ ప్రజాసంగ్రామ యాత్ర పేరిట రూ.10 కోట్లతో కొనుగోలు చేసిన లగ్జరీ బస్సులో తిరుగుతూ ఎక్కడా ప్రజలను కలుసుకోవడంలేదని విమర్శించారు. ప్రజాసంగ్రామ యాత్ర కోసం బండి బ్యాచ్ రూ.కోట్లలో వసూలు చేశారని ఆరోపించారు. ఎంపీగా ఎన్నికై మూడేళ్లయినా కరీంనగర్‌కు ఎలాంటి అభివృద్ధి చేయలేదని మండిపడ్డారు.
సొంత నియోజకవర్గానికి ఏమీ చేయని బండి చేపట్టిన యాత్రను ప్రజలు నమ్మే స్థితిలో లేరని పేర్కొన్నారు. హిందూయిజం పేరిట మతాల మధ్య చిచ్చుపెట్టే తాను సొంత నియోజకవర్గంలోని వేములవాడ, కొండగట్టు ఆలయాల అభివృద్ధికి కేంద్రం నుంచి నయా పైసా తెచ్చిన పాపాన పోలేదని విమర్శించారు. మంత్రిగా గంగుల కమలాకర్ చేస్తున్న ఆలయాల అభివృద్ధిని చూసి నేర్చుకోవాలని హితవు పలికారు. యువతను రెచ్చగొడుతూ.. వారిని కేసుల పాలు జేస్తూ రాజకీయ పబ్బం గడుపుకొంటున్నారని విమర్శించారు.
బీజేపీలో ఉన్న యువత, విద్యార్థులు ఇప్పటికైనా ఆయన ఉచ్చు నుంచి బయటకు రావాలని సూచించారు. తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ పథకాలను చూసి ఒర్వలేకే సీఎం కేసీఆర్‌పై అసత్య ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఇప్పటికైనా బండి సంజయ్ తీరు మారకుంటే రానున్న రోజుల్లో ప్రజలే తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు. సమావేశంలో కార్పొరేటర్ ఎదుర్ల రాజశేఖర్, టీఆర్ఎస్ నాయకులు పవన్, అర్ష మల్లేశం, గంట శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.