దంపతుల దారుణ హత్య
పొలం వద్దనే నరికి చంపిన దుండగులు
పాలకుర్తి మండలం రామారావుపల్లిలో సంచలనం
పాలకుర్తి, ఫిబ్రవరి24: భూవివాదం భార్యాభర్తల ప్రాణాలు బలిగొన్నది. దుండగులు పొలంవద్ద గల వ్యవసాయ బావి సమీపంలో దంపతులను పదునైన ఆయుధాలతో నరికిచంపారు. పెద్దపల్లి జిల్లా పాలకుర్తి మండలం రామారావుపల్లిలో జరిగిన ఈ దారుణ సంఘటన సంచలనం సృష్టించింది. పెద్దపల్లి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మంచినీళ్ల వెంకటి (52) అతడి సోదరుడు తిరుపతికి భూమి పంపకాల విషయంలో వివాదం ఉన్నది. తిరుపతి కొడుకు రవి సైతం భూమిలో వాటా అడుగుతున్నాడు. ఈ విషయంలో వెంకటి పలుమార్లు పోలీసులకు ఫిర్యాదు చేయడమే గాకుండా పెద్ద మనుషుల సమక్షంలో పంచాయతీలు జరిగాయి. అయినా సమస్య పరిష్కారం కాలేదు. ఈ క్రమంలో భార్య కనుకమ్మ (48)తో కలిసి వెంకటి గురువారం ఉదయం ఊరి శివారులోని పొలం వద్దకు వెళ్లారు. మధ్యాహ్నం వరకు కలుపుతీసి అక్కడే ఉన్న వ్యవసాయ బావి వద్ద గల గుడిసెలో భోజనం చేశారు. అప్పటికే మాటు వేసిన దుండగులు వెంకటిపై గొడ్డలితో దాడి చేస్తుండగా అడ్డుకునేందుకు వెళ్లిన భార్య కనుకమ్మను సైతం నరికిచంపారు. విషయం తెలుసుకున్న పెద్దపల్లి డీసీపీ రవీందర్, సీఐ ప్రదీప్, పాలకుర్తి ఠాణా ఎస్ఐ మహేందర్ హుటాహుటిన సంఘటనా స్థలానికి వెళ్లి మృతదేహాలను పరిశీలించారు. వెంకటిదంపతులకు వివాహతురాలైన కూతురు రాధ, కుమారుడు రమేశ్ ఉన్నారు. చిన్నాన్న తిరుపతి కుటుంబీకులే తమ తల్లిదండ్రులను హత్యచేశారని, మృతుల కుమారుడు మంచినీళ్ల రమేశ్ పోలీసులకు ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా, కనుకమ్మ 2001 నుంచి 2005 వరకు ఈసాలతక్కళ్లపల్లి, రామారావుపల్లి,కొత్తపల్లి గ్రామాలకు ఎంపీటీసీగా పనిచేసింది. వెంకటి కాంగ్రెస్పార్టీలో సుదీర్ఘ కాలం క్రియాశీలకంగా పనిచేశారు.