జమ్మికుంట, సెప్టెంబర్ 6 : హుజూరాబాద్ ఉప ఎన్నిక కోసం బీజేపీ నేత ఈటల రాజేందర్ గోడ గడియారాలు, గొడుగులు, బొట్టుబిళ్లలు వంటివి పంచుతూ ప్రజలను ప్రలోభాలకు గురి చేస్తున్నాడని, ఇదేనా ఆయన ఆత్మగౌరవం అంటూ మంత్రి కొప్పుల ఈశ్వర్ ప్రశ్నించారు. సోమవారం ఆయన జమ్మికుంట పట్టణంలో పర్యటించారు. ముందుగా ఆబాది జమ్మికుంటలో ముదిరాజ్ కులస్తులతో సమావేశమయ్యారు. అనంతరం జమ్మికుంట మున్సిపల్ పరిధిలోని కొత్తపల్లిలో మహిళా మోర్చా నాయకులు కేదారమ్మ, మాదాడి లక్ష్మి, దేవునూరి రాధ ఆధ్వర్యంలో బీజేపీకి చెందిన వంద మంది మహిళలు స్థానిక సాయిమేఘన ఫంక్షన్ హాల్లో మంత్రి సమక్షంలో చేరగా, వీరికి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా చోట్ల మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ముదిరాజ్, గంగపుత్రులకు సముచిత స్థానం కల్పించారని పేర్కొన్నారు. మిషన్ కాకతీయలో భాగంగా పూడిక తీత పనులు చేపట్టగా చెరువులు నిండుకుండలా మారాయన్నారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలి ఫలాలు అందుకున్నది ముదిరాజ్, గంగపుత్రులేనని చెప్పారు. ప్రతి చెరువులో ప్రభుత్వమే ఉచితంగా చేప పిల్లలను వదలి ఉపాధి కల్పిస్తున్నదని తెలిపారు. మత్స్యకారులకు వాహనాలు, వృత్తికి సంబంధించిన వస్తువులను అందించామని పేర్కొన్నారు. మత్స్యకారులు టీఆర్ఎస్ ప్రభుత్వానికే మద్దతు ఇవ్వాలని, పార్టీ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్‌ను గెలిపించాలని కోరారు. రాష్ట్రంలో రైతు సంక్షేమ పథకాలను అమలు చేస్తుండగా, కేంద్రం మాత్రం రైతు వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్నదని ఆరోపించారు. సీఎం కేసీఆర్ పాలన దేశానికే ఆదర్శమని పేర్కొన్నారు. నిరుపేదలందరికీ డబుల్ బెడ్రూంలను నిర్మించి ఇస్తామని హామీ ఇచ్చారు. మాజీ మంత్రి ముద్దసాని దామోదర్‌రెడ్డి విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు తనవంతుగా ప్రయత్నిస్తానని తెలిపారు. బీజేపీ నేత ఈటల రాజేందర్ గెలిచే అవకాశమే లేదని చెప్పారు. బండి సంజయ్ ఎంపీగా గెలిచి అభివృద్ధిని విస్మరించి, ప్రజలకు అందుబాటులో లేకుండా పోయారని ఆరోపించారు. ప్రజా సమస్యలను పట్టించుకోని బీజేపీ నేతకు ఓటేయవద్దన్నారు.
ఎవరి పార్టీ కోసం వాళ్లు పనిచేస్తరు
‘రాజకీయాల్లో హత్యలుండవు.. ఆత్మహత్యలే ఉంటయ్. వాళ్లు చేసిన తప్పులే వాళ్లకు శాపాలైతయ్. ఇది ఈటల రాజేందర్‌కు వర్తిస్తది. ఎందుకు పార్టీని వదిలినవ్. బీజేపీలో ఎందుకు చేరినవ్. ఎన్నికల్లో ఎవరి పార్టీ కోసం వాళ్లు పనిచేస్తరు.’ అని మంత్రి కొప్పుల స్పష్టం చేశారు. ‘పార్టీ ప్రజాప్రతినిధులను, నాయకులను, కార్యకర్తలను కాపాడుకుంటరు. ఎవరిని పడితే వారిపై ‘రా’ అంటూ సంస్కార హీనంగా మాట్లాడడం తగదు. దళిత ఎమ్మెల్యేను తిడుతవ్. దద్దమ్మ అంటవ్. మంత్రులను కట్టు బానిసలంటవా..? నీవు కూడా మంత్రిగా ఉన్నవు కదా.. అప్పుడేమైంది. ఏం సంస్కారం నీది. ఇది కరెక్టు కాదు. పద్ధతి మార్చుకో. నీ వ్యాఖ్యలన్నీ వెనక్కి తీసుకో.’ అంటూ డిమాండ్ చేశారు. 20 ఏళ్లు పార్టీలో కలిసి పనిచేసిన విషయాలను గుర్తుకు తెచ్చుకోవాలని, రాజకీయ భవిష్యత్‌ను అందించిన సీఎం కేసీఆర్‌ను, ఉద్యమ సహచరుడు హరీశ్‌రావును విమర్శించే స్థాయి కాదన్నారు. ‘కన్నెర్రజేస్తా.. అంటున్నాడు.. ఈయన కన్నెర్ర జేసే కదా.. పార్టీ నుంచి బయటకు వెళ్లింది. ఏడేళ్లుగా ఇక్కడ అభివృద్ధి ఎందుకు చేయలేదో చెప్పాలి’ అని డిమాండ్ చేశారు. సంక్షేమం, అభివృద్ధిని ఉద్యమంలా చేస్తున్న సీఎం కేసీఆర్ దేశానికి దిక్సూచిగా మారారని, బీజేపీ చెప్పుకోవడానికి ఏం చేసిందో చెప్పాలని డిమాండ్ చేశారు. బీజేపీలో ఈటల స్థానం ఎక్కడ? అని ప్రశ్నించారు. ఆయననెవరూ పట్టించుకోవడం లేదని, విలువలు తగ్గించుకొని మాట్లాడకూడదని హితవు పలికారు. ఆయన వెంట ఎవరున్నారో చెప్పాలని, ఒక్కడిగా వెళ్లి.. ఒక్కడిగానే మిగిలి పోవడం ఖాయమన్నారు. రాజకీయాల్లో తప్పుడు మాటలు మాట్లాడవద్దని, తప్పుడు నిర్ణయాలు తీసుకోవద్దని సూచించారు. ఇష్టానుసారంగా మాట్లాడితే ఊరుకునేది లేదని, సహనాన్ని పరీక్షించవద్దని హెచ్చరించారు.
మూడు వేల ఎకరాలు ఎలా సంపాదించావ్?- టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు కౌశిక్‌రెడ్డి
టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు పాడి కౌశిక్‌రెడ్డి మాట్లాడుతూ.. రాజకీయాల్లోకి రాకముందు కమలాపూర్‌లో 2ఎకరాలు మాత్రమే ఉన్న ఈటల రాజేందర్ 3వేల ఎకరాలు ఎలా సంపాదించాడో తెలుపాలని టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు పాడి కౌశిక్‌రెడ్డి డిమాండ్ చేశారు. ఈటల పేరిట 700ఎకరాలుండగా, మిగతావి బినామీల పేరిట ఉన్న విషయం తాను ఇప్పటికే ఆధారాలతో బయటపెట్టినట్లు చెప్పారు. అవినీతిపై చర్చకు వస్తే పెద్దమ్మతల్లి సాక్షిగా నిరూపించేందుకు తాను సిద్ధమని ఈటలకు సవాల్ విసిరారు. రేవంత్‌రెడ్డితో ఈటల కుమ్మక్కయ్యాడని ఆరోపించారు.
ఆశీర్వదిస్తే అందుబాటులో ఉండి సేవ చేస్తా- టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్‌యాదవ్
టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్‌యాదవ్ మాట్లాడుతూ.. ‘మీ కండ్ల ముందు తిరిగిన పేదింటి బిడ్డనని, ఆశీర్వదించి అసెంబ్లీకి పంపించాలని విజ్ఞప్తి చేశారు. అందరికీ అందుబాటులో ఉండి సేవ చేస్తానని చెప్పారు. తెలంగాణ ఉద్యమంలో జైలు జీవితం గడిపానని, తనపై 130 కేసులున్నాయని తెలిపారు. జమ్మికుంటలో రూ.50కోట్లతో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని, పనిచేసే ప్రభుత్వానికే ఓటేయాలని విజ్ఞప్తి చేశారు. తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ చిటికెన వేలు పట్టుకుని నడిచానని, తనను గెలిపిస్తే ఎల్లవేళలా అందుబాటులో ఉండి సేవ చేస్తానని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమాల్లో మున్సిపల్ చైర్మన్ రాజేశ్వర్‌రావు, టీఆర్ఎస్ అర్బన్ అధ్యక్షుడు టంగుటూరి రాజ్‌కుమార్, కౌన్సిలర్లు, శ్రీనివాస్, రమేశ్, నరేశ్, సుగుణ, నాయకులు రాజ్‌కుమార్, సత్యనారాయణరావు, సుధాకర్, భిక్షపతి, భద్రయ్య, మల్లయ్య, స్వామి, హరీశ్, శ్రీకాంత్‌రెడ్డి, రాజ్‌కుమార్, సదానందం, రమేశ్, శ్రీనివాస్, సమ్మిరెడ్డి, కశ్యప్‌రెడ్డి, సత్యనారాయణరావు, కోటి పాల్గొన్నారు.