గన్నేరువరం, సెప్టెంబర్ 20: గర్భిణులు, బాలింతలు పోషకాహారంపై అవగాహన పెంచుకోవాలని ఎంపీపీ లింగాల మల్లారెడ్డి సూచించారు. మండల పరిషత్ కార్యాలయంలో సోమవారం ఐసీడీఎస్ అధికారులు నిర్వహించిన పోషణ అభియాన్ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా గర్భిణులకు అధికారులు పోషకాహారంపై అవగాహన కల్పించారు. ఎంపీపీ మల్లారెడ్డి మాట్లాడుతూ, పోషకాహార ప్రాముఖ్యతను వివరించారు. పోషణ అభియాన్ కార్యక్రమంలో భాగంగా ఐసీడీఎస్ అధికారులు అందిస్తున్న సేవలను అభినందించారు. కార్యక్రమంలో వైస్ ఎంపీపీ న్యాత స్వప్నా సుధాకర్, సర్పంచ్ పుల్లెల లక్ష్మీ లక్ష్మణ్, ఎంపీడీవో స్వాతి, సీపీడీవో సబిత, సూపర్వైజర్ ఆండాలు, ఏపీఎం లావణ్య తదితరులు పాల్గొన్నారు.
సమతులాహారంతోనే సంపూర్ణ ఆరోగ్యం
అన్ని పోషకాలు ఉన్న సమతులాహారం తీసుకోవడం ద్వారా సంపూర్ణ ఆరోగ్యంగా జీవించవచ్చని ఐసీడీఎస్ సూపర్వైజర్ రాజశ్రీ తెలిపారు. నేషనల్ న్యూట్రిషన్ వీక్లో భాగంగా సోమవారం మండలంలోని కరీంపేట్ అంగన్వాడీ కేంద్రాల్లో ఐసీడీఎస్ ఆధ్వర్యంలో పోషకాహారంపై బాలింతలకు, గర్భిణులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. కూరగాయలు, ఆకుకూరలు, పండ్లలో విటమిన్లు ఎక్కువగా ఉంటాయని తెలిపారు. అలాగే అంగన్వాడీ కేంద్రాల్లో చిన్నారులతో పాటు గర్భిణులు, బాలింతలకు పాలు, గుడ్లు, బాలామృతం, తదితర పోషక విలువలు గల ఆహారం అందజేస్తున్నట్లు వెల్లడించారు. తక్కువ ఖర్చుతో ఎక్కువ పోషక విలువలు గల పాలు, గుడ్లు, పండ్లు, ఆకుకూరలు, కూరగాయలు, పల్లీలు, బెల్లం, నువ్వులు, తదితర ఆహార పదార్థాలపై అవగాహన కల్పించారు. కూరగాయాలు, ఆకుకూరలు, పండ్లు, తదితర పదార్థాలను ఆకర్శణీయంగా ప్రదర్శించారు. అలాగే గర్భిణులకు సీమంతం, చిన్నారులకు అన్నప్రాసన నిర్వహించారు. కార్యక్రమంలో సర్పంచ్ మల్లయ్య, ఎంపీటీసీ గాండ్ల తిరుపతయ్య, అంగన్వాడీ టీచర్ సుగుణ, గర్భిణులు, తల్లులు, చిన్నారులు పాల్గొన్నారు.