హుజూరాబాద్‌టౌన్, అక్టోబర్12: ‘పేదింటి బిడ్డ.. జనం కష్టాలు తెలిసిన వ్యక్తి గెల్లు శ్రీనివాస్ యాదవ్‌ను గెలిపించాలి. గెల్లుకు ఒకసారి అవకాశం ఇచ్చి ఆశీర్వదించాలని, మీ కష్టాలన్నీ తీరుతాయని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్ పేర్కొన్నారు. కారు గుర్తుకు ఓటేసి నియోజకవర్గ అభివృద్ధికి బాటలు వేసుకోవాలని సూచించారు. మంగళవారం హుజూరాబాద్ పట్టణంలోని 22వ వార్డులోని కాకతీయకాలనీలో ప్రచారం చేశారు. డోర్ టూ డోర్ తిరిగి గెల్లు శ్రీనివాస్ తరపున కరపత్రాలు పంపిణీ చేశారు. టీఆర్ఎస్కే ఓటేయాలని కోరారు. అనంతరం మాట్లాడారు. రాష్ట్ర ప్రజల దశాబ్దాల కలను సాకారం చేసి తెలంగాణను తెచ్చిన సీఎం కేసీఆర్, అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెడుతూ ప్రజల గుండెల్లో స్థానం సంపాదించుకున్నారని కొనియాడారు. ఇన్నేండ్ల పాలనలో ఈటల ఏనాడూ హుజూరాబాద్ పట్టణాభివృద్ధిని పట్టించుకోలేదని మండిపడ్డారు. సీఎం కేసీఆర్ చొరవతో మూడు నెలలుగా జరుగుతున్న అభివృద్ధి పనులతో పట్టణ రూపురేఖలే మారిపోయాయని, అభివృద్ధిని, సంక్షేమాన్ని కోరుకునే ప్రజలు గెల్లు కారు గుర్తుకు ఓటేసి గెలిపించాలని కోరారు. కాగా గెల్లు శ్రీనివాస్‌ను మాజీ మున్సిపల్ చైర్మన్ వడ్లూరి విజయ్‌కుమార్, వినోద్‌కుమార్ శాలువాతో సత్కరించారు. ఆయన వెంట ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్, టీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి గెల్లు శ్రీనివాస్‌యాదవ్, మాజీ మున్సిపల్ చైర్మన్ వడ్లూరి విజయ్‌కుమార్, టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు కొలిపాక శ్రీనివాస్, నాయకులు బీఎస్ ఇమ్రాన్, వీ హనుమంత్‌గౌడ్, చంధాగాంధీ, సోషల్ మీడియా ఇన్చార్జి గొడిశాల పావనిగౌడ్, తొగరు భిక్షపతి ఉన్నారు.