రేకుర్తి జాతర ప్రదేశంలో చెత్తాచెదారం, వ్యర్థాలను శుభ్రం చేసిన సిబ్బంది
కార్పొరేషన్, ఫిబ్రవరి 23: నగరంలో పారిశుధ్యంపై నగరపాలక సంస్థ అధికారులు ప్రత్యేక దృష్టిసారించారు. రోడ్లు, ఇతర ప్రదేశాల్లో చెత్తాచెదారం లేకుండా నిత్యం శుభ్రం చేస్తున్నారు. ఈ క్రమంలో రేకుర్తిలో జరిగిన సమ్మక్క-సారలమ్మ గద్దెల ప్రదేశంలో జాతర సాగిన నాలుగు రోజులతో పాటు అనంతరం చెత్తాచెదారం, ఇతర సామగ్రిని తొలగించే విషయంలో ప్రత్యేక చర్యలు చేపట్టారు. జాతర ప్రాంతంలో పరిశుభ్రత కోసం ముందు నుంచే బల్దియా అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు. జాతర జరిగిన నాలుగు రోజుల పాటు మూడు షిఫ్టుల్లో 120 మంది కార్మికులను పారిశుధ్య పనుల కోసం వినియోగించారు. అలాగే, జాతర ముగిసిన తర్వాత కూడా గద్దెలను శుభ్రం చేయడంతో పాటు పరిసర ప్రాంతాల్లో క్లీనింగ్ కోసం 100 మందికి పైగా కార్మికులను కేటాయించి పనులు చేపట్టారు. జాతరలో భక్తులకు ఇబ్బందులు లేకుండా చూడడంతో పాటు జాతర అనంతరం స్థానికంగా ఉండే ఇండ్ల యజమానులకు కూడా సమస్యలు రాకుండా పారిశుధ్య పనులు చేపట్టారు.
జాతర ప్రాంతంలో పరిశుభ్రత
రేకుర్తి సమ్మక్క జాతర ప్రదేశంలో బల్దియా ప్రత్యేక దృష్టిసారించి క్లీనింగ్ పనులు చేపట్టారు. జాతర అనంతరం రెండు రోజుల పాటు గద్దెలను శుభ్రం చేయడంతో పాటు చుట్టూ ఉన్న ప్రాంతంలో బ్లీచింగ్ పౌడర్ చల్లి, చెత్తాచెదారం, ప్లాస్టిక్ వేస్ట్‌ను ట్రాక్టర్లలో తరలించారు. గద్దెల ప్రాంతంలో బెల్లం, కొబ్బరి ముక్కలతో అపరిశుభ్రంగా మారగా… పారిశుధ్య కార్మికులను కేటాయించి బ్లీచింగ్ వేసి గద్దెలను క్లీన్ చేయడంతో పాటు నీటితో కడిగారు. జాతరకు వచ్చిన భక్తులు కాకతీయ కాల్వ వెంట, ఇతర ప్రాంతాల్లో వేసిన చెత్తను, ప్లాస్టిక్ వేస్ట్‌ను, జంతువుల వ్యర్థాలను ట్రాక్టర్ల ద్వారా తరలించారు. ఆయా ప్రాంతాల్లో దోమలు, క్రిములు వృద్ధి చెందకుండా బ్లీచింగ్ పౌడర్‌తో పాటు రసాయాలను స్ప్రే చేయించారు. పారిశుధ్య పనులను శానిటేషన్ సూపర్వైజర్ రాజమనోహర్తో పాటు ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ దగ్గర ఉండి చేయించారు.