ఇల్లందకుంట రూరల్, అక్టోబర్ 12 : బీజేపీ నేత ఈటల రాజేందర్ ఝూటా మాటలు మాట్లాడుతున్నాడని, గ్యాస్ సిలిండర్ ధరపై అబద్ధాలు ప్రచారం చేస్తున్నాడని మంత్రి తన్నీరు హరీశ్‌రావు ధ్వజమెత్తారు. గ్యాస్ బండ ధరలో రూ.291 రాష్ట్ర పన్ను ఉందంటున్నాడని మండిపడ్డారు. ఇది నిజమైతే చర్చకు వస్తావా అని, జమ్మికుంట గాంధీ బొమ్మకాడికి రమ్మంటవా… హుజూరాబాద్ అంబేదర్ బొమ్మకాడికి రమ్మంటవా..? అని నిలదీశారు. నిరూపిస్తే రాజీనామా చేస్తానని, లేకుంటే పోటీ నుంచి తప్పుకోవాలని సవాల్ విసిరారు. హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండలం పెంచికల్పేట్లో మంగళవారం ఆర్ఎంపీ, పీఎంపీలు ఆత్మీయ సమావేశం, వడ్డెరలు ఆశీర్వాద సభ వేర్వేరుగా నిర్వహించారు. ఈ కార్యక్రమాలకు ముఖ్య అతిథిగా హాజరై మంత్రి హరీశ్‌రావు మాట్లాడారు. రెండున్నరేండ్లు టీఆర్ఎస్ అధికారంలో ఉంటుందని, కేసీఆరే ముఖ్యమంత్రిగా ఉంటారని చెప్పారు. ఇలాంటప్పుడు ప్రతిపక్ష ఎమ్మెల్యేతో అభివృద్ధి జరుగుతుందా? అని ప్రశ్నించారు.
ప్రతి మంత్రికి ఐదేళ్లక్రితం నాలుగు వేల ఇండ్లు మంజూరు చేశారని, అంతటా మంత్రులు ఇళ్లు కట్టించారని, కానీ ఈటల ఒక ఇల్లూ కట్టించలేదని మండిపడ్డారు. నువ్వు నాలుగు వేల ఇండ్లు కట్టించుంటే 12 వేల మంది ఆత్మగౌరవం నిలబడేదన్నారు. కల్యాణలక్ష్మి, రైతు బంధు పరిగె ఏరుకున్నట్లు అని అహంకారంగా మాట్లాడుతున్నాని, పేదలకు మేలు చేసే పథకాలను ఇలా మాట్లాడడం సరికాదని హితవు పలికారు. రైతుబంధు కింద పది లక్షలా యాభై వేలు తీసుకొని, ఇప్పుడు బయటకి వెళ్లి కల్యాణ లక్ష్మి పనికి రాదంటున్నాడని, ఇదేం నీతని ప్రశ్నించారు. బీజేపీ పెట్రోల్, డిజీల్, గ్యాస్ ధర పెంచిందని, రోడ్లు, ఎల్ఐసీ, రైళ్లు, విమానాశ్రయాలు అమ్ముతామని, కుదువ పెడుతామని అంటున్నాని మండిపడ్డారు. విదేశాల్లోంచి నల్ల ధనం వెనక్కి తెప్పిస్తామని, ప్రతి అకౌంట్లో 15 లక్షలు వేస్తామని చెప్పారని, కానీ ఇంతవరకు ఒక్కటీ చేయలేదన్నారు. గ్యాస్ ధర వెయి రూపాయలకు పెంచి, సబ్సిడీ 250 నుంచి 40 రూపాయలకు తగ్గించారని ధ్వజమెత్తారు. బీజేపోళ్లు గోబెల్స్ ప్రచారం చేస్తున్నారని, వారి మాటలను నమ్మద్దని ప్రజలకు సూచించారు. ఈ నెల 30న గ్యాస్‌బండకు దండం పెట్టుకొని పోలింగ్ కేంద్రాలకు రావాలని, కారు గుర్తుకు ఓటేసి గెల్లును గెలిపించాలని పిలుపునిచ్చారు.
మీకు అండగా ఉంటం..
గ్రామీణ వైద్యులతో 20 ఏండ్ల అనుబంధముందని, ఉద్యమంలో కలిసి పని చేశామని, చాలా జిల్లాల్లో మీతో మంచి సాన్నిహిత్యం ఉన్నదని గుర్తుచేశారు. ఆపద సమయంలో రిస్ తీసుకుని ప్రాణం కాపాడే ప్రయత్నం చేస్తున్నారని కొనియాడారు. టీఆర్ఎస్ అధికారంలో వచ్చిన తొలి నాళ్లలో ట్రైనింగ్, సర్టిఫికెట్స్ ఇవ్వాలని ఆలోచించి బడ్జెట్లో నిధులు కూడా పెట్టామని చెప్పారు. వేధింపులు లేకుండా మీ సేవలు వాడుకుంటామని, కరీంనగర్లో సమస్యవస్తే కొప్పుల ఈశ్వర్ నిలబడి కాపాడారని చెప్పా రు. ఆర్ఎంపీల కోసం 15 ఏళ్ల కిందటే సిద్దిపేటలో మంచి భవనం నిర్మించామని, మెడికల్ కాలేజీ వస్తే కొత్త స్థలంలో 40 లక్షలతో కొత్తం భవనం కట్టిస్తానని చెప్పారు. ఆరోగ్య శాఖ మంత్రిగా పనిచేసిన ఈటల ఒక భవనం అయినా నిర్మించారా ప్రశ్నించారు. గెల్లు గెలిస్తే మీ సేవలో ఉంటామని, కోడ్ ముగిశాక గ్రామీణ వైద్యులకు రక్షణ కలిగేలా, శిక్షణ ఇచ్చేలా పూర్తి సహకారం అందిస్తామని చెప్పారు.
గెల్లు సీనును దీవించండి..
హుజూరాబాద్ అభివృద్ధి కోసం గెల్లు సీనును గెలిపించాలని పిలుపునిచ్చారు. పేదల ఇండ్లు కట్టే బాధ్యత తనదని, ఇక్కడి భవనాలు పూర్తి చేయిస్తానని హామీ ఇచ్చారు. జరగాల్సినంత అభివృద్ధి హూజూరాబాద్, జమ్మికుంటలో జరగలేదని, ఈ మూడు నెలల్లో ఎంత పని జరిగిందో మీరే చూడాలని ప్రజలకు సూచించారు.
కారుతో గుద్దింది బండి సన్నిహితుడు..
కమలాపూర్ లో కారు – ఆటో ఆక్సిడెంట్ అయింది. డ్రైవర్ చనిపోయిండు. కానీ, బాల సుమన్ కారుతో గుద్ది చంపిండు అని ప్రచారం చేసిన్రు. తర్వాత సుమన్ తమ్ముడు అన్నరు. తర్వాత కారులో డబ్బులు ఉన్నయ్. టీఆర్ఎస్ లీడర్ తాగి డ్రైవర్‌ను గుద్దాడని మొత్తుకున్నరు. కానీ, సీసీ టీవీ ఫుటేజి తీస్తే అసలు విషయం వెలుగు చూసింది. ఆకారుతో గుద్దింది బండి సంజయ్ సన్నిహితుడు. ఇట్ల బీజేపోళ్లు బట్టకాల్చి మీదేస్తున్నరు. వాళ్ల మాటలను నమ్మద్దు. సోషల్ మీడియా ద్వారా కూడా లేనిది ఉన్నట్లు, ఉన్నది లేనట్లు చూపిస్తున్నరు.
మీ కోసం ఏం చేసిండు..
ఆర్ఎంపీలు, పీఎంపీలు లేకుండా పల్లెలు లేవు. 24 గంటలు అందుబాటులో ఉండేది మీరే. ప్రజలకు ఏ ఆరోగ్య సమస్య ఉన్నా వచ్చేది మీ దగ్గరికే. అది మీపై నమ్మకంతోనే. మీ సేవలు ఎంతో గొప్పవి. ప్రభుత్వం మీ శిక్షణకు, రక్షణకు సహకారం అందిస్తుంది. కానీ, ఆరోగ్య శాఖ మంత్రిగా ఈటల మీకు ఏం చేసిండు? కనీసం మీకోసం ఒక్క భవనమైనా కట్టించిండా? మీకే కాదు, ఎవరికీ ఏం చేయలె. పేదలకు ఒక్క ఇల్లు కట్టియ్యలె. అలాంటి ఈటల మనకొద్దు. మీకు అండగా మేమున్నం. ఈటల రాజేందర్ సతీమణి జమున రూ.వంద కోట్లు ఖర్చు చేసైనా గెలుస్తామని అనడం దేనికి సంకేతమో అర్థం చేసుకోవాలి. మీరంతా న్యాయంవైపు ఉండండి. నన్ను గెలిపించండి.
నాకు తిండి పెట్టింది వడ్డెరలే
వడ్డెరులంటే నాకు గౌరవం ఉంది. వారిని సముచితంగా గౌరవిస్త. నిరుపేదలైన వారికి డబుల్ బెడ్రూం ఇండ్లు నిర్మిస్త. ఉద్యమ సమయంలో హాస్టళ్లను బంద్ చేస్తే పక్కనే ఉన్న వడ్డెరులు మమ్మల్ని అక్కున చేర్చుకొని తిండి పెట్టారు. వడ్డెరులు చెక్కిన రాయితోనే గడీలు, కోటలు, చెరువు కట్టలు తయారైనయ్. నేను చదువుకున్న ఉస్మానియా యూనివర్సిటీని కూడా వడ్డెరులు చెక్కిన రాళ్లతోనే నిర్మించారు.