కరీంనగర్, సెప్టెంబర్ 7 (నమస్తే తెలంగాణ): జిల్లాలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న వివిధ అభివృద్ధి, సంక్షేమ పథకాల ప్రగతి సమాచారం ఎప్పటికప్పుడు అందించాలని కలెక్టర్ ఆర్వీ కర్ణన్ అధికారులను ఆదేశించారు. మంగళవారం సంబంధిత శాఖల అధికారులతో సమావేశమైన కలెక్టర్ ఈ నెల 10లోగా అన్ని శాఖల నివేదికలు అందించాలన్నారు. సంక్షేమ పథకాల ప్రగతిని అంచనా వేసేందుకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అధ్యక్షతన వివిధ శాఖల అధికారులతో సమీక్ష ఉంటుందని ఆయన తెలిపారు. ప్రతి నెలా రెండో, నాలుగో సోమవారం సంబంధిత శాఖలతో జిల్లా కేంద్రంలో సమావేశం నిర్వహిస్తామని, ఈ నేపథ్యంలో ప్రతి నెలా 10లోగా సంబంధిత శాఖల నివేదికలను ఆన్లైన్లో అప్లోడ్ చేయాలని అధికారులను ఆదేశించారు. సమాచారం మండలాల వారీగా ఉండాలని చెప్పారు. వెబ్ పోర్టల్లో అప్లోడ్ చేసేందుకు ప్రతి శాఖకు ఒక అధికారిని నియమించాలన్నారు. ఆయా శాఖల నివేదికలు ముఖ్యప్రణాళికా అధికారి ద్వారా పంపించాలని తెలిపారు. ఆరోగ్యం, పౌష్టికాహారం, విద్య, వ్యవసాయం, నైపుణ్యాభివృద్ధి, కనీస మౌలిక వసతులు తదితర అంశాలపై ముఖ్య ప్రణాళికాధికారి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆయా శాఖల అధికారులకు అవగాహన కల్పించారు. జిల్లా స్థాయిలో సంబంధిత శాఖల అధికారులతో కలెక్టర్ స్టీరింగ్ కమిటీని ఏర్పాటు చేశారు. సమీక్షా సమావేశంలో అదనపు కలెక్టర్ (లోకల్బాడీస్) గరిమా అగర్వాల్, ముఖ్యప్రణాళికాధికారి డీ కొమురయ్య, జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ జువేరియ, డీఆర్డీవో శ్రీలతా రెడ్డి, డీపీఆర్ ఈఆర్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు..