బల్దియాలకు బడ్జెట్లో నిధులిచ్చిన ఘనత కేసీఆర్ సర్కారుదే
రాష్ట్ర మంత్రి కొప్పుల ఈశ్వర్
జగిత్యాలలో సమీకృత మార్కెట్‌కు శంకుస్థాపన
జగిత్యాల, ఫిభ్రవరి 19, (నమస్తే తెలంగాణ ): పట్టణాల సమగ్రాభివద్ధే టీఆర్ఎస్ సర్కారు లక్ష్యమని రాష్ట్ర సాంఘిక, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఉద్ఘాటించారు. బల్దియాలకు బడ్జెట్లో నిధులు కేటాయించిన ఘనత కేసీఆర్ సర్కారుకే దక్కుతుందని పేర్కొన్నారు. జగిత్యాల వ్యవసాయ మార్కెట్ యార్డులో రూ.4 కోట్లతో నిర్మించనున్న సమీకృత మార్కెట్ పనులకు మంత్రి శనివారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్ జగిత్యాలను జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేయడంతోనే ఆశించిన ప్రగతి సాధ్యమైందని చెప్పారు. జగిత్యాల, కోరుట్ల, మెట్పల్లి పట్టణాల అభివృద్ధికి రూ. 50 కోట్ల చొప్పున నిధులు మంజూరుకాగా, రాయికల్, ధర్మపురి లాంటి చిన్న పట్టణాలకు సైతం విరివిగా నిధులు వస్తున్నాయన్నారు. సీఎం కేసీఆర్ ఆలోచన మేరకు జగిత్యాలలో రూ. 4 కోట్ల అంచనాలతో సమీకృత మార్కెట్‌ను నిర్మించడం సంతోషంగా ఉందన్నారు. ఇతర పనులకు సైతం నిధుల మంజూరుకు కృషి చేస్తానని చెప్పారు. ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్‌కుమార్ మాట్లాడుతూ, జగిత్యాల శరవేగంగా అభివృద్ధి చెందుతుంటే కొందరికీ కనిపించడం లేదన్నారు. మంత్రి కేటీఆర్ కృషితో జగిత్యాలకు రూ.50 కోట్లు మంజూరయ్యాయని పేర్కొన్నారు.
రూ.10 కోట్లతో క్యాంపులో వాటర్ ట్యాంక్ నిర్మించుకున్నామని. 1200 కిలోమీటర్ల పొడువునా రోడ్లు వేసుకున్నామన్నారు. 4500 ఇండ్లతో దక్షిణ భారతదేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన హౌసింగ్ ప్రాజెక్టును జగిత్యాలలో పూర్తి చేసుకుంటు న్నామన్నారు. పట్టణ ప్రగతిలో 2వేల కరెంట్ స్తంభాలను ఏర్పాటు చేసుకున్నామన్నారు. రూ. 95 లక్షలతో సీసీ రోడ్లు నిర్మించుకున్నామన్నారు. రూ. 3.20 కోట్లతో బైపాస్ రోడ్డు ఆధునీకరణ పనులు, మెడికల్ కాలేజీ మంజూరైందన్నారు. జగిత్యాలకు మరిన్ని నిధులివ్వాలని మంత్రిని ఎమ్మెల్యే కోరారు. పంచాయితీరాజ్ రోడ్లను మంజూరు చేయించాలన్నారు. వ్యవసాయ మార్కెట్ యార్డు స్థలంలో సమీకృత కూరగాయల మార్కెట్ నిర్మాణం చేపడుతున్న నేపథ్యంలో చల్గల్లోని వ్యవసాయ మార్కెట్ యార్డు వద్ద మరో పదెకరాల స్థలాన్ని కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. అలాగే చిరుధాన్యాల విక్రయానికి చల్గల్లోని మార్కెట్ యార్డులో రూ.1.50 కోట్లతో షెడ్లు, సీసీ ఏర్పాటు చేసేందుకు సహకరించాలన్నారు. ఇందులో జగిత్యాల జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ డాక్టర్ గొల్లపల్లి చంద్రశేఖర్ గౌడ్, మున్సిపల్ చైర్పర్సన్ డాక్టర్ బోగ శ్రావణి, అదనపు కలెక్టర్ బీఎస్ లత, జగిత్యాల ఆర్డీవో మాధురి, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ కొలుగూరి దామోదర్‌రావు, మున్సిపల్ వైస్ చైర్మన్ గోలి శ్రీనివాస్, కౌన్సిలర్లు సమిండ్ల వాణి, అవారి శివ కేసరి బాబు, కమిషనర్ స్వరూపారాణి పాల్గొన్నారు.