ధర్మపురి, మార్చి 15: మహిమాన్విత స్వయంభూ ధర్మపురి దివ్యక్షేత్రంలో బ్రహ్మోత్సవాల్లో భాగంగా నిర్వహించే కల్యాణోత్సవం మంగళవారం కనుల పండువలా సాగింది. ముందుగా శ్రీ లక్ష్మీనారసింహ(యోగ, ఉగ్ర), శ్రీ వేంకటేశ్వరస్వామి ఉత్సవమూర్తులను శేషప్ప కళావేదికకు చేర్చి పట్టు వస్ర్తాలు, బంగారు, ముత్యాల ఆభరణాలు, వివిధ రకాల పూలతో అలంకరించిన కల్యాణ వేదికపై అధిష్టింపజేశారు. గోధూళి సముహూర్తాన స్వామి, అమ్మవార్లకు పట్టువస్ర్తాలు, ముత్యాల తలంబ్రాలను జగిత్యాల కలెక్టర్ రవి సతీసమేతంగా అర్చక, రుత్విక బృందం సమక్షంలో అందించారు. అలాగే మంత్రి కొప్పుల ఈశ్వర్ సతీమణి స్నేహలత స్వామివారికి పట్టువస్ర్తాలు సమర్పిచారు. అనంతరం వేదపండితులు సంప్రదాయరీతిలో విశ్వక్సేన ఆరాధనలతో కల్యాణతంతు ఆరంభించారు. స్వామికి రక్షాబంధనం, యజ్ఞోపవీతధారణ పర్వాలను నిర్వహించారు. అనంతరం వేదమంత్రాలు, మంగళవాయిద్యాలు, భక్తజనుల జయజయధ్వానాలు, గోవిందనామస్మరణల మధ్య నారసింహుడు అమ్మవారి మెడలో మాంగళ్యధారణ చేశారు. ఈ సందర్భంగా ‘జయలక్ష్మీ నారసింహ జయజయ నారసింహ’ స్మరణతో ఆలయ ప్రాంగణం మార్మోగింది. కల్యాణాన్ని యజ్ఞాచార్యులు కందాళై పురుషోత్తమాచార్య ఆధ్వర్యంలో నిర్వహించారు.