కరీంనగర్, మే 6 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఒకప్పుడు రైతులు ఎదుర్కొన్న కరెంటు కష్టాలను తెలంగాణ ప్రభుత్వం దూరం చేసింది. మెరుగైన విద్యుత్ సరఫరా చేసేందుకు తీవ్రంగా శ్రమించి వ్యవస్థను బలోపేతం చేసింది. అంతర్గత లోపాలను సరిచేసింది. పడిపోయిన స్తంభాలను, లూజు వైర్లను సరిచేయించింది. తుప్పు పట్టిన ట్రాన్స్ఫార్మర్లను తొలగించి వోల్టేజీకి సరిపడా కొత్తవి వేయించింది. అవసరానికి అనుగుణంగా కొత్త సబ్స్టేషన్లను నిర్మించి రెప్పపాటు కూడా కరంటు స్లిప్ కాకుండా ఏర్పాట్లు చేసింది. రైతులకు 24 గంటల విద్యుత్ సరఫరా చేసేందుకు ప్రత్యేక ప్రణాళికను రూపొందించి విజయవంతంగా అమలు చేస్తుండడంతో రైతాంగం బంగారు పంటలు పండిస్తోంది.
సమైక్య రాష్ట్రంలో చీకట్లు
తెలంగాణ రాక మునుపు ఉమ్మడి జిల్లా పరిస్థితులు చాలా దారుణంగా ఉండేవి. వ్యవసాయం అంటేనే రైతులు భయపడాల్సిన దుస్థితి ఉండేది. సాగునీటికి ఒక్క శ్రీరాంసాగర్ ప్రాజెక్టు మాత్రమే ఆధారంగా ఉండేది. దానిపై బాబ్లీ ప్రాజెక్టు కట్టడంతో ఆ ఎస్సారెస్పీ ఉనికి ప్రశ్నార్థకంగా మారింది. ఫలితంగా ఉమ్మడి జిల్లాలో కాకతీయ కాలువ కింద జీరో టూ 146 కిలోమీటర్ వరకు ఎబో ఎల్ఎండీ పరిధిలో 4,62,920 ఎకరాలు.. 146 నుంచి 284 కిలోమీటర్ బిలో ఎల్ఎండీ పరిధిలో 5,05,720 ఎకరాలకు.. మొత్తం 9.68 లక్షల ఎకరాలకు నీళ్లు ఇవ్వాలని ఉన్నా.. ఎస్సారెస్పీ చరిత్రలో ఏనాడూ 5 లక్షల ఎకరాలకు మించి సాగునీరిచ్చిన దాఖలాలు లేవు. అలాగే, ఆనాడు 2.90 లక్షల వ్యవసాయ పంపుసెట్లు ఉండేవి. కానీ, మోటర్లు ఏనాడూ ఐదు గంటల పాటు నిరంతరాయంగా నడిచిన పాపాన పోలేదు. అది కూడా కరెంట్ ఎప్పుడుండేదో.. ఎప్పుడు పోయేదో తెలియని పరిస్థితి. పగలూ రాత్రీ అన్నతేడా లేకుండా అన్నదాతలు రాత్రంతా మోటర్ల వద్ద నిరీక్షించాల్సి వచ్చేది. వచ్చిన కొద్ది సమయంలో ఆఫ్ కరెంటే ఉండేది. దాంతో మోటర్లు కాలిపోయేవి. తద్వారా రైతులు వేయి నుంచి రెండు వేల రూపాయల వరకు వెచ్చించాల్సి వచ్చేది. సగటున ఏడాదిలో సగానికిపైగా మోటర్లు కాలిపోయేవి. అప్పట్లో ఊరికో మోటర్ మోకానిక్ ఉండేది.
ఆనాడు ఏటా ఏప్రిల్‌లో 350 మిలియన్ యూనిట్ల డిమాండ్ ఉంటే.. ఏనాడూ అది పూర్తిగా సరఫరా కాలేదు. ఇటు ఎండకాలానికి ముందే ప్రాజెక్టులు, చెరువులు, కుంటలు అడుగంటేవి. భూగర్భజలాలు పాతాళంలో దర్శనమిచ్చేవి. బోర్లు వేయి మీటర్లు వేసినా చుక్కనీరు పడేది కాదు. ఒక్కో రైతు ఏడు నుంచి పది బోర్లు వేసినా ఫలితముండేది కాదు. అప్పులు పెరిగి ఆత్మహత్యలే దిక్కయ్యేవి. ఒక్క మాటలో చెప్పాలంటే చూడ సక్కని భూములున్నా నీళ్లు లేక ఎడారిని తలపించేవి. యాసంగి, వానకాలం రెండు పంటలు కలిపి చూసినా.. నాడు 7 నుంచి 8 లక్షల ఎకరాలకు మించి సాగైన దాఖలాలు లేవు. ఉమ్మడి జిల్లాలో 56 మండలాలుంటే.. 44కు పైగా మండలాలు కరువు ప్రాంతాల జాబితాలో కనిపించేవి. ఎకరాల కొద్దీ భూములున్నా సాగుకు నీటి వసతి లేక లక్షలాది మంది రైతులు, యువకులు బతుకు దెరువు కోసం గల్ఫ్‌దేశాలకు వెళ్లారు. ఇలా చెప్పుకుంటూ పోతే.. సమైక్య రాష్ట్రంలో వ్యవసాయరంగం కుదేలవ్వడమే కాదు, అన్నదాతల అవస్థలు అనంతంగా ఉండేవి.
స్వరాష్ట్రంలో నిరంతరం
ఉద్యమ సమయంలో తెలంగాణ ప్రజల కష్టాలను గుర్తించడమే కాదు, రాష్ర్టాన్ని సాధిస్తే ఏ రంగాన్ని ఎలా ముందుకు తీసుకెళ్లాలన్న ఒక ప్రణాళికతో సీఎం కేసీఆర్ ముందుకు సాగారు. ఆ దిశగానే ఒక్కో సమస్యను అధిగమించారు. ప్రధానంగా వ్యవసాయరంగంపై దృష్టి సారించి, అన్నదాతల కష్టాలను ఒక్కొక్కటిగా తీరుస్తున్నారు. కరెంట్ పరిస్థితిని బాగా మెరుగుపరిచారు. నాడు సమైక్య రాష్ట్రంలో కరెంట్ ఉంటే వార్త అయితే.. నేడు పోతే వార్త అన్నట్లుగా మార్చారు. సాగుకు ఎలాంటి ఇబ్బందుల్లేకుండా 24 గంటల పాటు ఉచితంగా నాణ్యమైన విద్యుత్ సరఫరా చేస్తున్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 2017 జూలై నుంచే ప్రయోగాత్మకంగా శ్రీకారం చుట్టగా, 2018 జనవరి ఒకటో తేదీ నుంచి రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభించారు. ప్రస్తుతం నాలుగు జిల్లాల్లో వ్యవసాయ పంపుసెట్ల సంఖ్య 3.90 లక్షలకు చేరుకోగా, డిమాండ్ ప్రస్తుత ఏప్రిల్‌లో 606.718 మిలియన్ యూనిట్లకు చేరింది.
అయినా రెప్పపాటు కరెంటు కోతల్లేవు. ఆఫ్ కరెంట్ ముచ్చట అసలే లేదు. అర్ధరాత్రి పడిగాపులు గాయాల్సిన దుస్థితి అంతకన్నా లేదు. 33/11 కేవీ సబ్స్టేషన్లు 42, అలాగే 150కి పైగా కొత్త సబ్స్టేషన్లు, అవసరానికి అనుగుణంగా 132/33 కేవీ సబ్స్టేషన్లు, 220 కేవీ సబ్స్టేషన్లు ఉండగా, వ్యవసాయ రంగానికి పూర్వం 805 ఫీడర్ల ద్వారా విద్యుత్ సరఫరా కాగా, ఇప్పుడు 1800కు చేరుకున్నది. అలాగే, 60 వేల పైచిలుకు ట్రాన్స్ఫార్మర్లు సామర్థ్యం పెంపు, దాదాపు రూ.వేయికోట్లతో ఉమ్మడి జిల్లాలో విద్యుత్ రంగం మెరుగుపడింది. ఫలితంగా డిమాండ్ ఎంత పెరుగుతున్నా అంతరాయం లేకుండా సరఫరా అవుతున్నది. నాణ్యమైన విద్యుత్ సరఫరా వల్ల మోటర్లు కాలిపోయే పరిస్థితి లేదు. మోకానిక్లు కొత్త ఉపాధివైపు మళ్లారు. ప్రభుత్వం పకడ్బందీ చర్యలు తీసుకోవడం వల్లే.. 24 గంటల విద్యుత్ సరఫరా ఇవ్వడం సాధ్యమవుతున్నది.
పండుగలా ఎవుసం..
ముఖ్యమంత్రి కేసీఆర్ ఆది నుంచీ వ్యవసాయంరంగానికి ప్రాధాన్యత ఇచ్చారు. మేడిగడ్డ నుంచి మొదలు కొని.. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎగువమానేరు వరకు గోదావరి జలాలను పారించి ఉమ్మడి జిల్లాలో ఒక జలప్రపంచాన్నే సృష్టించారు. కాళేశ్వరం ఎత్తిపోతల పథకం, ఎస్సారెస్పీ పునర్జీవ పథకం, శ్రీ రాజరాజేశ్వర జలాయం, వేయికోట్లతో కాకతీయ కాలువ మరమ్మతు పనులు, 800లకుపైగా చెరువుల పునరుద్ధరణ, కాకతీయ కాలువ చరిత్రలో 90 రోజుల పాటు నిరంతర నీటి విడుదల ఈ తరహా చర్యల వల్లభూగర్భజలాలు అమాతం పెరిగాయి. బోర్ల మోతలు తగ్గాయి. ఇటు సీజన్ ప్రారంభంలో రైతుబంధు కింద పెట్టుబడి సాయం వస్తున్నది. ఎరువులు, విత్తనాలు సకాలంలో అందుతున్నాయి. పుష్కలంగా నీళ్లు, ఫుల్ కరెంట్ ఉండడంతో ఎవుసం పండుగలా మారింది. ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకున్న చర్యల వల్ల.. ఉమ్మడి జిల్లాలో వ్యవసాయ సాగు 55 శాతానికిపైగా శాశ్వతంగా పెరిగింది. సమైక్య రాష్ట్రంలో అంటే 2014కు ముందు.. ఎగువ, దిగువ ఎల్ఎండీతోపాటు ఇతర వ్యవసాయ బావుల కింద రెండు సీజన్లలో కలిపి 7 నుంచి 8 లక్షల ఎకరాలు సాగైన దాఖలాలు లేవు. కానీ, మూడు నాలుగేళ్లుగా సేద్యం గణనీయంగా పెరిగింది.
2021 యాసంగి, వానకాలం కలిపి చూస్తే.. 18.5 లక్షల ఎకరాల్లో సాగు జరిగింది. అలాగే, ప్రస్తుత యాసంగిలో 7,53 లక్షల ఎకరాల్లో వరి వేశారు. ఇతర పంటలన్నీ కలిపి మరో లక్షకుపైగా ఎకరాల్లో ఉంటాయి. అలాగే, ఒకనాడు పూర్తిగా మెట్టప్రాంతమైన రాజన్న సిరిసిల్ల జిల్లా నేడు సస్యశ్యామలంగా మారింది. గోదావరి జలాలతో మధ్యమానేరు వాటర్హబ్లా మారడమే కాదు, ఎగువమానేరు మండుటెండల్లోనూ భరోసా ఇస్తున్నది. చెరువులు, కుంటలు నిండుకుండల్లా మారాయి. తద్వారా సాగుకు నీరందడమే కాదు.. భూగర్భజలాలు భారీగా పెరుగుతున్నాయి. ఇటు వ్యవసాయ పంపుసెట్లు నిరంతరం నడుస్తున్నాయి. ఎస్సారెస్పీ పునర్జీవంతో మొత్తం 2 లక్షలకు పైగా ఎకరాల్లో సాగు పెరిగింది.
చెరువుల కింద 1.25 లక్షల ఎకరాల సాగవుతున్నది. ఇలా ఎటుచూసినా.. సమైక్య రాష్ట్రంలో దుమ్మురేగిన భూములు నేడు ధాన్యపు సిరులతో కళకళలాడుతున్నాయి. వ్యవసాయరంగం పెరగడానికి కావాల్సినంత నీరివ్వడం ఒక ఎత్తయితే.. అందుకు తగిన విధంగా విద్యుత్ సరఫరా ఉండడం మరో ఎత్తు. ఈ రెండు వరంలా మారడంతో రైతులు సంతోషంగా ఉన్నారు. నిరందిగా ఎవుసం చేస్తున్నారు. నాడు చుక్క నీరందక బీడుగా ఉన్న భూముల్లో నేడు మంచి దిగుబడులు తీస్తున్నారు. ఇదంతా కేసీఆర్ వల్లే సాధ్యమైందని చెబుతున్నారు. దండుగ అన్న ఎవుసాన్ని పండుగలా మార్చారని సంబురపడుతున్నారు. మొన్న కూడా కేంద్రం చేతులెత్తేస్తే సీఎం కేసీఆరే ధాన్యం కొంటామని భరోసా ఇచ్చారని గుర్తు చేస్తున్నారు.
బాయికాడ జాగారం చేసిన..
ఆంధ్రోళ్ల పాలన ఉన్నప్పుడు అయిదారు గంటల కరెంట్ ఉండేది. పొలానికి నీళ్లుపెట్టేందుకు తెల్లందాకా పోవాల్సివచ్చేది. గంటగంటకూ కరెంట్ పోతుండే. బాయిగడ్డమీదనే జాగారం చేయాల్సివచ్చేది. నెలకోసారి మోటర్లు కాలిపోతుండే. రిపేరుకు నాలుగైదువేల ఖర్చయ్యేది. కానీ తెలంగాణ అచ్చినంక కరెంట్ కష్టాలు తప్పినయ్. మన సర్కారు 24 గంటలు ఉచితంగానే ఇస్తున్నది. ఇప్పుడు రందిలేకుంట పంటలు పండించుకుంటున్నం. రైతుల మేలును గోరుతున్న ముఖ్యమంత్రి కేసీఆర్ సారుకు కృతజ్ఞతలు.
– పొన్నం రాములు, నారాయణపూర్ (గంగాధర)
కరెంట్‌లేక అరిగోసపడేది..
గంగాధర కరువు ప్రాంతం. ఎండకాలం వచ్చిదంటే సాగు, తాగునీటికి తిప్పలు పడేది. చేన్లకాడ ఉన్న బాయిలళ్ల అడుగుంటిపోయేది. పొలానికి పెట్టుకుందామంటే కరెంట్ ఉండకపోయేది. రాత్రింబవళ్లు పొలాలకాడనే ఉండేది. చీకట్ల పురుగుపుట్రతోని భయపడేది. తెలంగాణ వచ్చినంక రాత్రింబవళ్లు ఫుల్లు కరెంట్ వస్తున్నది. చీకట్ల పొలాలకాడికి పోయే బాధ తప్పింది. ఈ ప్రభుత్వం రైతులకు అంతా మంచిజేత్తున్నది.
– సామంతుల శ్రీనివాస్,గంగాధర(గంగాధర)
రైతులు మోటర్లు తెస్తలేరు..
నేను ఇరువై ఏండ్లుగా మోటర్ వైండింగ్ చేస్తున్న. ఎప్పుడు జూసినా లోవోల్టేజీ కరెంటే ఉండేది. 2014కు ముందు ఎండకాలంల రైతులు రోజుకూ రెండు, మూడు మోటర్లు రిపేరుకు తెస్తుండే. తిండితిప్పలు మాని పనిజేసేది. టైంకు ఇవ్వకుంటే రైతులు లొల్లిజేసేది. తెలంగాణ సర్కారు వచ్చినంగా 24 గంటల నాణ్యమైన కరెంటు ఇస్తుండటంతో మోటార్లు కాలిపోవుడు తక్కువైంది. ఇప్పుడు వారానికి ఒక్కడికూడా వత్తలేదు. గిరాకీగూడ తక్కువైంది. ఇప్పుడు కూలర్లు, ఫ్రీజ్‌లు రిపేర్ చేస్తున్న.
– కొట్టే ఆంజనేయులు, గంగాధర(గంగాధర)
ఎవుసం సాఫీగా సాగుతున్నది.
ఆంధ్రోళ్ల పాలనలో రైతులకు అన్నీ కష్టాలే. చాలా మంది రైతులు భూములను అమ్ముకుని పట్టణాలకు వెళ్లి కూలీ పనులు చేసుకున్నారు. కొత్త రాష్ట్రం ఏర్పడినంక సీఎం కేసీఆర్ మొదట ఎవుసం, రైతుల గురించి ఆలోచన చేసిండు. గతంలో దండుగ అనుకున్న ఎవుసం ఇప్పుడు పండగైంది. అందుకే సాన మంది ఎవుసం భూములు కొనుక్కుంటున్నారు. పెద్దపెద్దోళ్లు పంటలు పండిస్తున్నరు. ఇప్పుడు రైతులు సంతోషంగా ఉన్నరు.
– కలకొండ చినరాజిరెడ్డి, రైతు, కొలనూర్ (ఓదెల)
24 గంటల త్రీఫేస్ కరెంట్..
నేను 2009లో కొలనూర్ విద్యుత్ సబ్ స్టేషన్లో ఆపరేటర్‌గా నియామకమైన. అప్పుడు వ్యవసాయానికి రాత్రి వేళ 9 గంటలు త్రీఫేజ్ కరెంట్ ఇస్తుండే. సబ్‌స్టేషన్ మీ ద లోడ్‌పడి ఊరికే కరెంట్ ట్రిప్ అవుతుండే. ఊరోళ్లందరూ ఒక్కటే ఫోన్ చేసేది. రైతులు సబ్స్టేషన్కాడికొచ్చి లొల్లిజేసేది. తెలంగాణ రాష్ట్రం వచ్చినంక అలాంటి పరిస్థితులు లేవు. ప్రభుత్వం 24 గంటల నాణ్యమైన కరెంట్ ఇస్తున్నది.
– పర్శ శ్రీనివాస్, సబ్ స్టేషన్ ఆపరేటర్, కొలనూర్ (ఓదెల)
కరంట్ గోసలు పోయినయ్..
తెలంగాణ రాక ముందు కరంట్ రాక గోసపడేది. ఎవుసం చేయడానికి చెప్పలేని బాధలు పడ్డం. అప్పుడు అర్దరాత్రి 9 గంటలే కరంట్ ఇచ్చేది. ఆ చీకట్ల విష పురుగులు, పాముల భయం కారణంగా బిక్కుబిక్కుమంటూ చేన్లకు పోయేది. ఇంట్లో వాళ్లు మేం వచ్చేదాకా ఎదిరి చూసేది. తెలంగాణ అచ్చినంక సీఎం కేసీఆర్ రైతులకోసం మంచిజేత్తున్నడు. 24 గంటలు కరంట్ అట్టిగనే ఇత్తండు. కరంట్ మోటర్లు కాలిపోవుడు లేదు. పంటలు ఎండిపోవుడు లేదు.
– మామిడిశెట్టి శంకరయ్య, రైతు, కొలనూర్ (ఓదెల)
మూన్నెళ్లకోసారి కాలిపోయేది..
ఉమ్మడి రాష్ట్రంలో కరెంట్ సమస్య తీవ్రంగా ఉండేది. లోవోల్టేజీతో రైతులు సతమతమయ్యేది. మూడునెలల కోసారి మోటర్లు కాలిపోయేవి. వాటిని రిపేరు చేయించి తీసువచ్చేలోపే పంటలు ఎండిపోయేది. రిపేరుకు మూడు, నాలుగు వేలు ఖర్చుపెట్టాల్సి వచ్చేది. రాష్ట్రం వచ్చినంక కరెంట్‌కు రందిలేకుంట పోయింది. 24 గంటలు ఉంటున్నది. ప్రభుత్వం ముందుచూపుతోనే రైతాంగానికి మేలు జరిగింది. ఎవుసానికి మంచిజేత్తున్న ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు.
– పెద్ద రాజు, రైతు, కుమ్మరిపెల్లి (రాయికల్)
మా ఇల్లు ఆగమైంది
మాది కొత్తపల్లి మండల కేంద్రం. మా నాన్న కొత్త సత్తయ్య 2012లో కరెంట్ షాక్‌తో చనిపోయిండు. అప్పుడు వచ్చీ రానీ కరెంట్ కోసం రాత్రంతా బావి వద్దనే పడిగాపులు పడి బావి కాడనే మోటర్‌పై ప్రాణాలు వదలిండు. నాన్న పోయినంక మా ఇల్లు ఆగమైంది. అప్పుడు నేను డిగ్రీ ఫస్టియర్. చదువు మధ్యల్నే ఆపేసి వ్యవసాయం చేసిన. ఇప్పుడు ఓ ప్రింటింగ్ ప్రెస్‌లో పని చేసుకుంటూనే వ్యవసాయం చేస్తున్న. తమ్ముడు కూడా ఇంటర్ దాకా చదివి ఇంటి పరిస్థితి మంచిగ లేక మధ్యలోనే ఆపేసిండు. అమ్మతో కలిసి ఇద్దరం కష్టపడి చెల్లె పెండ్లి చేసినం. అమ్మ ఎవుసం చేసుకుంటూనే కూలీ పనులకు వెళ్తది. నాన్న పొలంకాడ కరెంట్ షాక్‌తో చనిపోతే అప్పటి ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. పైగా మా నాన్నదే తప్పని అప్పటి అధికారులు అన్నరు. ఆయన బతికుంటే నన్ను, తమ్మున్ని, చెల్లెను బాగా చదివించెటోడు. ఆయన లేని లోటు మాకు స్పష్టంగా కనిపిస్తంది. మా నాన్నలెక్కనే ఎంతో మంది అప్పుడు రాత్రి కరెంటుకు బలైపోయిన్రు. అప్పుడే తెలంగాణ ప్రభుత్వం ఉండి ఉంటే ఇలా జరగకపోయేది.
– కొత్త మనోహర్, కొత్తపల్లి (కరీంనగర్)
రాత్రి కరెంట్‌తో ప్రాణం పోయింది..
రాష్ట్రం రాకముందు కరెంట్ ఎప్పుడచ్చేదో..ఎప్పుడుపోయేదో తెలిసేదికాదు. ఇక రైతుల పరిస్థితి దారుణంగా ఉండేది. వ్యవసాయానికి రాత్రిపూటే కరెంట్ ఇచ్చేవారు. అదికూడా నాలుగైదు గంటలే ఉండేది. రైతులకు కంటిమీద కునుకు ఉండకపోయేది. ఇదే ఊరుకు చెందిన మా మామ భూమారెడ్డి 28 ఏండ్ల కిందట రాత్రిపూట మోటర్ పెట్టేందుకు వెళ్లి షాక్గొట్టి చనిపోయిండు. ఇప్పుడు తెలంగాణల రాత్రి, పగలు తేడాలేకుండా కరెంట్ వస్తున్నది. రైతులకు రందిలేకుండపోయింది.
– కాశిరెడ్డి శేఖర్‌రెడ్డి, రైతు, అమ్మక్కపేట
కష్టాలు తప్పినయ్
తెలంగాణ రాష్ట్రం ఏర్పడి సీఎం కేసీఆర్ అయినంక రైతుల కరెంట్ కష్టాలు తప్పినయ్. గతంలో కరెంట్ ఎప్పుడు అత్తదో, ఎప్పుడు పోతదో తెలియకపోయేది. రాత్రి కరెంట్ ఇచ్చిన సమయంలో కరెంట్ మోటార్ల కాడికి పోయి, షాక్‌కు గురై ఎంతో మంది రైతులు చనిపోయిన్రు..నేడు 24గంటల కరెంట్‌తో పంటలకు నీళ్లు పుష్కలంగా అందుతున్నయ్. అనుకున్న సమయానికి పొలం దగ్గరికి పోయి పొలం పారిచ్చికుంటున్నం.
– బూసి సదాశివరెడ్డి. రైతు,మల్యాల (కాల్వశ్రీరాంపూర్)