కరీంనగర్, అక్టోబర్ 17 (నమస్తే తెలంగాణ ప్రతినిధి):‘చెప్పేవి శ్రీరంగ నీతులు.. చేసేవి దొంగ పనులు’ అన్న సామెత కొంత మంది కాషాయ నేతలకు సరిగ్గా సరిపోతుంది. మునుగోడు ఉప ఎన్నికల్లో పంపిణీ చేయడానికి కోటి నగదును తరలిస్తూ బీజేపీ మహిళా మోర్చా కరీంనగర్ జిల్లా అధ్యక్షురాలు, 13వ డివిజన్ కార్పొరేటర్ చొప్పరి జయశ్రీ భర్త చొప్పరి వేణు సోమవారం పోలీసులకు అడ్డంగా దొరకడం ఆ పార్టీ బండారాన్ని బట్టబయలు చేసింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌కు అత్యంత సన్నిహితుడైన వేణు పట్టుబడడంతో ‘కమలం’లో కలకలం రేపుతున్నది. అసలు వేణుకు ఇంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందన్న దానిపై అనుమానాలు వ్యక్తమవుతుండగా, పోలీసుల విచారణ కొనసాగుతున్నది. ‘మేం ఒక్క పైసా పంచం’ అంటూ నీతి మాటలు చెప్పే బీజేపీ నాయకులు ఇప్పుడేం సమాధానం చెబుతారన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. అక్కడ టీఆర్ఎస్ (బీఆర్ఎస్) విజయం ఖాయమని తెలుస్తుండగా, ఎలాగైనా గెలువాలనే లక్ష్యంతోనే ఇలా కమల నేతలు అడ్డదారులు తొక్కుతున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
నల్గొండ జిల్లా మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో ఉప ఎన్నిక కాకరేపుతున్నది. అక్కడ టీఆర్ఎస్ (బీఆర్ఎస్) దూసుకుపోతుండగా, మిగతా పార్టీలకు వణుకు మొదలైంది. ఏ వర్గాన్ని కదిలించినా ‘కేసీఆర్‌కే జై’ అనే మాట వినిపిస్తుండగా, ప్రతిపక్షాలకు గుబులు పుడుతున్నది. ‘కారు’ గెలుపు ఖాయంగా కనిపిస్తుండగా, ఇతర నేతలు కొత్త కుట్రలకు తెరతీస్తున్నట్లు తెలుస్తున్న ది. ఎలాగైనా గెలువాలనే లక్ష్యంతో అడ్డదారులు తొక్కుతున్నారనే విమర్శలు ఇప్పటికే వస్తున్నా యి. డబ్బులు పంచి ఓట్లు దండుకోవాలనే భ్ర మలో ఈ నియోజకవర్గానికి భారీగా డబ్బుల సంచులు తరలిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో కరీంనగర్‌లోని 13వ డివిజన్‌కు చెందిన బీజేపీ కార్పొరేటర్ జయశ్రీ భర్త చొప్పరి వేణు సోమవారం కోటి నగదుతో పట్టుబడడం ఆరోపణలకు బలం చేకూరుస్తున్నది. మునుగోడు ఉప ఎన్నిక నేపథ్యంలో నియోజకవర్గంలో పోలీసులు ఎక్కడికక్కడ బందోబస్తు ఏర్పా టు చేశారు. సోమవారం మునుగోడు పోలీస్‌స్టేషన్ పరిధిలో చల్మెడ క్రాస్ రోడ్డు చెక్‌పోస్ట్ వద్ద వా హన తనిఖీలు చేశారు. ఈ సమయంలో టాటా సఫారీ (టీఎస్ 02 ఎఫ్హెచ్ 2425) కారును తనిఖీ చేస్తుండగా, కోటి రూపాయల నగదును తరలిస్తున్నట్లుగా గుర్తించి ఆ మొత్తాన్ని స్వాధీనం చేసుకున్నారు. ప్రాథమిక విచారణ మేరకు కరీంనగర్‌కు చెందిన 13వ డివిజన్ బీజేపీ కార్పొరేటర్ చొప్పరి జయశ్రీ భర్త చొప్పరి వేణుగా గుర్తించారు. బీజేపీకి చెందిన మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి ఆదేశాల మేరకు విజయవాడకు చెందిన రాము వద్ద నుంచి ఈ డబ్బును తీసుకొచ్చినట్లుగా సమాచారం ఇచ్చారని పోలీసులు తెలిపారు. ఈ విషయంలో లోకల్ పోలీస్ అధికారులు లోతుగా విచారణ చేస్తూనే, పట్టుబడ్డ నగదును ఆదాయ పన్ను శాఖకు అప్పగించారు.
ఎవరిదీ డబ్బు?
చొప్పరి వేణుకు ఈ డబ్బు ఎవరిచ్చారన్న చర్చ ప్రస్తుతం జోరుగా నడుస్తున్నది. నిజానికి వేణుకు వివేక్‌తో అంత సాన్నిహిత్యం లేదు. కానీ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కి, అలాగే బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌కు సన్నిహితుడు. అం దులోనూ ఈటలకు అత్యంత సన్నిహితుడు అనే ముద్ర ఉన్నది. హుజూరాబాద్ ఉప ఎన్నికల సమయంలో కార్పొరేటర్ చొప్పరి జయశ్రీతోపాటు వేణు ప్రచారం చేశారు. ప్రస్తుత ప్రాథమిక విచారణలో మాత్రం వివేక్ ఆదేశాల మేరకు డబ్బు తీసుకెళ్తున్నట్టుగా వేణు చెప్పినట్లు పోలీసులు తమ ప్రకటనలో వెల్లడించారు. సన్నిహితంగా లేని వివేక్ వేణుకు డబ్బులు ఇచ్చారా..? లేక అత్యంత సన్నిహితంగా ఉండే ఈటల రాజేందర్ ఇచ్చారా..? అన్నది తేలాల్సి ఉన్నది. కాగా, సోషల్‌మీడియా లో మాత్రం దీనికి భిన్నంగా చర్చ నడుస్తున్నది. పోలీసుల తనిఖీలో పట్టుబడిన వాహనం హైదరాబాద్ నుంచే బయలుదేరిందని, డబ్బులు హైదరాబాద్‌లోనే సమకూర్చారని, ఈ తంతు తరచుగా జరుగుతుందన్న విమర్శలు వస్తున్నాయి.
‘కాషాయం’లో కలకలం
ఇన్నాళ్లూ నీతి కథలు చెబుతూ వస్తున్న కాషాయ పార్టీ నేతలకు ఈ వ్యవహారం జీర్ణం కావడం లేదు. రూ.కోటి నగదుతో రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడడం, అందులోనూ ఎన్నికల సమయం కావ డం, బీజేపీ మహిళా మోర్చా జిల్లా అధ్యక్షురాలు భర్త కావడం వంటివి కలకలం రేపుతున్నాయి. ఇన్నాళ్లూ అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీలు డబ్బులు పంచుతున్నాయంటూ ఊదరగొట్టే ప్రచారాలతో ప్రజలను నమ్మిస్తూ వచ్చిన బీజేపీ నాయకులు ఇప్పడేం సమాధానం చెబుతారన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. అలాగే, ఉమ్మడి జిల్లాలో ఎదురయ్యే ప్రశ్నలకు ఏం సమాధానం చెబుతామనే భయం ఆ పార్టీ నేతల్లో కనిపిస్తున్నది. మొత్తంగా కాషాయ పార్టీ అసలు రంగు బయటపడిందనే విమర్శలు వెల్లువెత్తుతుండడం ఆ పార్టీలో కలకలం రేపుతున్నది.