కరీంనగర్, సెప్టెంబర్ 20 (నమస్తే తెలంగాణ): దళితబంధు పథకం అమలు విషయంలో దుష్ప్రచారాన్ని నమ్మవద్దని, అర్హులందరికీ వర్తింపజేస్తామని మంత్రి హరీశ్‌రావు స్పష్టం చేశారు. సోమవారం కరీంనగర్ కలెక్టర్‌లో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. దళితబంధు కింద వచ్చే రూ.10 లక్షలతో ఒక్కొక్కరు నాలుగు యూనిట్లు ఏర్పాటు చేసుకోవచ్చన్నారు. దళితబంధు ఖాతాలు తెరిచేటపుడు పొరపాట్లు జరుగకుండా చూసుకోవాలని బ్యాంకర్లను ఆదేశించారు. 65 ఏండ్లలోపు ఉన్న ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులకు దళితబంధు డబ్బులు అందుతాయన్నారు. పైలెట్ ప్రాజెక్టుగా చేపట్టిన హుజూరాబాద్ నియోజకవర్గంలో ఇప్పటి వరకు డబ్బులు అందని దళిత కుటుంబాలకు మూడు రోజుల్లోగా వారి ఖాతాలో నగదు జమ చేయాలని మంత్రి కలెక్టర్‌ను ఆదేశించారు. లబ్ధిదారులు యూనిట్లు స్థాపించుకునేంత వరకు ఖాతాలో నిల్వ ఉండే నగదుకు బ్యాంకులు వడ్డీ ఇస్తాయని తెలిపారు. బ్యాంకుల్లో హెల్ప్ డెస్‌లు ఏర్పాటు చేసి స్కీం విధివిధానాలపై లబ్ధిదారులకు అవగాహన కల్పించాలని నిర్దేశించారు. నగదు జమచేసిన రెండురోజుల్లో వారి సెల్ఫోన్లకు మెస్సేజ్‌లు పంపాలని బ్యాంకర్లను ఆదేశించారు.
నియోజకవర్గంలోని ఏడు మండలాల్లో మంగళవారం పర్యటించి దళితబంధు రాని వారి వివరాలు సేకరించి, క్రాస్ చెక్ చేసి నగదు జమ చేయాలని సూచించారు. రేషన్ కార్డు లేని వారి నుంచి ఆధార్ నంబర్ తీసుకొని, రేషన్ కార్డు ఏ ప్రాంతంలో ఉందో తనిఖీ చేసుకొని నగదు అందించాలని ఆదేశించారు. లబ్ధిదారులతో గురువారం విడుతల వారీగా టెలీ కాన్ఫరెన్సు నిర్వహించాలని, అందులో తనతో పాటు సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్, కరీంనగర్, హన్మకొండ కలెక్టర్లు, క్లస్టర్ అధికారులు పాల్గొంటామని మంత్రి తెలిపారు. అనంతరం మంత్రులు కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్‌తో కలిసి హుజూరాబాద్ నియోజకవర్గంలోని మండలాల క్లస్టర్ అధికారుల నుంచి దళితబంధు అమలు తీరును అడిగి తెలుసుకున్నారు. కలెక్టర్ ఆర్వీ కర్ణన్ మాట్లాడుతూ ఈ నెల 21న నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో అధికారులతో దళితబంధు రాని వారి వివరాలు సేకరించి, అర్హులైన వారికి వెంటనే డబ్బులు జమ చేస్తామని తెలిపారు. లబ్ధిదారుల సెల్ ఫోన్లకు సంక్షిప్త సందేశం పంపిస్తామన్నారు. డెయిరీ యూనిట్లు స్థాపించుకునే వారికి శిక్షణ ఇప్పిస్తామని మంత్రులకు వివరించారు. ఈ సమీక్షా సమావేశంలో ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్, ఎమ్మెల్యేలు సుంకె రవిశంకర్, సుదర్శన్‌రెడ్డి, నన్నపనేని నరేందర్, జిల్లా పరిషత్ చైర్పర్సన్ కనుమల్ల విజయ, ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్, హన్మకొండ కలెక్టర్ రాజీవ్ హన్మంతు, అదనపు కలెక్టర్లు జీవీ శ్యాం ప్రసాద్ లాల్, గరిమా అగర్వాల్, హన్మకొండ అదనపు కలెక్టర్ సంధ్యారాణి, జెడ్పీ సీఈవో ప్రియాంక, హుజూరాబాద్ ఆర్డీవో రవీందర్‌రెడ్డి, నగర మేయర్ వై సునీల్ రావు, క్లస్టర్ అధికారులు, బ్యాంకర్లు, తదితరులు పాల్గొన్నారు.