హుజూరాబాద్, ఆగస్టు 30: దళితబంధు సర్వే హుజూరాబాద్ నియోజకవర్గ వ్యాప్తంగా నాలుగోరోజు సోమవారం పండుగ వాతావరాణంలో కొనసాగింది. అధికారయంత్రాంగం ఇంటింటికీ వెళ్లి లబ్ధిదారుల నుంచి సమగ్ర వివరాలు సేకరిస్తున్నది. హుజూరాబాద్ పట్టణంలోని 16, 29, 13వ వార్డులతో పాటు మండలంలోని మాందాడిపల్లి, తుమ్మనపల్లి, వెంకట్రావుపల్లి, పోతిరెడ్డిపేట గ్రామాల్లో అధికారులు సర్వే నిర్వహించారు. జమ్మికుంట పట్టణంలోని 5, 2, 10, 14, 13, 21వ వార్డులతో పాటు మండలంలోని మాచనపల్లి, శాయంపేట, వెంకటేశ్వర్లపల్లి, మడిపల్లి గ్రామాల్లో సర్వే చేశారు. వీణవంక మండలకేంద్రంతో పాటు బేతిగల్, ఘన్ముక్ల, వల్భాపూర్, మామిడాలపల్లి, బొంతుపల్లి, పోతిరెడ్డిపల్లి, చల్లూరు, రెడ్డిపల్లిలో సర్వే కొనసాగింది. ఇల్లందకుంట మండలకేంద్రంతో పాటు గడ్డివానిపల్లి, మర్రివానిపల్లి, శ్రీరాములపల్లి, బుజూనూర్ గ్రామాల్లో సర్వే జరగగా, మండలకేంద్రంలో జడ్పీ చైర్ పర్సన్ విజయ, కలెక్టర్ కర్ణన్, ఆర్డీవో సర్వే తీరును పరిశీలించారు. ఇంటింటికీ తిరుగుతూ దళిత బంధు లబ్ధిదారులతో సంభాషించారు. ఇల్లందకుంట మండల కేంద్రంలోని మేకమల్ల ప్రమీల ఇంటిలో కలెక్టర్‌తో పాటు ట్రైనీ కలెక్టర్ మయాంక్ మిట్టల్, ఆర్డీవో రవీందర్‌రెడ్డి, తహసీల్దార్ సురేఖ భోజనం చేశారు. జమ్మికుంట మండలంలోని వెంకటేశ్వర్లపల్లి అనుబంధ గ్రామమైన గోవిందాపూర్‌లో నిర్వహించిన సర్వేలో అదనపు కలెక్టర్ శ్యాంప్రసాద్‌లాల్ బృందాలకు తగు సూచనలు అందించారు. వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. కమలలాపూర్ మండలంలోని అన్ని గ్రామాల్లో సర్వే కొనసాగింది.
బృందాలకు ఘనస్వాగతం
సర్వే కోసం వచ్చిన బృందాలకు దళిత వాడల్లో ఘనస్వాగతం లభించింది. వీణవంక మండలం చల్లూర్ గ్రామంలో డప్పుచప్పుళ్లతో అధికారులకు సాదరస్వాగతం పలికారు. శాయంపేటలో సర్పంచ్ అకినపల్లి సుజాత, దళితుల ఆధ్వర్యంలో అధికారులకు డప్పుచప్పుళ్లతో ఘనస్వాగతం పలికారు. గ్రామ కూడలిలో సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేసి జై తెలంగాణ, జై కేసీఆర్ అంటూ నినదించారు.
దళితుల జీవితాల్లో వెలుగులు
గ్రామంలో దొరికిన పని చేసుకుంట కుటుంబాన్ని పోషిస్తున్న. మాలాంటి పేదోళ్ల కోసం దళితబంధు తెచ్చుడు మంచిదే. అధికారులు సర్వే కోసం మా ఇంటికి వచ్చిన్రు. సాయం అందుతదని నమ్మకమచ్చింది. దళితబంధు పథకం మా దళితుల జీవితాల్లో వెలుగులు నింపుతది. మేము టీఆర్ఎస్ వెంటే ఉంటం.